English | Telugu

మెహ‌బూబా రివ్యూ

on May 11, 2018

 

న‌వ‌త‌రం తెలుగు సినిమాకి దొరికిన మేలిమి ముత్యం పూరి జ‌గ‌న్నాథ్‌.  పూరి వ‌చ్చాక‌.. తెలుగు సినిమా న‌డ‌క‌, న‌డ‌త మారాయి. వేగం వ‌చ్చింది. హీరోయిజం మారింది. మేకింగ్ విష‌యంలోనూ పూరి త‌న‌దైన ముద్ర వేయ‌గ‌లిగాడు. కాక‌పోతే.. ఇదంతా గ‌తం. పూరి ప్ర‌స్తుతం త‌న పూర్వ‌వైభ‌వాన్ని సంపాదించే ప‌నిలో ఉన్నాడు. ఒక్క హిట్టు కోసం ఆప‌సోపాలు ప‌డుతున్నాడు.  ఇప్పుడు త‌న‌యుడు ఆకాష్‌పూరి బాధ్య‌త‌ని కూడా నెత్తిమీద వేసుకుని తీర్చిదిద్దిన చిత్రం `మెహ‌బూబా`. ఈ సినిమాతో పూరి ముందు రెండు గోల్స్ ఉన్నాయి. ఒక‌టి... ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం, రెండోది.. త‌న‌యుడ్ని హీరోగా నిల‌బెట్ట‌డం. ఈ రెండింటిలోనూ పూరి విజ‌యం సాధించాడా?  పూరి మార్క్ ఈ సినిమాలో ఎంత వ‌ర‌కూ క‌నిపించింది..?

* క‌థ‌

రోష‌న్ (ఆకాష్‌), అఫ్రిన్ (నేహాశెట్టి) ఇద్ద‌రికీ గ‌త జ‌న్మ‌లు గుర్తొస్తుంటాయి. రోష‌న్ హైద‌రాబాద్ అబ్బాయి అయితే... అఫ్రిన్ పాకిస్థానీ అమ్మాయి. చ‌దువు నిమిత్తం అఫ్రిన్ ఇండియా వ‌స్తుంది. ఇక్క‌డ ఓ ప్ర‌మాదం నుంచి అఫ్రిన్‌ని కాపాడ‌తాడు రోష‌న్‌. పూర్వ జ‌న్మ‌కూ అఫ్రిన్‌కీ ఏదో సంబంధం ఉంద‌ని గ్ర‌హిస్తాడు రోష‌న్‌. అటు అఫ్రిన్‌కీ రోష‌న్ వ‌ల్ల పూర్వ జ‌న్మ జ్ఞాప‌కాలు ఒకొక్క‌టిగా గుర్తొస్తుంటాయి. మ‌రి గ‌త జ‌న్మ‌లో వీరిద్ద‌రి జీవితాల్లో ఏం జ‌రిగింది? ఈ జ‌న్మ‌లో ఎలా క‌లుసుకున్నారు?  అనేదే మెహ‌బూబా క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ఇదో పూర్వ జ‌న్మ క‌థ‌. ఓ జ‌న్మ‌లో విడిపోయిన ప్రేమికులు మ‌రో జ‌న్మ‌లో ఎలా క‌లుసుకున్నారు?  అనేదే పాయింట్‌. ఇలాంటి క‌థ రాసుకోవ‌డం పూరికి కొత్త కావొచ్చు. చూడ్డం మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త కాదు. జాన‌కీ రాముడు నుంచి మ‌గ‌ధీర వ‌ర‌కూ ఇలాంటి సినిమాల్ని చాలా చూశారు. అయితే దీనికో మిల‌ట‌రీ నేప‌థ్యం జోడించి, దేశ భ‌క్తి అనే కోటింగు ఇవ్వాల‌ని చూశాడు పూరి. మేకింగ్ విష‌యంలో నేను చాలా మారాను... కొత్త పూరిని ఈసినిమాతో చూడ‌బోతున్నారు - అని చెప్పుకొచ్చిన పూరి... ఆ మార్పు అక్క‌డ‌క్క‌డ చూపించాడు. కానీ.. మొత్తంగా చూస్తే అదే పాత పూరి క‌నిపించాడు. పూరి క‌థలో, పాత్ర‌ల్లో ఉండే జోష్ ఈ సినిమాలో క‌నిపించ‌లేదు. దాన్ని కాస్త అండ‌ర్ ప్లే  చేద్దామ‌ని పూరి భావించి ఉండొచ్చు. కానీ అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. పూరి తాలుకూ.. స్పీడు ఈ సినిమాలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినిమా ప్రారంభం నుంచి.. ముగింపు వ‌ర‌కూ స్లో నేరేష‌న్ బాగా ఇబ్బంది పెడుతుంది. అక్క‌డ‌క్క‌డ పూరి త‌న‌దైన ఛ‌మ‌క్కుల్ని డైలాగుల్లో చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఆయా స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు బాగా పేలాయి.కానీ... అవి కొన్ని సీన్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఓ ప్రేమ జంట ఓ జ‌న్మ‌లో విడిపోయి.. మ‌రో జ‌న్మ‌లో క‌లుసుకుంటారా, లేదా? అనే ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు ఆ ప్రేమికులు క‌లుసుకొంటే బాగుంటుంద‌ని ప్ర‌తీ ఒక్కరూ కోరుకోవాలి. అలా జ‌ర‌గాలంటే క‌థ‌లో లీనం అవ్వాలి. పూరి ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇండియా - పాకిస్థాన్ ప్రేమ క‌థ‌.. బోర్డ‌ర్ వ్య‌వ‌హారాలు, దేశ‌భ‌క్తి ఇవ‌న్నీ మేళ‌వించ‌డంతో సినిమాలో వినోదానికి ఎక్క‌డా చోటు లేకుండా పోయింది. మ‌న‌స్ఫూర్తిగా ఎంజాయ్ చేయ‌డానికి ఒక్క‌టంటే ఒక్క సీన్ లేకుండా పోయింది. ల‌వ్ స్టోరీలో కొత్త పాయింట్ క‌నిపించ‌లేదు. ఆకాష్ ఫేస్‌లో హీరోయిజం ఎలివేట్ అవ్వ‌లేదు. స‌న్నివేశాల్లో డెప్త్ లేదు. లాజిక్ అంత‌క‌న్నా లేదు. ఎక్క‌డ‌కక్క‌డ కొన్ని స‌న్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో అయినా పూరి పుంజుకుంటాడ‌నిపిస్తే.. అక్క‌డా త‌న‌దైన మార్క్ క‌నిపించ‌లేదు.

* న‌టీన‌టులు

ఆకాష్ బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌మే. ఇప్పుడు హీరో అయ్యాడు. విచిత్రం ఏమిటంటే ఆకాష్‌లో ఇంకా బాల‌న‌టుడి ఛాయ‌లు క‌నిపించ‌డం. అత‌న్ని హీరోగా రిసీవ్ చేసుకోవ‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది. కాక‌పోతే.. న‌ట‌న ప‌రంగా వంక పెట్ట‌లేం. నేహా శెట్టి అందంగా ఉంది. న‌ట‌న‌కు ఛాన్స్ ఉన్న పాత్ర అది. కాక‌పోతే క‌థ‌లో, ఆపాత్ర‌లో బ‌లం లేక‌పోవ‌డంతో.. నేహా కూడా ఏం చేయ‌లేక‌పోయింది. షాయాజీ షిండే, ముర‌ళీ శ‌ర్మ‌ మిన‌హాయిస్తే.. మిగిలిన‌వాళ్లెవ్వరూ మ‌న‌కు తెలిసిన మొహాలు కావు.

* సాంకేతిక వ‌ర్గం

సందీప్ చౌతా సంగీతం బాగుంది. మెహ‌బూబా పాట ఆక‌ట్టుకుంటుంది. మిల‌ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన స‌న్నివేశాలు బాగున్నాయి. గ్రాఫిక్స్ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ద పెట్టాల్సింది. మేకింగ్‌లో పూరి మార్క్ చూపించ‌గ‌లిగాడు.
ద‌ర్శ‌కుడిగా మంచి క‌థ‌ని ఎంచుకోవ‌డంలో విఫ‌ల‌మైనా, కొన్ని డైలాగులు బాగా రాసుకుని ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అయ్యాడు పూరి.

* ఫైన‌ల్ ట‌చ్‌:  ఇండియా - పాకిస్థాన్ ల‌బ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్‌

రేటింగ్‌: 2/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here