మెగా కాంపౌండ్‌లో మహేశ్... ఫర్ ఎ చేంజ్...
on Sep 10, 2018
గీతా ఆర్ట్స్ అంటే మెగా హీరోల మాతృసంస్థ. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ని అటు ఇండస్ట్రీలోనూ... ఇటు ప్రేక్షకుల్లోనూ... మెగా నిర్మాత అంటుంటారు. గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారంటే... అందులో కచ్చితంగా ఎవరో ఒక మెగా హీరో నటిస్తారని కళ్లు మూసుకుని మరీ చెప్పేయవచ్చు. గీతా ఆర్ట్స్ మాత్రమే కాదు... మెగా బ్రదర్ నాగబాబు సంస్థ అంజనా ప్రొడక్షన్స్, రామ్ చరణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై మెగా హీరోలతో సినిమాలు తీశారు. ఇప్పటివరకూ మెగా కాంపౌండ్‌లో... మెగా నిర్మాణ సంస్థల్లో... మెగా హీరోలతో మాత్రమే భారీ సినిమాలు తీశారు. గీతా ఆర్ట్స్2 సంస్థ స్థాపించి మీడియం హీరోలతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. బట్, ఫర్ ఎ చేంజ్... బయట హీరోతో, అదీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా మెగా నిర్మాత అల్లు అరవింద్ ఓ భారీ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడని ఫిలింనగర్ టాక్. 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ సూపర్‌స్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అప్పట్లో 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని చూసి మహేశ్.. దర్శకుడితో పాటు హీరోని ప్రశంసించారు. అప్పట్నుంచి మహేశ్, సందీప్ కాంబినేషన్లో సినిమా అని వినిపిస్తుంది. ఇప్పటికి ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చిందన్నమాట!!