English | Telugu

ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ

on Jan 15, 2020

నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, 'వెన్నెల' కిషోర్, సీనియర్ నరేష్, శరత్ బాబు, సుహాసిని, రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్, విజయ్ కుమార్, 'ప్రభాస్' శీను, ప్రవీణ్ తదితరులు, 
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: గోపిసుందర్
సమర్పణ: శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్
నిర్మాతలు: సుభాష్ గుప్త, ఉమేష్ గుప్త 
దర్శకత్వం: వేగేశ్న సతీష్
విడుదల తేదీ: 15 జనవరి 2020

మూడేళ్ళ క్రితం సంక్రాంతికి 'శతమానం భవతి' (2017)తో దర్శకుడు వేగేశ్న సతీష్ మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సంక్రాంతికి 'ఎంత మంచివాడవురా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేగేశ్న సతీష్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.   

కథ:

బాలు (నందమూరి కల్యాణ్ రామ్)కి చిన్నతనం నుండి బంధాలు, బంధుత్వాలు అంటే ఎంతో ఇష్టం. 'పుట్టినరోజుకు ఏం బహుమతి కావాలి?' అని తండ్రి అడిగితే... 'బంధువులు అందరినీ పిలిస్తే చాలు' అని చెబుతాడు. అందరూ తనవాళ్లు అనుకునే బాలు, ఓ రోడ్డు ప్రమాదంలో తల్లితండ్రులు మరణించిన తర్వాత ఒంటరివాడు అవుతాడు. అతణ్ణి తమ ఇంటికి తీసుకువెళ్లడానికి బంధువులు ఎవరూ ముందుకు రారు. బాలు తండ్రికి స్నేహితుడు (నరేష్) హాస్టల్ లో జాయిన్ చేసి చదివిస్తాడు. పెంచి పెద్ద చేస్తాడు. నరేష్ చిన్న కుమార్తె నందిని (మెహరీన్)కి బాలు అంటే ఇష్టం. వయసుతో పాటు ఆ ఇష్టం పెరిగి ప్రేమగా మారుతుంది. పెద్దయిన తర్వాత బాలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాటికి నందిని ప్రొడ్యూసర్. చిన్నతనం నుండి బంధాలు, బంధుత్వాలకు దూరమైన బాలు, అటువంటి బంధుత్వాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల కోసం 'ఆల్ ఈజ్ వెల్' అనే ఎమోషనల్ సప్లయర్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తాడు. ఆస్ట్రేలియాలో ఉన్న మనవడితో మాట్లాడలేకపోతున్న వృద్ధ దంపతుల దగ్గరకు ఒక మనవణ్ణి పంపిస్తారు. అలాగే, పాతికేళ్ల క్రితం పుష్కరాల్లో కుమారుడు తప్పిపోయాడని బాధపడుతున్న ఓ తండ్రి దగ్గరకు కుమారుడిగా వెళతాడు బాలు. 'ఆల్ ఈజ్ వెల్' కంపెనీ ద్వారా అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఏం పొందాడు? అనేది సినిమా. బాలు, నందిని ప్రేమకథ ఏమైందనేది సినిమాలో చూడొచ్చు.

విశ్లేషణ: 
అయినవాళ్లకు, అనురాగం-ఆప్యాయతలకు దూరంగా.... చాలా భారంగా బతుకు వెళ్లదీస్తున్న వాళ్లకు ప్రేమ, ఆప్యాయతలు పంచడమనే లైన్ బావుంది. అందుకోసం, బంధాలను అరువు తెచ్చుకోవడమనే కాన్సెప్ట్ కు కనెక్ట్ కావడం కష్టమే.  'సినిమాలో ఎమోషన్స్ ఫేక్ అని తెలిసినా... మనం ఎందుకు నవ్వుతాం?ఎందుకు ఏడుస్తాం?' అని హీరో చేత డైలాగ్ చెప్పించారు. సినిమా కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తూ! అదీ కన్వీన్సింగ్ గా లేదు. ఎందుకంటే... సినిమాలో ఓ కథ ఉంటుంది. కథలో పాత్రలు అన్నీ మొదటినుండి ఒకే రిలేషన్ తో ముందుకు వెళతాయి. కథతో పాటు ప్రేక్షకుడు ట్రావెల్ చేస్తాడు. కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా విషయానికి వస్తే... ఇన్స్టంట్ కాఫీని ఇష్టపడినట్టు, ఇన్స్టంట్ రిలేషన్స్ ను ఇష్టపడమని చెప్పినట్టుంది.  

సినిమాలో హీరో ఉన్నట్టుండి అన్నయ్య, తాతయ్య, నాన్న, మేనల్లుడు అంటూ బంధుత్వాలతో పిలుస్తుంటే తట్టుకోవడమూ కష్టమే. ఆ బంధుత్వాలు, సన్నివేశాలు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ఎమోషన్స్ కూడా వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా మినహా భావోద్వేగాలు పండలేదు. సీన్స్ పరంగా చూస్తే... కొన్ని కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకు... తన కుమారుడి గురించి శుభలేఖ సుధాకర్ చెప్పే సీన్. ఆస్తి కోసం వచ్చినవాడు మనవడా? అని విజయ్ కుమార్ ప్రశ్నించే సీన్. కానీ, మెజారిటీ సన్నివేశాలు కనెక్ట్ అవ్వడం కష్టం. దీనికి తోడు స్టోరీ స్టార్టింగులో కామెడీ కూడా సరిగా క్లిక్ కాలేదు. 'వెన్నెల' కిషోర్ ఎంట్రీతో కొంచెం నవ్వులు వచ్చాయి. 'మనసులో ఉన్నది బయటకు చెప్పే అలవాటు' క్యారెక్టరైజేషన్ తో నరేష్ అక్కడక్కడా నవ్వించారు. యూట్యూబ్ థంబ్ నైల్స్, హెడ్డింగ్స్ మీద సెటైర్స్ పేలలేదు. 

గుజరాతీ సినిమా 'ఆక్సీజన్'లో మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని, దానిచుట్టూ ప్రేక్షకులను కట్టిపడేసే కథ, కథనం రాయడంలో దర్శకుడు వేగేశ్న సతీష్ పూర్తిగా సక్సెస్ కాలేదు. 'ఏమో ఏమో' పాట మినహా మిగతావి బాలేదు. నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ లో మాత్రమే బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడలేదనే విషయం ప్రతి ఫ్రేములో తెలిసింది. సినిమాటోగ్రఫీ బావుంది.

ప్లస్ పాయింట్స్:
నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్ నటన 
'వెన్నెల' కిషోర్, నరేష్ వినోదం
యాక్షన్ ఎపిసోడ్స్, ప్రొడక్షన్ వేల్యూస్ 
పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:
సినిమా కాన్సెప్ట్, కథ 
పాటలు, నేపథ్య సంగీతం 
సన్నివేశాల్లో సాగదీత 
సీరియల్ ను తలపించే సీన్స్ 
ప్రేమకథ 
భావోద్వేగాలు పండకపోవడం     

నటీనటులు: 
కథ, కథనం, సన్నివేశాలతో సంబంధం లేకుండా ప్రతి సన్నివేశంలో నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్ నటనలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. కల్యాణ్ రామ్ సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో కొత్తగా కనిపించాడు. డ్రస్సింగ్ స్టైల్ కూడా డీసెంట్ గా ఉంది. మెహరీన్ అందంతో కాకుండా నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తనికెళ్ల భరణితో ఎమోషనల్ సీన్, హీరోపై ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశంలో ఆమె నటన బావుంది. 'వెన్నెల' కిషోర్ తనదైన శైలిలో నవ్వులు పండించాడు. ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ... సరైన సన్నివేశాలు పడలేదు. కొందరు ఓవర్ యాక్షన్ చేశారు. 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
నటుడిగా నందమూరి కల్యాణ్ ను కాస్త కొత్తగా చూపించిన సినిమా 'ఎంత మంచివాడవురా'. అయితే, ఏమాత్రం ఆకట్టుకొని కథ, కథనం, సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. కొన్ని సీన్స్ సీరియల్ ను తలపిస్తాయి. 'వెన్నెల' కిషోర్ నవ్వులు, అక్కడక్కడా కొన్ని భావోద్వేగాల కోసం సినిమాను చూడొచ్చనుకుంటే... ధైర్యం చేసి సినిమాకు వెళ్లొచ్చు. జస్ట్ ఓకే ఓకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పతాక సన్నివేశాల్లో హీరో కోరుకున్నది దక్కిందని చూపించే సన్నివేశం బావుంది.

రేటింగ్: 2/5 


Cinema GalleriesLatest News


Video-Gossips