English | Telugu

మహర్షి సినిమా రివ్యూ

on May 9, 2019


నటీనటులు: మహేష్ బాబు, పూజా హెగ్డే, 'అల్లరి' నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాష్ రాజ్, జయసుధ,

జగపతిబాబు, సాయికుమార్, రాజీవ్ కనకాల, నాజర్, 'వెన్నెల' కిషోర్ తదితరులు

నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా

పాటలు: శ్రీమణి

సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్

కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పరమ్.వి.పొట్లూరి, పెర్ల్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె

కథనం, దర్శకత్వం: వంశీ పైడిపల్లి

విడుదల తేదీ: మే 9 2019

'మహర్షి' సినిమా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా కావడంతో దీని పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అదే సమయంలో ప్రచార చిత్రాలు సినిమాకు మైనస్ గా మారాయి. ట్రైలర్, కొన్ని స్టిల్స్ లో 'శ్రీమంతుడు' ఛాయలు కనిపించాయని కామెంట్స్ వినిపించాయి. అవన్నీ పక్కన పెడితే ఈ రోజు సినిమా విడుదలైంది. 'శ్రీమంతుడు'లా ఉందా? కొత్తగా ఉందా? ఒకసారి చదవండి. 

 

కథ:

సక్సెస్ కి చిరునామా లాంటి వ్యక్తి రిషి కుమార్ (మహేష్ బాబు). అమెరికాలో ప్రముఖ కంపెనీకి సీఈవో అవుతాడు. ఏడాదికి వేల కోట్లలో జీతం! అటువంటి వ్యక్తి అమెరికాను వదిలి, కాలేజీలో తనతో పాటు చదువుకున్న స్నేహితుడు రవిశంకర్ ('అల్లరి' నరేశ్) కోసం తెలుగు రాష్ట్రంలోని మారుమూల ఊరు రామాపురానికి వస్తాడు. రవిశంకర్ కోసం రిషికుమార్ ఎందుకు వచ్చాడు? రామాపురానికి వచ్చాక రైతుల గురించి ఏం తెలుసుకున్నాడు? రైతు సంక్షేమానికి ఏం చేశాడు? గెలుపు అంటే డబ్బు మాత్రమే అనుకున్న రిషికుమార్ ఆలోచనల్లో ఎటువంటి మార్పు వచ్చింది? అనేది చిత్రకథ. 

 

ప్లస్ పాయింట్స్:

మహేష్ బాబు

కథలో సందేశం

రైతు సమస్యలు వివరించే సన్నివేశాలు

కాలేజీ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు

'అల్లరి' నరేష్, పూజా హెగ్డే

 

మైనస్ పాయింట్స్:

కథ, కథనం

నిడివి (మూడు గంటలు)

రొటీన్ ఫార్ములా సీన్స్

బలమైన భావోద్వేగాలు

 

విశ్లేషణ:

'పెద్ద పెద్ద కంపెనీల్లో కూర్చుని బ్రెడ్డు జాము తినేవాళ్ల దగ్గర్నుంచి కాకా హోట‌ల్‌లో టీ బన్ను తినేవారి వరకూ అందరికీ రైతు అవసరమే. రైతు అనేవాడు పండించకపోతే ఎవరికీ ఫుడ్డు ఉండదు. అటువంటి రైతుతో తమకు సంబంధం లేనట్టు అందరూ బతుకుతున్నారు. రైతు సమస్యలు ఎవరికీ పట్టడం లేదు. రైతు మరణిస్తే సింపతీ చూపిస్తున్నారు. రైతుకు కావలసింది సింపతీ కాదు.. సహాయం' అని చెప్పే చిత్రమిది. ఒకరకంగా 'శ్రీమంతుడు'కు మరో వెర్షన్ అనడంలో తప్పు లేదు. రైతు సమస్యలను మరో దృక్కోణంలో చూపించిన సినిమా. అయితే... ఇది 'శ్రీమంతుడు' కాదు, 'మహర్షి'. ఎందుకంటే...

 

'శ్రీమంతుడు'లో హీరో మొదటి నుంచి వ్యవసాయం మీద ఆసక్తి కనబరుస్తారు. 'మహర్షి'లో విజయం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే అనుకున్న ఓ యువకుడు, స్నేహితుడి కోసం పల్లెటూరికి వచ్చి, అక్కడ రైతు సమస్యలు తెలుసుకుని చలించి, వారి సంక్షేమం కోసం ఏం చేశాడనేది సినిమా. రెండు సినిమాల్లో హీరో పాత్రలు వేర్వేరు కావొచ్చు, ప్రయాణించిన మార్గాలు వేర్వేరు కావొచ్చు. కానీ, అంతిమంగా చేరిన లక్ష్యం ఒక్కటే. ప్రయాణంలో ఎదురైన కొన్ని పరిస్థితులు ఒక్కటే. అందువల్ల, ఇంతకు ముందు మహేష్ ఇటువంటి సినిమా చేశాడని అనిపిస్తుంది. 'శ్రీమంతుడు'ని, 'మహర్షి'ని వేరు చేసే అంశం ఒక్కటే... 'మహర్షి'లో కాలేజీ ఎపిసోడ్. అయితే... అది అసలు కథ కాదు. అసలు కథకు ముందు వచ్చే కొసరు కథ. హీరో ప్రేమకథకు, స్నేహితుడితో బంధానికి వాడుకున్న కొసరు కథ. కాలేజీ సన్నివేశాల్లో మహేష్ జోష్ ఫుల్ గా నటించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి బృందం ఒక రొటీన్ కథను ఎంపిక చేసుకుని మహేష్ మేనియా మీద సినిమాను నడిపించాలని చూసింది. వంశీ పైడిపల్లి మేకింగ్ స్టైలిష్‌గా ఉంది. మహేష్ ఇంట్రడక్షన్, తరవాత కొన్ని సన్నివేశాల్లో హీరో ఎలివేషన్ షాట్స్ బాగా తీశాడు. అయితే... కథకు కీలకమైన ఎమోషనల్ సీన్స్ సరిగా తీయలేకపోయాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాల్లో 'ఇదే కదా ఇదే కదా నీ కథ', 'పదరా పదరా' బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. పలు సన్నివేశాలను కుదించి సినిమా నిడివి తగ్గించవలసింది. నిర్మాణ విలువలు బావున్నాయి. 

 

నటీనటుల పనితీరు:

'మహర్షి'లో రిషికుమార్ పాత్ర మహేష్ బాబుకు కొత్త ఏమీ కాదు. 'శ్రీమంతుడు'లో, 'భరత్ అనే నేను'లో పాత్రలు ఇటువంటివే. మహేష్ స్టయిలింగ్, యాక్టింగ్ కూడా ఆ సినిమాలను గుర్తుకు తెస్తుంది. అయితే... మహేష్ వల్ల కొన్ని సన్నివేశాలు మరింత స్టైలిష్‌గా అనిపించాయి. మహేష్ నటన వల్ల కొన్ని సన్నివేశాలు బావున్నాయి. 'గమ్యం', 'శంభో శివ శంభో' సినిమాల తరవాత మరోసారి భావోద్వేగభరిత పాత్రలో 'అల్లరి' నరేష్ ఆకట్టుకున్నాడు. అతడి నటన సినిమాకు ప్లస్ అయ్యింది. పాటల్లో పూజా హెగ్డే అందం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, జయసుధ, 'వెన్నెల' కిషోర్, నాజర్, సాయికుమార్... పాత్రల పరిధి మేరకు నటించారు. ఎవరికీ సవాల్ విసిరేంత పాత్రలు కథాపరంగా కుదరలేదు.

 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'మనస్యులందు నీ కథ మహర్షిలాగ సాగదా' అని 'ఇదే కదా ఇదే కదా నీ కదా' పాటలో ఒక లైన్. 'మహర్షి'లో రిషికుమార్ ప్రయాణం చాలాసేపు సాగింది. ఇంటర్వెల్ కార్డు పడుతుందని ప్రేక్షకుడు భావించిన ప్రతిసారీ ముందుకు సాగింది. పల్లెటూరిలో 'అల్లరి' నరేష్ కు మహేష్ అండగా నిలిచే సన్నివేశాలు సాగదీశారు. పతాక సన్నివేశాల దగ్గర కూడా అదే తంతు. మొత్తానికి సినిమాను సాగదీసి సాగదీసి వదిలారు. ఈ సాగదీత మధ్యలో వచ్చే కొన్ని మంచి సన్నివేశాలు ప్రేక్షకుడికి సంతృప్తిని ఇస్తాయి. పాటల్లో పూజా హెగ్డే అందం కొందరికి రిలీఫ్ ఇస్తుంది. మహేష్ అభిమానులకు సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. 


రేటింగ్: 2.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here