English | Telugu

 జెర్సీ సినిమా రివ్యూ

on Apr 19, 2019

నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, సంపత్, ప్రవీణ్, బాలనటుడు రోనిత్ కమ్రా తదితరుల

నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

పాటలు: కృష్ణకాంత్ (కేకే) 

ఎడిటర్: నవీన్ నూలి 

సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్

సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ 

సమర్పణ: పిడివి ప్రసాద్ 

నిర్మాత‌: సూర్యదేవర నాగవంశీ 

రచన, ద‌ర్శ‌క‌త్వం: గౌతమ్ తిన్ననూరి

విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019

'మజిలీ'లో నాగచైతన్య క్రికెటర్. 'జెర్సీ'లో నాని కూడా క్రికెటరే. స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూసి రెండు సినిమాల మధ్య పోలికలు ఉంటాయేమోనని అనుకున్నారంతా. కథ, హీరో క్యారెక్టర్ పరంగా కొన్ని సారూప్యతలు కనిపిస్తాయేమో... కథనం పరంగా, సినిమా పరంగా రెండూ వేర్వేరు సినిమాలు. రెండిటిలో భావోద్వేగాలు వేరు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ 'జెర్సీ' ఎలా ఉంది? తెలుసుకోండి. 

 

కథ:

అర్జున్ ( నాని)... హైదరాబాదీ రంజీ క్రికెటర్. ఇండియన్ క్రికెట్ టీమ్‌కి సెలెక్ట్ కావాలనేది అతడి కల. డబ్బుకు లొంగిన సెలెక్టర్లు అతణ్ణి ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా... మరొకర్ని సెలెక్ట్ చేస్తారు. ఆ  కోపంతో అర్జున్ క్రికెట్‌ని వదిలేస్తాడు. ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడు. ఓ ఘటన వల్ల అతణ్ణి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అప్పటికి అర్జున్‌కి పెళ్ళై ఎనిమిదేళ్లు. ఓ ఏడేళ్ల కుమారుడు కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్న సారా (శ్రద్ధా శ్రీనాథ్) ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంటుంది. రెండేళ్ల పాటు ఉద్యోగం లేకుండా ఖాళీగా గడిపేస్తాడు అర్జున్. తరవాత మళ్లీ క్రికెట‌ర్‌గా గ్రౌండ్‌లో అడుగుపెడతాడు. ఎందుకు? పదేళ్ల క్రితం వదిలేసిన క్రికెట్‌లోకి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? అప్పుడు సారా స్పందన ఏంటి? పదేళ్ల క్రితం కోపంతోనే క్రికెట్‌ని వదిలేశాడా? మరో కారణం ఏమైనా ఉందా? అర్జున్ జీవితంలో ఏం జరిగింది? అనేది సినిమా. 

 

ప్లస్‌ పాయింట్స్‌:

నాని-శ్రద్ధా శ్రీనాథ్ జోడీ నటన
తండ్రీ కొడుకుల అనుబంధం
గౌతమ్ తిన్ననూరి రచన, దర్శకత్వం
నేపథ్య సంగీతం

 

మైనస్‌ పాయింట్స్‌:

నిడివి ఎక్కువనే ఫీలింగ్ కలగడం
క్రికెట్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు

 

విశ్లేషణ:

'try and try until you die' - ఇది పెద్దలు చెప్పిన ఒక సామెత. 

'మరణించే వరకూ ప్రయత్నించడం కాదు... మరణిస్తామని తెలిసినా ప్రయత్నించాలి' - ఇదీ 'జెర్సీ'లో ఇచ్చిన సందేశం. 

ఇంతకు మించి ఎక్కువ చెబితే సినిమాలో ట్విస్ట్ తెలిసిపోతుంది. సినిమాలో సందేశం ఉంది. అలాగని, క్లాస్ పీకినట్టు ఉండదు. థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు అర్జున్‌ పాత్రతో, ముఖ్యంగా అర్జున్ ఆలోచనలు, బాధ, విజయాలతో ప్రయాణించేలా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ'ని తీర్చి దిద్దాడు. కొడుక్కి పుట్టినరోజు బహుమతిగా 'జెర్సీ' ఇవ్వడానికి అర్జున్ అందర్నీ 500 అప్పు అడుగుతుంటే... 'ఎవరైనా అప్పు ఇస్తే బావుంటుంది' అని ప్రేక్షకుడు ఆ బాధను ఫీలవుతాడు. పర్సులో డబ్బులు తీసుకుంటున్నాడని అర్జున్‌పై భార్య కోప్పడుతుంటే... 'అయ్యో! అపార్థం చేసుకుంటుంది' అని బాధపడతాం. రంజీ ఫైనల్‌లో ముంబైపై హైదరాబాద్ బ్యాట్స‌మ‌న్ ఒక్కొక్క‌రూ పెవిలియన్‌కి చేరుతుంటే... 'అర్జున్ గెలిపిస్తాడు' అని, స్క్రీన్ మీద జరుగుతున్నది సినిమా అని తెలిసినా నిజంగా మ్యాచ్ జరుగుతున్నట్టు ఫీలవుతాం. సినిమా అంత సహజంగా ఉంటుంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ పనితనం ప్రీక్షకులను 1986, 1996లోకి తీసుకు వెళుతుంది. అనిరుధ్ స్వరాల్లో 'అణిగిమణిగిన అలలకిక ఎగిసెరా' పాట బావుంది. నేపథ్య సంగీతం గుర్తించలేనంతగా సన్నివేశాల్లో కలిసింది. నిర్మాణ విలువలు బావున్నాయి. మంచి సినిమాగా చెప్పుకోదగ్గ లక్షణాలున్న ఈ సినిమాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అవి క్షమించదగినవే. సినిమా నిడివి ఎక్కువున్న భావన కలుగుతుంది. క్రికెట్ ప్రాక్టీస్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.

 

నటీనటులు పనితీరు:

తెరపై నాని కంటే అర్జున్ ఎక్కువసేపు కనిపిస్తాడు. అంతలా పాత్రలో జీవించాడు. నటనతో నానితో పోటీ పడి మరీ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. తెలుగు తెరపైకి గత రెండు మూడేళ్లలో కొత్త కథానాయికలు చాలా మంది వచ్చారు. వాళ్లందరిలో మంచి నటి ఎవరు? అని అడిగితే తప్పకుండా శ్రద్ధా శ్రీనాథ్ పేరు ముందు వినిపిస్తుంది. అందం కంటే అభినయంతో ఎక్కువ పేరు తెచ్చుకుంది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ కుమారుడిగా రోనిత్ చక్కగా నటించాడు. ఆ వయసులో భావోద్వేగాలు పలికించిన తీరు అద్భుతం. సత్యరాజ్, ప్రవీణ్, రావు రమేష్, సంపత్... సినిమాలో ప్రతి ఒక్కరూ పాత్రలకు తగ్గట్టు నటించారు.

 

చివరగా:

'జెర్సీ' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో వెంకటేష్ చెప్పినట్టు... నిజంగానే ఈ సినిమా ఓ జీవిత పాఠం. చక్కటి జీవిత సందేశాన్ని ఇస్తుంది. సగటు మనిషి జీవితమంత ప్రయాణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మంచి సినిమా చూశామనే సంతృప్తి ఇస్తుంది. 


రేటింగ్: 3.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here