ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న హీరోయిన్ ప్రణీత
on Oct 16, 2018
తన అందం, అభినయంతో 'అమ్మో.. బాపుగారి బొమ్మో' అనిపించుకున్న హీరోయిన్ ప్రణీత.. తన మంచి మనసుతో 'అమ్మో.. ఎంత మంచి దానివమ్మో' అనిపించుకుంటుంది. ప్రణీత ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఫ్రెండ్స్ కోరడంతో.. గతేడాది బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది ప్రణీత. ఆ సమయంలో పాఠశాల వాతావరణాన్ని, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. అక్కడ ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఆంగ్ల భాషలో కనీస పరిజ్ఞానం లేదని గుర్తించింది. అంతేకాదు ఆ పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అది చూసి అలాంటి పాఠశాలల రూపురేఖల్ని మార్చాలని అనుకుంది. అందులో భాగంగా మొదట హసన్ జిల్లా ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ‘మా నాన్న పుట్టిన ఊరు హసన్ లోని శాంతిగ్రామం. తరువాత బెంగళూరుకు వచ్చేశారు.
నేను పుట్టి, పెరిగింది బెంగళూరులోనే అయినా మా సొంతూరుని మర్చిపోలేనుగా. అందుకే ఆలూరును ఎంచుకున్నా. అక్కడి పాఠశాల అభివృద్ధికోసం అయిదులక్షల రూపాయలను అందించా. విద్యార్థినులకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడం మా మొదటి పని. ఇతర సౌకర్యాలు సహా తరగతుల రూపురేఖల్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేవలం పాఠశాలకు సౌకర్యాలు అందించడమే కాదు.. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నాం' అని చెప్పుకొచ్చింది ప్రణీత.