నిక్కరేయాలా? నేను చేయను!
on Nov 25, 2017
‘డాక్టర్ అవ్వబోయి యాక్టర్ ని అయ్యాను...’ ఈ మాట వినీ వినీ.. అందరికీ చెవులు దిబ్బిళ్లెక్కిపోయుంటాయ్ కదా! ఇంటర్ వ్యూ ఇస్తే చాలు ముఖ్యంగా హీరోయిన్లు ఇదే మాట చెబుతుంటారు. ఈ మధ్య దర్శకుడు బాబీ... అదేనండీ ‘జై లవకుశ’ తీశాడుగా. ఆ కుర్రాడు. అతను కూడా తనకు సంబంధించిన ఇలాంటిదే ఓ కథ చెప్పాడు. తాను యాక్టర్ అవ్వబోయి డైరెక్టర్ అయ్యాడట. దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకొచ్చాడు. ఇది ఓ పదిహేనేళ్ల క్రితం కథ. అల్లు అర్జున్ తొలి సినిమా ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతోంది. బన్నీ వెనక నిలబడటానికి ఓ అయిదుగురు అదే వయసు కుర్రాళ్లు కావాలి. రచయిత చిన్నికృష్ణ రికమండ్ చేయడంతో ఓ కుర్రాడ్ని తీసుకున్నారట కె.రాఘవేంద్రరావు. కథ రిత్యా... అందులో బన్నీ చాలాభాగం హాఫ్ నిక్కర్ మీదే ఉంటాడు. దాంతో ఈ కుర్రాడ్ని కూడా అలాగే హాఫ్ నిక్కర్లో ఉండమన్నారట దర్శకుడు. ‘హాట్... నేను మూడో తరగతి నుంచే ప్యాంట్లు వేసుకొని తిరిగినోడ్ని.. నన్ను నిక్కర్ వేయమంటారా? ’ అని ఆ పాత్రనే వదిలేశాడట.
ఆ తర్వాత వేషాలను పక్కనపెట్టి దర్శకత్వ శాఖలో పనిచేసి ఎట్టకేలకు రవితేజ పుణ్యమా అని దర్శకుడయ్యాడట. ఆ కుర్రాడే బాబీ.. అలియాస్ రవీంద్ర. అదనమట కథ. మొత్తంగా చెప్పేదేంటంటే.. నిక్కర్ క్యారెక్టర్ వదులుకుంటే మనోడికి మంచిదైంది. లేకపోతే... అలాంటి పాత్రలే చేస్తూ ఉండేవాడు. రిస్క్ చేశాడు. రిచ్ గా బతుకుతున్నాడు. దీని బట్టి మీకు అర్థమైందేంటి?... ‘మనిషి అనేవాడు రిస్క్ చేయకుండా ఉండటమే అన్నికంటే పెద్ద రిస్క్’ అదనమాట విషయం.