ఆయనకు వరం... నాకు భాగ్యం
on Jul 27, 2017
‘జై లవకుశ’ఎన్టీయార్ లోని కొత్త యాంగిల్ ని చూపించనుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రావణుడికి నమస్కరించి, రావణుడిలా ప్రవర్తించి అభిమానులనే కాదు, సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆలోచింపజేశాడు తారక్. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మచ్చుకు ఒక్క ‘జై’ పాత్రను మాత్రమే ట్రైలర్ లో చూపించారు. మరి లవకుశలు ఎలా ఉంటారు? ప్రస్తుతం అందరినీ వెంటాడుతున్న ప్రశ్న ఇదే. అసలు ఒకే సినిమాలో మూడు పాత్రలంటే... యంగ్ టైగర్ కి ఇది నిజంగా సవాలే. దీన్ని బట్టి.. ఈ సినిమాలో తారక్ పెర్ ఫార్మెన్స్ పీక్ లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా అతను మంచి నటుడు కూడా. ఇక డాన్స్... తారక్ సినిమా అంటే... డాన్సులకు కొదవే ఉండదు. నేటి తరం హీరోల్లో తారక్ స్థాయి డాన్సర్ లేడనే చెప్పాలి.
ఎందుకంటే.. తను క్లాసికల్ డాన్సర్ కూడా. మరి ‘జై లవకుశ’లో డాన్సులు ఎలా ఉంటాయ్? ఈ విషయాన్నే తన ట్విట్టర్ ద్వారా విశదపరచి.. అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు ఈ చిత్ర దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబి). ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ పూనేలో జరుగుతోంది. ఈ సందర్భంగా బాబీ ట్విట్టర్లో తారక్ డాన్సులకు సంబంధించిన ఓ విషయాన్ని పోస్ట్ల్ చేశాడు. ‘స్వతహాగా నేను తారక్ డాన్సులకు వీరాభిభిమానిని. అలాంటి నా ముందు తారక్ డాన్స్ చేస్తుంటే నమ్మలేకపోతున్నాను. కొందరికీ జన్మత: కొన్ని క్వాలిటీలు అబ్బుతాయి. తారక్ కి నటన, నాట్యం జన్మత: ఆ దేవుడు ఇచ్చిన వరం. ఆయన డాన్స్ ని లైవ్ లో చూడటం నా
భాగ్యం’... ఇది బాబి ట్విట్టర్లో పెట్టిన పోస్ట్. దీన్ని బట్టి ఈ సినిమా డాన్సులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.