English | Telugu

ఛ‌ల్ మోహ‌న రంగ‌ రివ్యూ

on Apr 5, 2018

 

ఓ గొప్ప క‌థ‌ని మామూలుగా చెప్ప‌డం కంటే
ఓ మామూలు క‌థ‌ని గొప్ప‌గా చెప్ప‌డ‌మే
ఈ జ‌న‌రేష‌న్‌కి ఇష్టం. అందుకే క‌థ విష‌యంలో ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. 'సినిమాకి క‌థ కావాలేంటండీ..' అనేది వాళ్ల లాజిక్‌. ప్రేక్ష‌కులూ... ''క‌థేం అవ‌స‌రం లేదులే.. మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటే చాలు''  అంటూ  క‌నిక‌రించ‌డం లేదు. అందుకే... క‌థ‌ల విష‌యంలో లోతుగా ఆలోచించే అవ‌స‌రం త‌ప్పుతోంది. నితిన్ 25వ సినిమాగా వ‌చ్చిన 'ఛ‌ల్ మోహ‌న రంగ‌' కూడా ఓసాదా సీదా క‌థే. ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య‌.. ఈ స‌గ‌టు క‌థ‌ని... త‌న స‌న్నివేశ బ‌లంతో, మాట‌ల ఛ‌మ‌క్కుతో ప్రాణం పోసే ప్ర‌య‌త్నం చేశాడు. అదెలా సాగిందంటే...

*క‌థ‌

మోహ‌న్ రంగ (నితిన్‌)కి చిన్న‌ప్ప‌టి నుంచీ అమెరికా వెళ్లాల‌న్న‌ది క‌ల‌.  ఎందుకంటే ఓ అమ్మాయి కోసం. 'శ‌వాన్ని' అడ్డుపెట్టుకుని.. అమెరికా వెళ్లిపోతాడు. అక్క‌డ    హెచ్‌1బి  వీసా సంపాదించ‌డం కోసం నానా పాట్లు ప‌డ‌తాడు. ఆ ప్ర‌యాణంలో మేఘా (మేఘా ఆకాష్‌) ప‌రిచ‌యం అవుతుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య స్నేహం పెరిగి, ప్రేమ‌గా మారుతుంది. ఒక‌రి మ‌న‌సులోని మాట మ‌రొక‌రికి చెప్పేయాల‌నుకుంటారు. కానీ.. ఒక‌రి త‌త్వం మ‌రొక‌రికి స‌రిప‌డ‌దేమో అనే అనుమానంతో.. మ‌న‌సులో మాట చెప్పుకోరు. రంగ‌కి చెప్ప‌కుండానే అమెరికా నుంచి ఊటీ వ‌చ్చేస్తుంది మేఘా.  ఆ త‌ర‌వాత ఏమైంది?  ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకున్నారా, లేదా?  క‌లుసుకుంటే ఏమైంది? అనేదే క‌థ‌.  

* విశ్లేష‌ణ‌

మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ రాసిన క‌థ ఇది. ఆయ‌న నుంచి వ‌చ్చిన క‌థ అన‌గానే ... ఏదో మాయ‌, మంత్రం ఉంటుంద‌నుకుంటాం. కానీ.. ఆయ‌న రాసుకుని.. `ఇదేం కొత్త కథ కాదులే` అని ప‌క్క‌న పెట్టేసిన క‌థ‌ని- కృష్ణ చైత‌న్య‌కి ఇచ్చాడ‌న్న సంగ‌తి సినిమా మొద‌లైన కాసేప‌టికే తెలిసిపోతుంది. ఓ అమ్మాయి, అబ్బాయి క‌ల‌సుకోవ‌డం, ప్రేమించుకోవ‌డం, విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం.. ఇదే క‌థ‌.

అయితే దాన్ని ద‌ర్శ‌కుడు త‌న మాట‌ల చ‌తుర‌త‌తో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. త్రివిక్ర‌మ్ ఇలాంటి క‌థ‌ని డీల్ చేస్తే ఎలా ఉంటుందో.. స‌రిగ్గా ఈ సినిమా అలానే ఉంటుంది. త్రివిక్ర‌మ్ మార్క్‌, మ్యాజిక్ అణువ‌ణువునా క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా మాట‌ల విష‌యంలే.  త్రివిక్ర‌మ్ స్టైల్ ఆఫ్ సౌండింగ్ లేక‌పోతే.. ఈ సినిమా ఎప్పుడో తేలిపోదును.  విశ్రాంతి వ‌ర‌కూ... క‌థ‌లో హై ఎమోష‌నే ఉండ‌దు. విశ్రాంతి కార్డు కూడా బ‌ల‌వంతంగా వేసిన‌ట్టు అనిపిస్తుంది. కానీ ఈమ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు స‌ర‌దాగా ఉంటాయి. రొటీన్ సీనే అయినా.. డైలాగుల‌తో, లొకేష‌న్ల‌తో నెట్టుకొచ్చేశాడు.  ఇలాంటి విష‌యం లేని క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఎక్కువ సేపు కూర్చోబెట్ట‌లేం. కాబ‌ట్టే.. సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుడిలో అస‌హ‌నం మొద‌ల‌వుతుంది. ఇదీ స‌గ‌టు సినిమాగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. హీరో అమెరికా వ‌ద‌లి... ఊటీ వ‌చ్చాక‌.. మ‌ళ్లీ ఈ సినిమాకి ఊపొస్తుంది. అక్క‌డ ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలి వినోదంతో, త్రివిక్ర‌మ్ మార్క్‌ని గుర్తుకు చేస్తూ డైలాగులు, సీన్లు రాసుకున్నాడు. ఏమీ లేని చోట‌.. ఏదో ఉంద‌న్న భ్ర‌మ క‌లిపించాడు. క్లైమాక్స్ కూడా చాలా సినిమాల్లో చూసేదే. ఒక‌రితో పెళ్లి సెట్ అవుతుంది... కానీ ఆ పెళ్లి ఆగిపోయి... హీరోయిన్ హీరో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తుంది. కానీ ఈ మొత్తం  ఎపిసోడ్‌లో డ్రామా కంటే వినోదానికే పెద్ద పీట వేశాడు ద‌ర్శ‌కుడు. దాంతో పాసైపోతాడు.

* న‌టీన‌టులు

నితిన్ త‌న వంతు న్యాయం చేశాడు. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం త‌న‌కు కాట్ వాక్‌. సుల‌భంగా ప‌ని కానిచ్చేశాడు. నితిన్‌లోని ఈజ్ మ‌రోసారి ఆక‌ట్టుకుంటుంది. మేఘా ఆకాష్‌కి రెండో సినిమాతోనే ప‌రిణ‌తి వ‌చ్చేసింది. అందంగా క‌నిపించ‌డ‌మే కాదు, న‌ట‌న‌తోనూ ఆక‌ట్టుకుంది. మిగిలిన‌వాళ్ల‌కు చెప్పుకోద‌గిన పాత్ర‌లేం  ప‌డ‌లేదు. కొద్దిలో కొంత‌... రావు ర‌మేష్ పాత్రే బెట‌ర్‌. స‌త్య కాసేపు న‌వ్వించాడు.

* టెక్నిక‌ల్ టీమ్‌

త‌మ‌న్ సంగీతానికి మ‌రోసారి మంచి మార్కులు ప‌డ్డాయి. పాట‌లే కాదు, నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. కెమెరా వ‌ర్క్ సూప‌ర్‌. లొకేష‌న్లు బాగున్నాయి. త్రివిక్ర‌మ్ రాసిన క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. దాన్ని తీర్చిదిద్దిన కృష్ఫ చైత‌న్య‌కే ఎక్కువ మార్కులు వేయాలి. క‌థ‌కుడిగా త్రివిక్ర‌మ్ తేలిపోయిన ప్ర‌తీ చోటా. మాటల ర‌చ‌యిత‌గా కృష్ణ చైత‌న్య ఈ సినిమాని నిల‌బెట్టాడు. ద్వితీయార్థంలో కొంత‌సేపు.. బోర్ కొట్ట‌కుండా చూసుకుని ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్ల మ‌ధ్య విర‌హం, వాళ్లు విడిపోయే సీన్లు కృత్రిమంగా ఉన్నాయి. ఎమోష‌న్స్‌ని కూడా త్రివిక్ర‌మ్ స్థాయిలో పండిస్తే.. ఈ సినిమా `అ.ఆ`లా మిగిలిపోదును.

* ప్ల‌స్ పాయింట్స్‌


నితిన్
డైలాగులు
రిచ్ నెస్‌

* మైన‌స్ పాయింట్స్‌
క‌థ‌

* ఫైన‌ల్‌గా:   జూనియ‌ర్ త్రివిక్ర‌మ్ తీసిన సినిమా

రేటింగ్ : 2.50

 

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here