English | Telugu

మిస్టర్ కెకె మూవీ రివ్యూ

on Jul 19, 2019

నటీనటులు: విక్రమ్, అక్షరా హాసన్, అభి హాసన్ తదితరులు
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ ఆర్. గుత్తా
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: టి. శ్రీధర్, టి. నరేశ్ కుమార్
రచన, దర్శకత్వం: రాజేశ్ సెల్వ
విడుదల తేదీ: 19 జూలై 2019

విక్రమ్ ఎంచుకునే కథలు, పాత్రలు బావుంటాయి. కానీ, ఎందుకో ఇటీవల సరైన విజయాలే దక్కలేదు. కథ, అందులో అతడి పాత్ర బాగున్నప్పటికీ... కథనం, దర్శకత్వం వంటివి సరిగా కుదరకపోవడమో, మరో కారణమో ఆశించిన విజయాలు దక్కలేదు. మరి, కమల్ హాసన్ నిర్మాణంలో... కమల్ 'చీకటి రాజ్యం' దర్శకుడు రాజేష్ సెల్వ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'మిస్టర్ కెకె' ఎలా ఉంది? లుక్‌తో ఆకట్టుకున్న విక్రమ్ సినిమాతోనూ ఆకట్టుకున్నాడా?   

కథ: మలేసియాలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మిస్టర్ కెకె (విక్రమ్)ను ట్రాఫిక్ పోలీసులు హాస్ప‌ట‌ల్‌లో జాయిన్ చేస్తారు. అదే హాస్ప‌ట‌ల్‌లో పని చేసే వాసు (అభి హాసన్)ను కొట్టి, అతడి భార్య ఆదిరా (అక్షరా హాసన్)ను ఎవరో కిడ్నాప్ చేస్తారు. 'కెకె'ను బయటకు తీసుకువస్తే ఆదిరాను ప్రాణాలతో పంపిస్తామని వాసుకు ఫోన్ చేస్తారు. వాళ్లు చెప్పినట్టే 'కెకె'ను వాసు బయటకు తీసుకొస్తాడు. ఈలోపు 'కెకె' ఒక క్రిమినల్ అని, గతంలో ఏజెంట్‌గా ప‌ని చేశాడ‌ని, త‌ర్వాత డ‌బుల్ ఏజెంట్‌గా మారాడ‌ని మలేషియా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు తెలుస్తుంది. ఒక వ్యాపారవేత్త హత్య కేసులోనూ అతడిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. దాంతో 'కెకె' కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. వాళ్లకు కెకె దొరికాడా? వ్యాపారవేత్తను హత్య చేసిందెవరు? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా.


విశ్లేషణ: యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కథగా చెప్పుకోవాలంటే పెద్దగా ఏమీ లేదు కానీ... విక్రమ్ నటన, జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టాయి. ప్రతిసారీ కథ, కథలో మలుపులు, క్యారెక్టర్‌పై ఎక్కువ దృష్టి సారించే విక్రమ్... ఈసారి హాలీవుడ్ స్టయిల్ టేకింగ్, స్టయిలిష్ యాక్టింగ్ మీద దృష్టి పెట్టాడు. బహుశా... పాత్రలో సీరియస్ లుక్ అతణ్ణి ఆకట్టుకుందేమో. మ్యాగ్జిమ‌మ్ సినిమా అంతా ఒక్క‌టే సీరియ‌స్‌గా క‌నిపిస్తాడు. కెకె పాత్ర నటుడిగా విక్రమ్ స్థాయికి సవాల్ విసిరేది కాదు. కానీ, అతడి నటన పాత్ర స్థాయిని పెంచింది. పెద్దగా డైలాగులు లేవు. కేవలం హావభావాలతో సన్నివేశంలో భావాన్ని వ్యక్తం చేయాలి. ఎన్నో క్లిష్టతరమైన పాత్రలు చేసిన విక్రమ్... అందులో అవలీలగా నటించాడు. అతడి నటనను హైలైట్ చేసేలా, దర్శకుడు రాజేష్ సెల్వ చేసిన చిన్న చిన్న తప్పులను కవర్ చేసేలా జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించాడు. విక్రమ్ తెరపైకి వచ్చిన ప్రతిసారీ వినిపించే నేపథ్య సంగీతం అయితే ప్రేక్షకుల్లో ఓ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కథకుడిగా కంటే రాజేష్ సెల్వ దర్శకుడిగా ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు. ఒక హాలీవుడ్ సినిమాను తీసినట్టు 'మిస్టర్ కెకె'ను తీశారు. అయితే... కథనం, దర్శకత్వం పరంగా స్లో నేరేషన్‌తో ఫ‌స్టాప్‌లో ప్రేక్షకుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసేలా చేశాడు. టేకింగ్, యాక్ష‌న్ సీన్స్ పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా హాలీవుడ్ సినిమా అనిపించేలా చేశాడు. యాక్షన్ థ్రిల్ల‌ర్‌లో ఎమోష‌న్‌ను చ‌క్క‌గా మిళితం చేశాడు. అయితే... చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ కావడం మైనస్. గర్భవతిగా అక్షరా హాసన్ ఆకట్టుకున్నారు. వాసు పాత్రలో నటించిన నాజర్ కుమారుడు అభి హాసన్ పర్వాలేదు. మిగతా నటీనటులు పాత్రలకు తగ్గట్టు ఉన్నారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన 'ఒక్క నవ్వు చాలు' బావుంది.

ప్లస్ పాయింట్స్:
విక్రమ్ నటన, స్టైల్
జిబ్రాన్ నేపథ్య సంగీతం
యాక్షన్ సీన్స్, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:
ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ
స్లో నేరేషన్

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఫైట్, సాంగ్, హీరోయిజమ్ అంటూ లెక్కలు వేసుకుని తీసిన సినిమా కాదిది. కానీ, పక్కా యాక్షన్ సినిమా. హాలీవుడ్ స్ట‌యిల్‌లో తెరకెక్కిన యాక్షన్ సినిమా. విక్రమ్ సరసన హీరోయిన్ ఎవరూ లేరు. ప్రేక్షకుడికి ఆ సంగతి గుర్తుకు రానంతగా సినిమా ముందుకు సాగుతుంది. సినిమాలో అక్కడక్కడా నిదానంగా ముందుకు వెళుతుంది. అటువంటి చిన్న చిన్న తప్పులను ప్రేక్షకులు క్షమిస్తే మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

రేటింగ్: 2.25/5


Cinema GalleriesLatest News


Video-Gossips