English | Telugu

ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ

on Feb 9, 2018

సినిమా: ఇంటిలిజెంట్
తారాగణం:  సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి..
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: సి.కల్యాణ్

దర్శకుడు అనేవాడు ముందు మంచి ప్రేక్షకుడై ఉండాలి. అప్పుడే మంచి సినిమాలొస్తాయ్. బైక్ మెకానిక్ లాగా వచ్చిన పని చేసుకుంటూపోతే... ‘పాడిందే పాటరా ఫాచిపళ్ల దాసుడా!‘ అన్నట్టు తయారవుతుంది కెరీర్. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వడం కంపల్సరీ. మన టాలీవుడ్ దర్శకుల్లో కొరవడింది అదే. పక్క రాష్ట్రాల్లో దర్శకులు తెరపై అద్భుతాలు సృష్టిస్తుంటే . మనోళ్లలో ఒకరిద్దరు మినహా అందరూ తీసిన సినిమాలనే మళ్లీ తీస్తూ... చూసిన సినిమాలనే ప్రేక్షకులకు మళ్లీ చూపిస్తూ... సహనానికి పరీక్ష పెడుతున్నారు. 

ఈ శుక్రవారం విడుదలైన ‘ఇంటిలిజెంట్’ సినిమా చూశాక... తప్పకుండా ప్రతి ప్రేక్షకుడూ ఇలాంటి భావనే వ్యక్తం చేస్తాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్, టాప్ డైరెక్టర్లలో ఒకడైన వీవీ వినాయక్... కలయికలో సినిమా అంటే ఎలా ఉండాలి. పైగా... ‘ఖైదీ నంబర్ 150‘ తర్వాత వినాయక్ చేసిన సినిమా ఇది. మరి కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  కానీ... ఈ సినిమా విషయంలో అలాంటివేం కనిపించవ్. రొడ్డకొట్టుడు సినిమా.

కథగా చెప్పుకోడానికి కూడా ఇందులో ఏమీ లేదు. తన ఎదుగుదలకు కారణమైన ఓ పెద్దాయన్ను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంది. వాళ్లపై హీరో పగ తీర్చకుంటాడు. సింపుల్ కథ ఇదే. ఈ లైన్ చుట్టూ నాలుగు ఫైట్లనూ, నాలుగు పాటలను, కథకు ఏ మాత్రం ఉపయోగం లేని కక్కుర్తి కామెడీ సన్నివేశాలనూ చేర్చి.. పరమ రొటీన్ గా సినిమాను తెరకెక్కించాడు వీవీ వినాయక్. సినిమా ఆద్యంతం అంతకుముందు చూసిన సన్నివేశాలే కనబడుతుంటాయ్. దాంతో... ఎలాంటి అనుభూతీ ప్రేక్షుకుడు లోనవ్వడు. విసుక్కోవడం తప్ప. దీనికి తోటు... ఎమోషనల్ (వాళ్ల ఉద్దేశంలో)గా సాగుతున్న సన్నివేశంలో రీజన్ లేని పాటలు.  హీరోగారు ఆవేశంగా ఓ డైలాగ్ కొట్టడం (ఈమెతో కాదు పక్కనోళ్లతో).. అది విని హీరోయిన్ డ్రీమ్స్ లోకి వెళ్లిపోవడం... లొకేషన్ ఛేంజ్. ఫారిన్ లో ఫారిన్ డాన్సర్లతో పాటలు. ఎన్ని సినిమాల్లో చూపిస్తారండీ ఈ గోల?. సినిమా ఆద్యంతం హంగామాలు, ఆర్భాటాలు. 

అనవసరపు బిల్డప్పులు.. ఫైట్లు తప్ప... ‘ఈ సినిమాలో ఇవి గొప్పగా ఉన్నాయ్’ అని చెప్పడానికి ఏమీ లేవు. చివరకు ‘కొండవీటి దొంగ’ సినిమాలో ‘ఛమకు ఛమకు ఛామ్’ పాటను రీమేక్ చేసి... ఖూని చేసిపారేశారు. 
పాత్రధారుల నటన విషయానికొస్తే... సాయిధరమ్ తేజ్ కొత్తగా చేసిందేం లేదు. ఏ పాటికీ.. మామయ్యలిద్దరినీ ఇమిటేట్ చేయడమే సరిపోయింది. లావణ్య త్రిపాఠిది అభినయానికి ఆస్కారమున్న పాత్రేం కాదు. ఏదో గ్లామర్ తో నెట్టుకొచ్చేసింది. ఇక మిగిలిన వాళ్లందరూ ఎవరి పాత్ర వాళ్లు చేసుకుపోయారు. 

నిర్మాతతో మాత్రం డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సాంకేతికంగా కూడా సినిమా బాగానే ఉంది. ముఖ్యంగా ఫైట్లు బావున్నాయ్. టోటల్ గా చెప్పేదేంటేంటే... సినిమా పేరు‘ ఇంటిలిజెంట్’ అయినా... ఆ పేరుకు తగ్గట్టుగా ఈ సినిమాలేదు. 

రేటింగ్: ‘ఈ సినిమాకు రేంటింగ్ ఇచ్చేంత స్థాయి మాకైతే లేదు’  నమస్కారం. . 

బోటమ్ లైన్: పేరుకే ఇంటిలిజెంట్

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here