మళ్ళీరావా మూవీ రివ్యూ
on Dec 8, 2017
ట్రెండ్ తో నిమిత్తం లేకుండా... ఎప్పుడు విడుదలైన విజయం సాధించే కథలేమైనా ఉంటే అవి ప్రేమకథలే. లవ్ స్టోరి సరిగ్గా తెరకెక్కిస్తే.. విజయం తథ్యం. పైగా తెలుగు తెరపై మెచ్యూర్డ్ లవ్ స్టోరీలొచ్చి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో మంచి ప్రేమకథ తెరకెక్కితే...జనాలు విరగబడి చూస్తారు. పైగా ప్రస్తుతం పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా చూపించడం లేదు జనాలు. నచ్చితే చూసేస్తున్నారు. అయితే... సినిమా నచ్చేట్టు తీస్తే సరిపోదు. పబ్లిసిటీ కూడా అవసరం. ఇళ్లలో టీవీలను వదిలిపెట్టి థియేటర్లకు జనాలను తెచ్చేలా పబ్లిసిటీ ఉండాలి. అప్పుడు విజయం తప్పనిసరిగా వరిస్తుంది. .
ఈ శుక్రవారం ‘మళ్లీ రావా’ అనే సినిమా విడులైంది. చాలా విరామం తర్వాత సుమంత్ కథానాయకునిగా నటించిన సినిమా ఇది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. మెచ్యూర్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రం జనాలను ఆకట్టుకునేలా ఉందా? లేదా? తెలుసుకునేముందు కథేంటో చూద్దాం.
కథ:-
కార్తిక, అంజలి... 9th class లోనే వీళ్లద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. ఒడిదుడుకులు, ఎడబాటుల కారణంగా మరింత బలపడింది. ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ... కార్తిక్ పై సదాభిప్రాయం లేని అంజలి తల్లి... అంజలికి చెప్పిన మాటలు... కార్తీక్ తో జీవితాన్ని ఊహించుకోడానికే.. భయపడేలా చేస్తాయ్. . దాంతో కార్తీక్ తో పెళ్లికి అంజలి ‘నో’ చెప్పేస్తుంది. మరొకరితో పెళ్లి కూడా సెటిల్ అవుతుంది. అయితే..ఎప్పుడైతే.. మరొకరికి ‘ఓకే’ చెప్పిందో అక్కడ్నుంచి ఆ అమ్మాయి మనసు మనసులో ఉండదు. చివరకు ఏమైంది? కార్తిక్, అంజలి కలిశారా? ఎలా కలిశారు? అపరిపక్వమైన మనస్తత్వంతో కార్తిక్ మనసుకు గాయం చేసిన అంజలిని కార్తిక్ క్షమించాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ.
విశ్లేషణ:-
చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమకథను చూసిన ఫీలింగ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మనసులతో చెడుగుడు ఆడేశాడు. కథ ఆధ్యంతం ప్రేమికుల అంతర్మథనంతోనే సాగుతుంది. నిజానికి ప్రేమికులు విడిపోడానికి పెద్ద కారణాలుండవ్. చాలా సిల్లీ కారణాల వల్లే విడిపోతారు. అర్థం చేసుకోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలవన్నీ. దాన్ని తెరపై చాలా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే... సినిమా కాస్త స్లో అయిన ఫీలింగ్. కథనంలో వేగం ఉంటే ిఇంకా బావుండేది. అయితే.... భావోద్వేగాలను పండించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాలో వేగం తక్కువ ఉన్నా విసుగైతే లేదు. చిన్న లైన్ ను జనరంజకంగా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే.. అనవసరపు కామెడీ సీన్స్ మాత్రం ఇరిటేట్ చేశాయ్.
సుమంత్ చాలా చక్కగా నిలకడగా... డిగ్నిఫైడ్ గా పాత్రోచితంగా నటించాడు. ఈ సినిమాలో దర్శకుని తర్వాత చెప్పుకోవలసింది హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గురించే. అద్భుతంగా నటించిందని చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె పలికించిన భావాలు నిజంగా వండర్. ముఖ్యంంగా ‘నా జ్ఙాపకాలు నాకు తిరిగిచ్చేయ్’ అని హీరోను అడిగి వెళ్లిపోయే సన్నివేశంలో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎవరికైనా గుండె బరువెక్కిపోవాల్సిందే. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ కూడా బావుంది. ఎడిటర్ కి చాలా పని మిగిలి వుంది.
చివరిగా చెప్పేదేంటంటే... నిర్మాత మంచి సినిమా తీశాడు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి మంచి పబ్లిసిటీ కూడా అవసరం. ఆ విషయంపై కాస్త దృష్టి సారిస్తే.. విజయం తథ్యం.
రేటింగ్: 2.75