ఎన్టీఆర్ నోట 'జై బాలయ్య'
on Dec 31, 2018
తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి? రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ పెళ్ళి! జైపూర్‌లో జరిగిన ఈ పెళ్ళికి టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఎక్కువశాతం హాజరయ్యారు. పెళ్ళిలో రాజమౌళి చేసిన డాన్స్ ఓ హైలైట్ అయితే... ప్రభాస్-అనుష్క జోడీ చేసిన సందడి మరో హైలైట్. వీటికంటే హైలైట్ అండ్ హాట్ టాపిక్ ఏంటంటే... అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ నోట బాబాయ్ బాలయ్యబాబు పేరు రావడం! ఎలా మొదలైందో... ఎందుకు మొదలైందో... ఎస్.ఎస్. కార్తికేయ పెళ్ళిలో పార్టీ జరుగుతున్న సమయంలో ఎవరో 'జై బాలయ్య... జై బాలయ్య' అంటూ నినాదాలు చేశారు. పక్కన వున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం 'జై బాలయ్య' అన్నాడు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతోంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే బాలకృష్ణ, ఎన్టీఆర్ సన్నిహితంగా ఉంటారని, మీడియా వెనుక ఉప్పు నిప్పు అన్నట్టు ఉంటారని ఎంతోమంది అనుకుంటున్నారు. ఈ వీడియో రావడంతో బాబాయ్ బాలయ్యపై అబ్బాయ్ ఎన్టీఆర్‌కు ఎనలేని గౌరవం ఉందని అర్థం అవుతుంది. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియోలో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ హైలైట్ అయ్యింది. అంతకుముందు అబ్బాయ్ నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' విజయోత్సవానికి బాలకృష్ణ అతిథిగా విచ్చేశారు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ ఒక్క తాటిపైకి వచ్చిందని అనుకోవాలి.