మనోజ్ వర్సెస్ ఎన్టీఆర్ ... అబద్దమే!
on Jul 6, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ మంచి ఫ్రెండ్స్. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే. స్కూల్, కాలేజ్ డేస్ నుండి ఇద్దరికీ మంచి దోస్తీ ఉంది. అయితే, ఈ స్నేహాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శత్రుత్వంగా మారుస్తున్నారని సోషల్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ శత్రుత్వం నిజ జీవితంలో కాదులేండి.. వెండితెరపైన! అసలు వివరాల్లోకి వెళితే....
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ'కి ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ సినిమా తరువాత మరోసారి వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరవాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా అదే. అందులో మంచు మనోజ్ విలన్ రోల్ చేయనున్నాడని, త్రివిక్రమ్ అతడిని ఫైనలైజ్ చేశాడని గుసగుసలు వినిపించాయి. అందులో ఏ మాత్రం నిజం లేదని మనోజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా 'అహం బ్రహ్మాస్మి'పై మనోజ్ దృష్టి పెట్టారని, అతని దగ్గరికి విలన్ రోల్ చేయమని ప్రతిపాదన ఏదీ రాలేదని స్పష్టం చేశాయి.