అభిమాని వల్లే బాలయ్య టోనీ స్టార్క్ గెటప్
on Dec 18, 2019
'రూలర్' ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రముఖ హాలీవుడ్ హీరో టోనీ స్టార్క్ గెటప్‌లో బాలకృష్ణను చూసి అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు... పరిశ్రమ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించనంత స్టయిలిష్‌గా బాలకృష్ణ కనిపించారు. అసలు, ఆ గెటప్‌లోకి బాలకృష్ణ ఎలా వచ్చారో తెలుసా? ఆ గెటప్ వేయడానికి కారణం ఎవరో తెలుసా? ఓ అభిమాని. అవును... నందమూరి అభిమాని. 'రూలర్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టోనీ స్టార్క్ గెటప్ గురించి బాలకృష్ణ మాట్లాడారు.
"టోనీ స్టార్క్... టోనీ స్టార్క్... ఇప్పుడు నా పేరు మార్చేశారు. నన్నందరూ టోనీ స్టార్క్ అని పిలుస్తున్నారు. నందమూరి టోనీ స్టార్క్ అన్నమాట. మంచి కథలో మంచి క్యారెక్టర్ వచ్చింది. నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. నిజం చెప్పాలంటే... నా అభిమాని ఒకరు టోనీ స్టార్క్ ఫొటో వాట్సాప్ చేశారు" అని బాలకృష్ణ అన్నారు. ఆ అభిమాని వల్లే టోనీ స్టార్క్ గెటప్ వేశారన్నమాట. విదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామందిని బాలకృష్ణను టోనీ స్టార్క్ అనుకున్నారని సోనాల్ చౌహన్ చెప్పింది. 'రూలర్' ట్రైలర్ చూస్తే... బాలకృష్ణ ఫైట్స్ ఇరగదీశారని అర్థమవుతుంది. అయితే.... సినిమా ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు తప్ప ఫైట్స్ లేవట. ఇంటర్వెల్ ఫైట్ తర్వాత సెకండాఫ్ లో నాలుగు ఫైట్స్ ఉన్నాయని బాలకృష్ణ చెప్పారు.