శేఖర్ కమ్ముల పేరు చెప్పి ఘరానా మోసం
on Jun 27, 2018
మీకు సినిమాల్లో నటించే ఛాన్స్ ఇస్తాం... అనే ప్రకటనలు చూసి మోసపోకండి. ఎందుకంటే... వాటిలో తొంభై శాతం నాటకం, భూటకం. సినిమాల్లో నటించాలన్న మీ బలహీనతను వాళ్లు క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారని అర్థం. తాజాగా శేఖర్ కమ్ముల పేరు చెప్పి ఓ వెబ్ సైట్ ఆలాంటి మోసాకికే పాల్పడింది. వందలాది మంది కలలకు కుచ్చుటోపీ పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వెబ్ సైట్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పేరుని యదేచ్ఛగా వాడుకుంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. `శేఖర్ కమ్ముల రాబోయే చిత్రంలో నటించడానికి కొత్త నటీనటులు కావాలి` అనేది ఆ ప్రకటన సారాంశం. దాంతో యువతీ యువకులు ఎగబడ్డారు. ఇలా అప్లై చేసిన ఒకొక్కరి నుంచీ రూ.1800 వసూలు చేసింది ఈ బెస్ సైట్. పోతే పోయాయి రెండు వేలు... వస్తే శేఖర్ కమ్ముల సినిమాలో ఛాన్స్ వస్తుందిలే అని, వందలాది యువతీ యువకులు ఈ వెబ్ సైట్ సూచించిన అకౌంటుకి డబ్బులు పంపారు.
ఇలా పాతిక రోజుల పాటు దందా నడిపిన ఈ బెస్ సైట్ అనూహ్యంగా మూత పడింది. దాంతో... డబ్బులు పంపినవాళ్లంతా అవాక్కయ్యారు. రెండు వేల రూపాయల కోసం పోలీసు కేసులు ఏం పెడతాంలే అని కొంతమంది కామ్ అయ్యారు. అయితే ఓ కుర్రాడు మాత్రం శేఖర్ కమ్ములని కలసి అసలు విషయం చెప్పాడు. దాంతో నిర్ఘాంత పోయిన శేఖర్ కమ్ముల సదరు వెబ్ సైట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ వెబ్ సైట్ నిర్వాహకుల నుంచి కూపీ లాగుతున్నారు. అందుకే ఇలాంటి మోసపూరిత ప్రకటనల వల్లో పడిపోకండి.. తస్మాత్ జాగ్రత్త.