రూపాయికి 6 రూపాయలు...
on Oct 2, 2018
ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ పేరు ఓ బ్రాండ్. బాక్సాఫీస్ వద్ద ఆ బ్రాండ్ కలెక్షన్స్ కోట్లలో వచ్చేలా చేసింది. తెలుగులో మాత్రమే కాదు... తమిళనాట కూడా ఈ హీరోకి ఎంతోమంది అభిమానులు వున్నారు. 'గీత గోవిందం' సినిమాకు తమిళనాట వచ్చిన వసూళ్ళను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న 'నోటా' నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళంలో 'గీత గోవిందం' తెలుగు వెర్షన్ విడుదల చేశారు. తొలి రోజు 1 కోటి 18 లక్షల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఒక్క 'బాహుబలి' మినహాయిస్తే తెలుగు హీరోలు ఎవరికీ ఈస్థాయిలో వసూళ్లు రాలేదని జ్ఞానవేల్ రాజా చెప్పారు. అదీ తమిళనాట విజయ్ దేవరకొండ క్రేజ్ అని కొనియాడారు. అసలు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఆయన ఎంతకు కొన్నారో తెలుసా? 20 లక్షల రూపాయలకు.
'గీత గోవిందం' మీద రూ. 20లక్షలు పెట్టుబడి పెడితే... తొలి రోజు రూ. 1.18 కోట్లు (గ్రాస్) వచ్చింది ఖర్చులు అవీ ఇవీ పోనూ నిర్మాతకు ఎంత లేదన్నా రూ. 50 లక్షలకు పైగా వచ్చి వుంటుంది. ఎక్కడ 20 లక్షలు? ఎక్కడ 1 కోటి 20 లక్షలు? రూపాయికి ఆరు రూపాయలు లాభం వచ్చింది. ఇదంతా 'అర్జున్‌రెడ్డి' ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాను తమిళనాట చాలామంది చూశారు. విజయ్ దేవరకొండకు అభిమానులు అయ్యారు. అందువల్లే, 'గీత గోవిందం' సినిమాకు ఆ స్థాయిలో భారీ వసూళ్ళు వచ్చాయి. 'నోటా'కు కూడా అదే స్థాయిలో వసూళ్ళు వస్తే విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెరుగుతుంది. లేదంటే 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల విజయాల్లో సింహభాగం క్రెడిట్ దర్శకులు, నిర్మాతల ఖాతాల్లోకి వెళ్తుంది.