‘అరవింద..’ కూడా హాలీవుడ్ సినిమా కాపీనా?
on Oct 16, 2018
అనగనగా ఓ హాలీవుడ్ సినిమా. దాని పేరు ‘ది ఫ్యామిలీ’. రాబర్ట్ డి నీరో హీరోగా నటించాడు. 2013లో సినిమా విడుదలైంది. ఓ గ్రామం నేపథ్యంలో ఇద్దరు మాఫియా డాన్స్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో హీరో అండర్‌గ్రౌండ్‌లో ఉంటాడు. అతడి కొడుకు తండ్రి కథను ఓ పేపర్లో రాస్తాడు. దాన్ని విలన్ చదువుతాడు. హీరో ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటాడు. ఇంచుమించు ఇలాంటి సన్నివేశం ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలో వుంది. అందువల్ల, మరోసారి త్రివిక్రమ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో హీరో రాయలసీమ వదిలి హైదరాబాద్ వస్తాడు. అండర్‌గ్రౌండ్‌లో వుంటాడు. అప్పుడు హీరోయిన్ తమ్ముడికి కథ చెబుతాడు. ఆ కథ స్కూల్ మ్యాగజైన్లో పబ్లిష్ అవుతుంది. ఆ పేపర్ కాస్తా విలన్‌కి చేరుతుంది. హీరో ఎక్కడ వున్నాడో తెలియాలంటే ఈ కథ రాసినవాడిని పట్టుకోమని అనుచరులకు విలన్ ఆర్డర్ వేస్తాడు. కథకు కీలకమైన ఈ సన్నివేశం ఒక్కటే కాదు... ‘ది ఫ్యామిలీ’కి, ‘అరవింద సమేత’కి కొన్ని సారూప్యతలు వున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి త్రివిక్రమ్ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెలుగు సినిమా కథ వండారని విమర్శిస్తున్నారు. అసలే, రాయలసీమకు చెందిన ఓ రచయిత త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతున్నారు. తాను రాసిన కథల్లోంచి ఒక్కో పాత్రను కాపీ చేసి, ‘అరవింద సమేత’ తీశారనీ... త్రివిక్రమ్ ఒక మొండికత్తి అని నెట్టింట్లో ఘాటుగా విమర్శించారు. తాజా విమర్శలపై త్రివిక్రమ్ ఏం సమాధానం చెబుతారో??
ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’కి ‘అజ్ఞాతవాసి’ కాపీ అంటూ వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు! స్వయంగా ‘లార్గో వించ్’ దర్శకుడు ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశాడు. త్రివిక్రమ్ దగ్గర ఆ వ్యవహారాన్ని ప్రస్తావిస్తే... తన దగ్గరకు వచ్చి ఎవరూ అడగలేదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే బాధపడుతూ ఇచ్చేవాడినని త్రివిక్రమ్ తెలిపారు. ఇప్పుడు ఏమంటారో??
Also Read