102 కథ అదిరిపోయిందబ్బా!
on Sep 22, 2017
ఆ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లితో తమ జీవితాలను ఒకటి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ.. వారు ఒకటి తలిస్తే... దైవం మరొకటి తలచింది. విధి ఆడిన వింత నాటకంలో... వారిద్దరూ విడిపోయారు. తన ప్రేయసి కనిపించకపోవడంతో... ఆ ప్రియుడు... వెతకని చోటు లేదు. చివరకు తాను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయ్. దాంతో విధివంచితుడై ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక్కడ అతనికూడా తెలియని బాధాకరమైన విషయం ఏంటంటే... ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. కట్ చేస్తే.. 20 ఏళ్లు గడిచిపోయాయ్. బలీమైన సమస్యలో చిక్కుకున్న ఓ 19 ఏళ్ల అమ్మాయ్.. విలన్స్ ఉచ్చు నుంచి తప్పించుకొని.. ఆ విఫల ప్రేమికుడి వద్దకు చేరింది. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయికి అతను దేవుడిచ్చిన తండ్రి అయ్యాడు. ‘నీకేం భయం లేదు.. నేనున్నాను’ అని ఆ భరోసా ఇచ్చాడు. ఆ అమ్మాయి కోసం ఎంతటి సాహసానికైనా తెగబడ్డాడు. విలన్స్ బెడద నుంచి ఆ అమ్మాయి కాపాడాడు. అసలు విషయం ఏంటంటే... ఆ అమ్మాయి ఎవరో కాదు.. తన ప్రియురాలి కూతురే. అసలు తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి ఎందుకు అయ్యింది? ఒంటరిగా మిగిలిపోయిన హీరో జీవితంలోకి తన ప్రియురాలి కూతురే రావడం ఏంటి? ఇంతకీ తన ప్రియురాలు ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ. కథ బావుంది కదూ. ఏ సినిమలోదీ కథ అనేగా మీ డౌట్. బాలకృష్ణ 102వ సినిమా కథ ఇదే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కథ... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమాలకు సినిమాలే లీకైపోతున్న నేటి రోజుల్లో.. కథలు లీకవ్వడం పెద్ద విషయమేం కాదు కానీ.. ఈ కథ మాత్రం చాలా బావుందని అందరూ అనుకుంటున్నారు. ఈ కథ విన్నవారంతా.. ‘బాలయ్యకు హిట్ గ్యారెంటీ’ అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. ఏమవుతుందో.