కాజల్‌కి షాక్... మీడియా బాయ్ కాట్
on Dec 5, 2018
సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో మీడియా పోటీపడే రోజులివి. మరీ ముఖ్యంగా హీరోయిన్ల ఇంటర్వ్యూలకు కాస్త ప్రాధాన్యత ఎక్కువ. సినిమా పేజీల్లో హీరోయిన్ల ఫొటోలు పెద్దవి వేస్తారు. ఈ ధోరణి చూసే సినిమా సెలబ్రిటీలకు మీడియా అంటే చిన్న చూపు ఏర్పడినట్టుంది. తమ కోసం మీడియా ఎదురు చూస్తుందనే ధీమాతో ఎవరూ చెప్పిన సమయానికి ప్రెస్‌మీట్‌కి రారు. మీడియాను గంటల తరబడి వెయిట్ చేయిస్తారు. ఈ రోజు కాజల్ కూడా వెయిట్ చేయించింది. బెల్లకొండ సాయి శ్రీనివాస్ సరసన ఆమె కథానాయికగా నటించిన 'కవచం' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు రమ్మని మీడియాకు కబురు పంపారు. అరగంట అటూ ఇటూగా మీడియా ఇంటర్వ్యూ కోసం వచ్చింది. కానీ, ఎంతసేపటికీ కాజల్ రాలేదు. చివరికి, 11.45 గంటలకు వచ్చింది. ఆమె కారు దిగిన వెంటనే మీడియా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసింది. ఇంటర్వ్యూను బాయ్ కాట్ చేసి వెళ్ళింది. దాంతో ఆమెకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. చేసేది లేక అక్కడ వున్న ఇద్దరు ముగ్గురికి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళింది.