ENGLISH | TELUGU  

కేరాఫ్ కంచ‌ర‌పాలెం మూవీ రివ్యూ

on Sep 7, 2018

 

రివ్యూ:  కేరాఫ్ కంచ‌ర‌పాలెం

చిత్రం:  కేరాఫ్ కంచెర‌పాలెం
న‌టీన‌టులు:  సుబ్బారావు, రాధా బెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు,  కార్తీక్ ర‌త్నం, విజ‌య‌ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జవ్వాడి, వ‌రుణ్‌ చాఫేక‌ర్‌
సంగీతం:  స్వీక‌ర్ ఆగ‌స్తి
నిర్మాత‌:  విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
స‌మ‌ర్ప‌ణ‌:  రానా ద‌గ్గుబాటి
ద‌ర్శ‌కుడు:  వెంక‌టేష్ మ‌హా


క‌ల‌కు ఎన్ని రంగులైనా అద్దొచ్చు. కానీ నిజాన్ని నిజం కంటే గొప్ప‌గా చెప్ప‌లేం. జీవ‌న వాస్త‌విక‌త‌, నగ్న‌త్వానికి మించిన సిస‌లైన సౌంద‌ర్యం మ‌రెక్క‌డా ఉండ‌దు. మెజారిటీ సినిమాలు ప్రేక్ష‌కుల్ని త‌మ‌ది కానీ ఓ యాంత్రిక‌, ఊహా ప్ర‌పంచంలో ఉరేగిస్తాయి. కొన్ని సినిమాలు మాత్ర‌మే మ‌న‌ల్ని యథార్థ  ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిపోతాయి. అక్క‌డి పాత్ర‌ల‌తో,  ప‌రిస‌రాల‌తో క‌లిసి స‌హానుభూతిచెందేలా చేస్తాయి. ఒక భావోద్వేగ ప్ర‌యాణం చేసిన అనుభూతిని మిగుల్చుతాయి. కేరాఫ్ కంచెర‌పాలెం ఆ కోవ‌లోనిదే.  ఒక గ్రామీణ జీవితానికి య‌థార్థ దృశ్య‌రూప‌మే ఈ  చిత్రాన్ని అభివ‌ర్ణించ‌వొచ్చు.  ఇండిపెండెంట్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ టేకాఫ్ చేయ‌డం..రానా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ప్రివ్యూ షోల‌లో ప‌లువురు  సెల‌బ్రిటీలు ఈ సినిమాపై ప్రశంస‌లు కురిపించారు. త‌మ హృద‌యాల్ని క‌ట్టిప‌డేసింద‌ని  మెచ్చుకున్నారు. దాంతో కేరాఫ్ కంచెర‌పాలెం  చిత్రం అంద‌రిలో ఆస‌క్తిని పెంచింది.


క‌థ‌:

విశాఖ‌పట్నంకు స‌మీపంలోని కంచెర‌పాలెం అనే గ్రామంలో జ‌రిగే క‌థ ఇది. భిన్న‌నేప‌థ్యాలున్న న‌లుగురి జీవితాల చుట్టూ క‌థ‌న‌డుస్తుంది. రాజు ఓ ప్ర‌భుత్వాఫీసులో అటెండ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. యాభైఏళ్లు ద‌గ్గ‌ర‌ప‌డ్డా ఇంకా పెళ్లిచేసుకోక‌పోవ‌డంతో గ్రామంలోని వారంద‌రూ న‌ట్టుగాడు (న‌పుంస‌కుడు) అంటూ హేళ‌న చేస్తుంటారు. త‌న‌ ఆఫీసులోకి పై ఉద్యోగిగా వ‌చ్చిన  రాధ అనే మేడ‌మ్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు రాజు. భ‌ర్త చ‌నిపోవ‌డంతో రాధ‌ కూతురితో క‌లిసి ఒంట‌రిగా జీవిస్తుంటుంది. ఇక లోక‌ల్  రాజ‌కీయ నాయ‌కుడు అమ్మోరు ద‌గ్గ‌ర ప‌నిచేస్తుంటాడు జోస‌ఫ్‌.   ఓ గొడ‌వ‌ను ప‌రిష్క‌రించే క్ర‌మంలో జోస‌ఫ్‌కు భార్గ‌వి అనే బ్రాహ్మ‌ణ అమ్మాయితో ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. మ‌రోవైపు సుంద‌రం అనే ఎనిమిదో త‌ర‌గ‌తి కుర్రాడు తన క్లాస్‌మేట్ సునీత‌ను ప్రేమిస్తుంటాడు.  ఇక కంచెర‌పాలెం ఊరిలోని బ్రాండీషాపులో ప‌నిచేస్తుంటాడు గెడ్డం అనే యువ‌కుడు.  అత‌ను స‌లీమ అనే వేశ్య‌ను ప్రేమిస్తాడు. కంచెర‌పాలెంలోని ఈ నాలుగు జంట‌ల జీవితాల్లో  ఎదురైన ప‌రిస్ధితులేమిటి?  భిన్న వ‌యోభేదాలు, జీవ‌న నేప‌థ్యాలున్న ఈ జంటలు  త‌మ ప్రేమ‌ను స‌ఫ‌లం చేసుకునే క్ర‌మంలో ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణేమిటి?  ఈ నాలుగు జంట‌ల జీవితాల‌కు అంత‌ర్లీనంగా ఉన్న సంబంధ‌మేమిటి? అన్న‌దే మిగ‌త చిత్ర క‌థ‌.


విశ్లేష‌ణ‌..

వాస్త‌వ జీవితాన్ని తెర‌పైకి తీసుకురావడం అంత‌ సులువుకాదు. అందుకు ద‌ర్శ‌కుడికి క‌మిట్‌మెంట్‌,  సినిమా క‌ళ‌ప‌ట్ల విప‌రీత‌మైన ప్రేమ ఉండాలి. కంచెర‌పాలెంను చూస్తే ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంత‌గా త‌పించాడో అనిపిస్తుంది. ఈ సినిమాలో తెలిసిన ఆర్టిస్టులు ఎవ‌రూ లేరు. తాను న‌మ్మిన క‌థ‌ను  స‌హ‌జంగా తెర‌పైకి తీసుకురావాల‌నే సంక‌ల్పంతో దాదాపు న‌టీన‌టులంద‌రిని కంచెర‌పాలెం గ్రామం నుంచే తీసుకున్నారు. వారికి కొంత శిక్ష‌ణ ఇప్పించి న‌టింపజేశారు. అందుకే తెర‌పై ప్ర‌తి పాత్ర స‌హజంగా క‌నిపిస్తుంది. ఎక్క‌డా సినిమాటిక్ ఫీలింగ్ క‌లగ‌దు.

పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులు స‌హానుభూతిచెందిన భావ‌నకు లోన‌వుతారు. నాలుగు జంట‌ల ప్రేమ‌ను అంత‌ర్లీనంగా ఓ తాత్విక భూమిక మీద ఆవిష్క‌రించ‌డం క‌థ‌లోని గొప్ప పాయింట్ అనిపిస్తుంది.  ముదురు బ్ర‌హ్మ‌చారియైన రాజు పాత్ర‌ చుట్టూ ఎక్క‌వ‌ క‌థ న‌డుస్తుంది. 49 ఏళ్లు వచ్చినా  ఇంకా పెళ్లిచేసుకోక‌పోవ‌డంతో అత‌న్ని అంద‌రూ న‌ట్టుగాడు అని పిలుస్తుంటారు. అయితే రాజుకి  మాత్రం ఒంట‌రి జీవితాన్ని గ‌డ‌ప‌డం ఇష్టం. త‌న కంటే ఊరి వారికే త‌న పెళ్లి గురించి ఎక్కువ‌గా ప‌ట్టింపు ఉంద‌నేది రాజు భావ‌న‌.  ఈ సినిమాలో రాజు పాత్ర చుట్టూ చ‌క్క‌టి హాస్యం పండింది. త‌న పై ఉద్యోగి రాధా మేడ‌మ్‌తో రాజు ప్రేమ‌లో ప‌డ‌టం..ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య చోటుచేసుకునే సంఘ‌ట‌న‌ల్ని చ‌క్క‌టి హాస్యంతో తీర్చిదిద్దారు.  ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దివే సుంద‌రం, సునీత క‌థ తొలి కౌమార‌పు ప్రేమ భావ‌న‌ల‌కు అద్దం ప‌డుతుంది. భ‌లె భ‌లే మ‌గాడివోయ్ అంటూ సునీత..సుంద‌రం కోసం స్టేజీ ఎక్కి పాట పాట‌డం వారి అమాయ‌క‌పు ప్రేమ‌ను ఆవిష్క‌రిస్తుంది.  ఇక బ్రాండీషాపులో ప‌నిచేసే గెడ్డం.. స‌లీమ ప్రేమ‌లో ప‌డ‌తాను. ఒక‌ప్పుడు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గ‌డిపిన వేశ్య స‌లీమ అని తెలుసుకొని నిర్ఘాంత‌పోతాడు. . వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ ఎన్నో సంఘ‌ర్ష‌ణ‌ల్ని, మ‌రెన్నో ప్ర‌శ్న‌ల్ని రేకెత్తిస్తూ సాగుతుంది. గెడ్డం, స‌లీమ పాత్ర‌లు ప్రేక్ష‌కుల హృద‌యాల‌పై గాఢ‌మైన ముద్ర‌ను వేస్తాయి. జోస‌ఫ్‌, భార్గ‌వి ప్రేమ‌క‌థ‌ను కూడా అర్థ‌వంతంగా ఆవిష్క‌రించారు.

మతం ప్రేమ‌ను ఎంత నిర్ధాక్ష్యిణ్యంగా దూరం చేస్తుందో, భార్గ‌వి కోసం త‌న జీవితాన్ని మార్చుకోవాల‌నుకున్న జోస‌ఫ్ ఎంత‌టి వేద‌న‌ను అనుభ‌విస్తాడో హృద్యంగా ఆవిష్క‌రించారు. వ్య‌క్తుల కంటే ప‌రిస్ఙితులు చాలా బ‌ల‌మైన‌వ‌ని, విధి ఎవ‌రిని ఎక్క‌డ విసిరేస్తుందో తెలియ‌ద‌నే ఓ ఫిలాస‌ఫిక‌ల్ పాయింట్‌ను సినిమాలో ఆవిష్క‌రించారు. ఒక్కొక్క‌రి  జీవితంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లు, అనుభ‌వాలు మ‌తం, దేవుడు, మ‌నిషిత‌నం ప‌ట్ల వ్య‌క్తుల దృక్ప‌థాల్ని ఎలా మారుస్తాయో తెలియ‌జెప్పారు.  ఆరంభంలో వ‌చ్చే ఏమి జ‌న్మ‌ము ఏమి జ‌న్మ‌ము అనే హ‌రిక‌థ శైలిలో సాగే పాట‌లోనే సినిమా తాలూకు సారాన్ని మొత్తాన్ని ఆవిష్క‌రించారు.  క‌థ‌లోని వాస్త‌విక‌త‌, పాత్ర‌ల్లోని స‌హ‌జ‌త్వం ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తుంది.  సినిమా చూస్తున్న‌వారికి తెర‌పై కంచెర‌పాలెం ఉరొక్క‌టే క‌నిపిస్తుంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు. దీనిని బ‌ట్టి ఈ సినిమా ఎంత‌టి వాస్త‌వ జీవ‌న చిత్ర‌ణో అర్ధం చేసుకోవ‌చ్చు.


న‌టీన‌టుల‌ ప‌నితీరు..

ఈ సినిమాలోని ప్ర‌తి పాత్ర ప్ర‌శంసించ‌ద‌గ్గ‌దే. రాజు, రాధ‌, జోసెఫ్‌, భార్గ‌వి, సుంద‌రం, సునీత‌, గెడ్డం, స‌లీమ‌...ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. కంచెర‌పాలెం గ్రామ‌స్తుల‌నే న‌టీన‌టులుగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా నాట‌కీయ‌త క‌నిపించ‌లేదు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ స‌హ‌జ‌శైలిలో అభిన‌యించారు. రాజు పాత్ర ఆద్యంతం చ‌క్క‌టి వినోదాన్ని పండించింది. ఇక జోసఫ్‌, గెడ్డం త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  అయితే స‌లీమ పాత్ర మాత్రం బాగా గుర్తిండిపోతుంది. చిత్ర నిర్మాత ప్ర‌వీణ ప‌రుచూరి ఈ పాత్ర‌ను పోషించారు. ఆమె ఆ పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు అద్బుత‌మ‌నిపిస్తుంది. అంత‌టి బ‌రువైన భావోద్వేగాలున్న పాత్ర‌ను క‌న్విన్సింగ్‌గా చేయ‌డం మామూలు విష‌యం కాదు. సాంకేతికంగా కూడా చ‌క్క‌టి ప్ర‌మాణాల‌తో సినిమాను తెర‌కెక్కించారు. సినిమాటోగ్రాఫ‌ర్స్ ఆదిత్య జ‌వ్వాడి,వ‌రుణ్ ఛాపేక‌ర్ కంచెర‌పాలెం గ్రామ జీవ‌నాన్ని య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చారు. స‌హజ‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించ‌డం వ‌ల్ల అచ్చ‌మైన గ్రామ‌జీవితాన్ని చూస్తున్నానే అనుభూతి క‌లిగింది. స్వీక‌ర్ ఆగ‌స్తి స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లు బాగున్నాయి. ప‌రిమిత బడ్జెట్‌లోనే చ‌క్క‌టి నాణ్య‌త‌తో సినిమాను తీశారు.


తీర్పు..
క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ఒర‌వ‌డిలో,  స‌త్య‌దూర‌మైన క‌థాంశాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు వాస్త‌వ జీవిత చిత్ర‌ణ‌తో స్వాంత‌న చేకూర్చే చిత్ర‌మిది. చ‌క్క‌టి క‌థ‌ను రాసుకొని, దానిని అర్ధ‌వంతంగా తెర‌పైకి తీసుకురావ‌డంలో ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా కృత‌కృత్యుడ‌య్యారు.  నిస్సందేహంగా తెలుగు సినిమా స్థాయిని మ‌రో  మెట్టెక్కించే  గొప్ప విలువ‌లున్న చిత్రంగా కంచెర‌పాలెంను అభివ‌ర్ణించ‌వొచ్చు.


రేటింగ్‌: 3

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.