ENGLISH | TELUGU  

జై లవకుశ రివ్యూ

on Sep 21, 2017

తారాగణం: ఎన్టీయార్, రాశీఖన్నా, నివేదితాథామస్, సాయికుమార్...
దర్శకత్వం: కె.ఎస్.బాబి
నిర్మాత: నందమూరి కల్యాణ్ రామ్

కామన్ సెన్స్ లేకుండా కథలు రాసుకునేవాడు... సమాజం పట్ల ఇసుమంతైనా అవగాహన లేనివాడూ..  నైతిక విలువల పట్ల అగౌరవభావం ఉన్నవాడూ..  దర్శకునిగా పనికిరాడు. ఇందులో రెండోమాట లేదు. మన టైమ్ బాగోక.. ఇలాంటి వ్యక్తి పొరపాటున సినిమా తీశాడనుకోండీ.. దాన్ని మనం చూశామనుకోండీ...  ఒక్కోసారి తెల్లారుజామున పీడకలలు వస్తుంటాయ్ చూశారూ...! పొద్దున్నే లేవగానే తలంతా పట్టేసినట్లు మనసంతా కలవరంగా.. కల్లోలంగా... ఏదోలా అనిపిస్తుంటుంది. అలాంటి అనుభూతులన్నీ ఆడియన్స్ కి కలుగుతాయ్. సినిమాలో ఎక్కడా లాజిక్కులు ఏడవ్. జంతు లక్షణాలన్నీ పాత్రల్లో కనిపిస్తుంటాయ్.


అందుకే... కథ వినేటప్పుడు.... రాసిన వ్యక్తికి కామన్ సెన్స్, సమాజంపై అవగాహన ఉందా? లేదా? కథలో నైతికవిలువలు ఉన్నాయా? లేవా? ఈ విషయాలను నిర్మాతలు గ్రహించాలి. లేకపోతే... కరెన్సీని కాలవలో పోసినట్టే. కథ మంచిదైతే... సన్నివేశాలు మంచివి పడతాయ్. ఆటోమేటిగ్గా బలమైన పాత్రలు తయారవుతాయ్. అప్పుడు తీస్తూ... దర్శకుడూ ఎంజాయ్ చేస్తాడూ.. చూస్తూ ప్రేక్షకుడూ ఎంజాయ్ చేస్తాడు. సో... ఇందుమూలంగా చెప్పొచ్చేదేంటంటే... ‘షూటింగులకు ఎందుకు తొందర..? స్క్రిప్ట్ సంగతి పక్కాగా చూసుకో ముందర’. అదనమాట విషయం.


ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ సినిమా ఈ గురువారం విడుదలైంది. ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపై... నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.బాబి దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడు బాబీ.. బాగా తీశాడా? లేక.. జరగకూడనిది జరిగిపోయిందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే.. ముందు కథలోకెళ్దాం. 

కథ:

జై, లవ, కుశ.. కవలలు. పెద్దోడు ‘జై’కి నత్తి. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ చేరదీస్తాడు. రంగస్థల కళాకారులుగా పిల్లల్ని పెంచుతుంటాడు. అయితే.. లవకుశులకిచ్చిన పాధాన్యత మాత్రం నత్తివాడైన ‘జై’కి మేనమామ ఇవ్వడు. నాటకాల్లో కూడా అరాకొరా పాత్రలే మనోడికి దక్కుతుంటాయ్. తమ్ముళ్లకు ఎక్కడ చూసినా గుర్తింపే. అన్న ‘జై’కి మాత్రం ఎక్కడికెళ్లినా అవమానమే. ఆ అవమానభారం... లోలోపల పెనుభూతంగా మారుతుంది. నాటక ప్రదర్శనలో ఉన్న తమ్ముళ్లిద్దర్నీ .. స్టేజ్ కి నిప్పట్టించి చంపబోతాడు. ఆ ప్రమాదం నుంచి పసివాళ్లిద్దరూ తప్పించుకొని తాలోదారి అవుతారు. ఆ తర్వాత వాళ్లు ఎలా కలిశారు?  చినతనం లోనే అవమానభారంతో గుర్తింపుకోసం తపించిన ‘జై’.. తర్వాత ఏ విధంగా తయారయ్యాడు? వీరి అన్నదమ్ముల కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:

ఇప్పటివరకూ హీరో త్రిపాత్రాభినయం చేసిన కథలు చాలా వచ్చాయ్. ఇలాంటి కథ మాత్రం రాలేదు. ఇలాంటి కథల్లో హీరోలు అన్నదమ్ములైతే విడిపోవడం సహజం. విడిపోవడానికి కూడా బలీయమైన కారణమే చూపించారు ఇప్పటిదాకా. అయితే.. ఈ కథలో అన్నదమ్ములు విడిపోయే కారణం.. చాలా సిల్లీగా ఉంటుంది. స్టేజీని ‘జై’ తగలబెడతాడు. స్టేజ్ పై.. హనుమంతుడు వేషంలో ఉన్న కుశుడు.. తోకకున్న నిప్పుతో సహా పక్కనున్న పోలీస్ స్టేషన్ పై పడతాడు. దాంతో పక్కనున్న పోలాలు కూడా తగలడతాయ్. ఇక్కడ కుశుడు చేసిన తప్పేంటో తెలీదు కానీ... పాపం వాడ్ని బోస్టన్ స్కూల్లో పడేస్తారు లాజిక్ లేకుండా. ఇక రాముడి వేషంలో ఉన్న లవకుమార్ స్టేజ్ పక్కనే అపస్మారక స్థితిలో పడుంటే.. ఓ పెద్దాయన తీసుకెళ్లి పెంచుతాడు... లాజిక్ లేకుండా. నిప్పంటించిన జై.. రైలెక్కి పారిపోతాడు. మేనమామ ఎటెళ్లాడో అర్థం కాదు. అక్కడ జరిగిందేమో చిన్న అగ్ని ప్రమాదం. ప్రకృతి విపత్తు కాదు. మరి ఇంత ఎలా జరిగిందో అర్థం కాదు.. లాజిక్కే లేకుండా. 


సరే ఆ విషయాలు వదిలేద్దాం. లవకుమార్ పెద్దాడై బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అమాయకుడు, అతిమంచివాడు. ఆ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని ఓ గూండా.. కోటి రూపాయలకు మోసం చేస్తాడు. ఎలా?.. ‘మా ఊరులో చెరువు బాగు చేసుకుంటాం కోటి రూపాయలు లోను కావాలని అడుగుతాడు’ ప్రపంచంలో ఏ బ్యాంక్ వారైనా.. ఊరి చెరువు బాగు చేసుకుంటామని ఏవడో అనామకుడు వచ్చి అడిగితే... లోను ఇస్తారా? లాజిక్ లేకుండా.


ఇక ద్వితీయార్థం.. ‘జై’ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. వాడు క్రూరుడు, దుర్మార్గుడు కావడం వల్ల ఆ అమ్మాయ్ వాడ్ని అసహ్యించుకుంటుంది. దాంతో... తమ్ముడు కుశకుమార్ ని పిలిచి... ‘నువ్వు నాలాగే ఉంటావ్ కదా.. ఆ అమ్మాయిని నా వేషంలో వెళ్లి నువ్వు సెట్ చేయ్.. నేను చేసుకుంటా’ అంటాడు. అంటే... వదినను సెట్ చేసుకొని.. తనకు అప్పజెప్పమని సొంత అన్న అడగడం. ఇంతకంటే పెద్ద పాపం ఏంటంటే... ఈ కుశకుమార్ వెళ్లి... అన్న ఇష్టపడ్డ అమ్మాయిని వాడే సెట్ చేసుకుంటాడు. ఇక నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయండీ? 


పైగా ఇప్పుడు నేను చెప్పిన మూడు పాయింట్లూ కథలో కీలకమైనవి. దీనికి కారకులు ఎవరు? అని మాత్రం అడొగొద్దు. నేను చెప్పలేను. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు. ఇది కూడా అంతే. సినిమా ప్రథమార్ధం సరదాగా తీయాలనుకున్నారు. ద్వితీయార్ధం మాం....చి మాస్ గా తీయాలనుకున్నారు. ప్రయత్నించారు. ఫలితం గురించి అడగొద్దు.


ఇక ఎన్టీయార్... నటునిగా తనని వేలెత్తి చూపించలేం. మూడు కేరక్టర్లనూ పొంతన లేకుండా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా ‘జై’ పాత్రలో ఎన్టీయార్ అభినయాన్ని... అద్భుతః అనాల్సిందే. క్రూరంగా కనిపిస్తూ... ఇంటర్నల్ గా తమ్ముళ్లపై ఉన్న ప్రేమను పలికించండం.. ఈ జనరేషన్లో తారక్ మాత్రమే చేయగలడేమో! చాలా సందర్భాల్లో పెద్దాయన గుర్తొస్తారు. ఈ సినిమా తారక్ షో అంతే. ఇప్పుడున్న హీరోల్లో ఎవరూ కూడా ఈ పాత్రలను ఈ స్థాయిలో చేయలేరు... ఇది నిజం. 


సాంకేతికంగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. తారక్ తర్వాత రెండో స్థానం దేవిశ్రీదే. పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా అద్దిరిపోయింది. మిగిలిన విభాగాలవారు కూడా బాగానే కష్టపడ్డారు. నిర్మాత పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపించింది. కథ, కథనాల విషయంలో జాగ్రత్త పడితే.. ఈ సినిమా ఎక్కడో ఉండేది. 

పంచ్‌లైన్:
టోటల్ గా... లాజిక్కులు వెతక్కుండా... కథ, కథనాల గురించి పట్టింపు లేకుండా.. అభిమానంతో చూస్తే.. సినిమా బాగానే అనిపిస్తుంది. అయితే.. ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే... అలా చూసేవారు కొందరే. అందరూ కాదు. 

రేటింగ్: 2/5

 

ఎన్.బి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.