English | Telugu

"లవర్" మూవీ రివ్యూ

on Jul 20, 2018

 

నటీనటులు:  రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల తదితరులు....
సంగీతం: సాయికార్తీక్                                
కెమెరా:  సమీర్ రెడ్డి                          
నిర్మాత: హర్షిత్ రెడ్డి                               
దర్శకత్వం: అనీష్ కృష్ణ                                 
విడుదల తేదీ: 20/07/2018  

రాజ్ తరుణ్ హీరోగా "అలా ఎలా" ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "లవర్". దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందిన  చిత్రంపై వరుస పరాజయాలతో కాస్త ఢీలాపడిన రాజ్ తరుణ్ ఈ చిత్రంపై  పెట్టుకొన్నాడు. రిద్ధి కుమార్ కథానాయియికగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ "లవర్" ఆడియన్స్ ను ఆకట్టుకొన్నాడో లేదో చూద్దాం.

కథ:

బైక్స్ మోడిఫై చేస్తూ అన్నయ్య-వదినలతో జీవిస్తుంటాడు రాజ్ (రాజ్ తరుణ్). తొలిచూపులోనే హాస్పిటల్ లో పరిచయమైన చరిత (రిద్ధి కుమార్)ను తొలిచూపులోనే ప్రేమలో పడి.. ఆమె కూడా తనను ఇష్టపడేలా చేసుకొని ఇంట్లో పరిచయం చేసి త్వరలోనే పెళ్లి చేసుకొందామని ఫిక్స్ అయిపోతారు. అప్పుడే పరిస్థితులు అడ్డం తిరగడం మొదలవుతుంది. ఉన్నట్లుండి చరితను కొందరు రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి రాజ్ కాపాడుకొంటాడు కానీ.. రెండోసారి మాత్రం రాజ్ అన్నయ్య (రాజీవ్ కనకాల)ను చంపి మరీ చరితను ఎత్తుకెళ్లిపోతారు. అసలు చరితను ఎత్తుకెళ్ళాల్సిన అవసరం ఏముంది? రాజ్ ఆమెను సురక్షితంగా కాపాడుకోగలిగాడా? అనేది "లవర్" సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

పాజిటివ్స్:

మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
రాజీవ్ కనకాల  

నెగిటివ్స్:

రొటీన్ కథ-కథనం

ఎనాలసిస్:

అనీష్ కృష్ణ రాసుకొన్న కథలో దమ్ములేదు అనుకొంటే.. స్క్రీన్ ప్లేతో మరింత కన్ఫ్యూజ్ చేశారు. అసలు ఎక్కడో మొదలైన ఫ్లాష్ బ్యాక్ ఎక్కడికి వచ్చాక డిస్ క్లోజ్ అయ్యింది అనే విషయం ఎవరికీ అర్ధం కాదు. ఇక ఏదో మిషన్ ఇంపాజబుల్ రేంజ్ లో హైప్ ఇచ్చిన కథ చివరికి వచ్చేసరికి "ఒక్కడున్నాడు" సినిమాను తలపించడం, ఎండింగ్ ఏమో హాలీవుడ్ చిత్రం "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్"ను గుర్తుచేయడం పుణ్యమా అని 2014లో విడుదలైన "అలా ఎలా" తర్వాత అనీష్ కృష్ణ ఈ సినిమా కోసమా నాలుగేళ్ళు శ్రమించాడు అనిపిస్తుంది. మొదటి సినిమాతో చాలా లైట్ హ్యూమర్ తో, రెగ్యులర్ ఆర్టిస్టులతో అలరించిన అనీష్ కృష్ణ.. "లవర్"లో భారీ ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ & సీజన్డ్ కమెడియన్స్ ఉన్నప్పటికీ పెద్దగా నవ్వించలేక.. దర్శకుడిగానే కాక కథకుడిగానూ ఫెయిల్ అయ్యాడు.

నటీనటులు:

రాజ్ తరుణ్ కొత్తగా కనిపించడం కోసం పెట్టుకొన్న పిలక కాస్త కొత్తగా ఉంది కానీ.. మనోడి పెర్ఫార్మెన్స్ విషయంలో పెద్దగా ఇంప్రూవ్ మెంట్ ఏమీ రాలేదు. ముఖ్యంగా చిత్తూరు యాసలో మాట్లాడాలని చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది.
రిద్ధి కుమార్ చూడ్డానికి నిఖిలా వర్మ ("మేడ మీద అబ్బాయి" హీరోయిన్) చెల్లెల్లా కనిపించినప్పటికీ.. నటనతో మెప్పించలేకపోయింది. అమ్మాయి కాస్త పెరిగి పెద్దైతే బాగుండే అవకాశాలున్నాయి. రాజీవ్ కనకాలకు మంచి వెయిట్ ఉన్న రోల్ దొరికింది. తన ఎక్స్ పీరియన్స్ తో ఆ రోల్ ను పండించాడు కూడా. అలాగే.. అజయ్, సుబ్బరాజులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు. సచిన్ కేల్కర్ ఒక్క డైలాగ్ కు పరిమితం అయిపోయాడు.

సాంకేతిక విలువలు:

అయిదుగురు సంగీత దర్శకులు కలిసి కంపోజ్ చేసిన "లవర్" ఆడియో ఆల్బమ్ లో సాయికార్తీక్ స్వరపరిచిన "నాలో చిలిపి కల" తప్ప ఆకట్టుకొనే మరో ట్యూన్ లేదు. ఇక ఆ పాటల చిత్రీకరణ ప్రోమోల్లో చూపించినంత ఆకట్టుకొనే విధంగా లేకపోవడం గమనార్హం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ లావిష్ గా ఉంది. దిల్ రాజు సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాడు అనే విషయం సమీర్ రెడ్డి కెమెరా వర్క్ తోనే తెలుస్తుంది.

సినిమా ఎలా ఉందంటే!

సినిమా మొదలైనప్పట్నుంచి పూర్తయ్యేవరకూ సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క ఆసక్తికరమైన అంశం, ఎంటర్ టైన్మెంట్ లేకుండా సాగింది "లవర్" చిత్రం.   

తెలుగు ఒన్ ప్రోస్పెక్టివ్:

ఆకట్టుకొనే అంశాలేవీ లేని డొల్ల సినిమా "లవర్"  

రేటింగ్: 1.5


Cinema GalleriesLatest News


Video-Gossips