English | Telugu

కీరవాణి’కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

on Jul 4, 2018

అతని పేరు ఓ రాగం..
అతని జీవనయానం.. స్వరరాగ గంగాప్రవాహం..
దశాబ్దాల గడుస్తున్నా.. అలుపెరగని సంగీత శ్రామికుడాయన..
ఎంత విన్నా... తనివితీరని మహతీ నినాదాలు... ఆయన స్వరాలు...

ఇంత చెప్పాక.. ఆయన ఎవరో... మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలే... ఎస్... ఆయనే... ఎం.ఎం.కీరవాణి.

అసలు ఓ వ్యక్తికి రాగం పేరు పెట్టడమేంటి? అనే డౌట్ చాలామందిలో ఉంది. నిజానికి ఆయనకు ఆ పేరు పెట్డానికి ఓ బలీయమైన కథే ఉంది.

అదేంటంటే...

64 ఏళ్ల క్రితం ‘విప్రనారాయణ’ అనే సినిమా విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి జంటగా నటించారు. ఆ సినిమాకు మన కీరవాణిగారి నాన్నగారైన శివశక్తిదత్త వెళ్లారట. ఆ సినిమాలో ఓ పాట ఆయనకు తెగ నచ్చేసిందట. ఆ పాటే... ‘ఎందుకోయీ... తోటమాలీ... అంతులేని యాతనా... ‘. కీరవాణి రాగంలో ఎస్.రాజేశ్వరరావుగారు ఆ పాటను స్వరపరిచారు. ఆ సినిమా చూసినప్పట్నుంచీ.. రోజులు గడుస్తున్నా.. నెలలు గడుస్తునాన్నా.. ఏళ్లు గడుస్తున్నా..  ఆ పాట మాత్రం శివశక్తిదత్తా గారిని వదిలిపెట్టడంలేదట. చివరకు ఆ పాటపై ఆయనకు మమకారం ఏ స్థాయికి చేరుకుందంటే.. ఆ సినిమా వచ్చిన ఏడేళ్లకు శివశక్తిదత్తాగారికి ఓ అబ్బాయి పుడితే.... ఆ బాబుకి ’కీరవాణి‘ అని నామకరణం చేసేశాడు. దానికి కారణం.. తానకు ఇష్టమైన పాట రాగం అదే కాదా.. అందుకు. ఆ విధంగా మన కీరవాణికి ఆ పేరొచ్చిందన్నమాట.
ఇంకేముందీ... దేవతలు కూడా తథాస్తూ.. అనేసినట్టున్నారు. దాంతో.. రాగం పేరుపెట్టుకున్న కీరవాణి.. రాగాలవాడైపోయాడు.

కీరవాణి...సంగీత దర్శకుడు చక్రవర్తి శిష్యుడు. అలాగే... కేవీ మహదేవన్ ఏకలవ్య శిష్యుడు. అందుకే.. ఆయన పాటల్లో వాళ్లిద్దరి వాసన వినిపిస్తుంటుంది. ఉషాకిరణ్ మూవీస్ ’మనసు మమత’... సంగీత దర్శకునిగా కీరవాణి తొలి సినిమా. రామ్ గోపాల్ వర్మ ‘క్షణక్షణం’ సంగీత దర్శకునిగా కీరవాణి తొలి బ్రేక్. ముఖ్యంగా 1991 నుంచి ఓ అయిదారేళ్లు కీరవాణి శకం అని చెప్పాలి. పాటల కేసెట్లుపై ’కీరవాణి’ అనే పేరుంటే.. చాలు. కేసెట్లన్నీ హాట్ కేకులే. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు - కీరవాణి కాంబినేషన్లో ప్రతి సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్టే.

అల్లరి మొగుడు, ఘరానామొగుడు, సుందరకాండ, పెళ్లి సందడి, మేజర్ చంద్రకాంత్,  బొంబాయి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, అన్నమయ్య.. ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా? ఏ. కోదండరామిరెడ్డి, శరత్, ప్రియదర్శిన్, ఉప్పలపాటి నారాయణరావు, ఈవీవీ సత్యనారాయాణ... ఇలా దర్శకులు మారేవాళ్లు కానీ.. సంగీత దర్సకుడు మాత్రం కీరవాణే. అందుకే... 90వ దశకం అంటే కీరవాణిదే అనాలి.

ఆ తర్వాత సంగీత దర్శకునిగా కాస్త విరామం తీసుకున్న ఈ స్వరమాంత్రికుడు... తన తమ్ముడు రాజమౌళి దర్శకుడు అవ్వగానే.. మళ్లీ తన వీరవిహారం మొదలుపెట్టాడు. రాజమౌళీ తొలి సినిమా ’స్టూడెంట్ నంబర్ 1‘ నుంచి మొన్నోచ్చిన ’బాహుఃబలి కంక్లూషన్‘ వరకూ... అన్ని సినిమాలకూ కీరవాణే కదా సంగీత దర్శకుడు. రాజమౌళీ సినిమాలకు కీరవాణి పాటలు.. ముఖ్యంగా ఆయన నేపథ్య సంగీతమే సగం ప్రాణం అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

అయితే.. అప్పట్లో రాఘవేంద్రరావుకీ... ఇప్పట్లో రాజమౌళీకీ.. మంచి ట్యూన్లని దాచి దాచి ఇస్తాడనే... విమర్శలు కూడా కీరవాణిపై వినిపిస్తూ ఉంటాయండోయ్. ఏది ఏమైనా... గడిచిన నలభై ఏళ్లలో పరిచయమైన గొప్ప సంగీత దర్శకుల్లో  చక్రవర్తి, ఇళయరాజా, తర్వాత చెప్పుకోదగ్గ సంగీత దర్శకుడంటే.. కీరవాణి మాత్రమే అని చెప్పక తప్పదు. ముప్పై ఆరేళ్ల పాటు సంగీత దర్శకునిగా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేయడం కూడా కీరవాణికే దక్కింది.

ఇప్పటికీ ప్రతిష్టాత్మక చిత్రాలంటే.. సంగీత దర్శకునిగా  చాలామంది దర్శక,నిర్మాతలకు కీరవాణే గుర్తొస్తారు. ప్రస్తుతం మహానటుడు నందమూరి తారక రామారావుగారి బయోపిక్ కి సంగీతం అందించే పనిలో బిజీగా ఉన్నారు.
నేడు కీరవాణి పుట్టిన రోజు. 58వ యేట అడుగుపెడుతున్నారు. ఈ సంగీత స్వరఘరి.. జీవనదిగా.. నిరంతరం ఇలాగే సాగాలనీ... శ్రోతలందరకీ శ్రవణానందాన్ని అందించాలని కోరుకుంటోందీ... తెలుగువన్.

హ్యాపీ బర్త్ డే కీరవాణి గారూ...


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here