బాలకృష్ణ చుట్టూ దర్శకుల చక్కర్లు...
on May 3, 2020
దర్శకులకు విలువ ఇచ్చే హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. దర్శకుడు చెప్పింది చేసే హీరోలలో ఆయన నంబర్ వన్. ఒక్కసారి గురి కుదిరితే... దర్శకుడి పనిలో జోక్యం చేసుకోరు. కాళ్లు, వేళ్లు పెట్టడం వంటివి ఉండదు. అందుకని, బాలకృష్ణతో సినిమా చేయడానికి పలువురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కథలు రెడీ చేసుకుని కూర్చున్నారు. బాలకృష్ణ రెడీ అంటే ఆ దర్శకులు కూడా సినిమాలు చేయడానికి రెడీ.
ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇది. దీని తర్వాత తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే... ఆయన కోసం ముగ్గురు నలుగురు దర్శకులు రెడీగా ఉన్నారు.
కమర్షియల్ కథలకు దట్టంగా కామెడీ, మాస్ మసాలా అంశాలు బాగా పట్టించి, జనరంజకంగా సినిమాలు తీస్తూ... హిట్టు మీద హిట్టు కొడుతున్న అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కోసం ఒక లైన్ రెడీ చేశారు. ఆల్రెడీ ఆయనకు చెప్పారు కూడా. గతంలో ఒకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా త్వరలో పట్టాలు ఎక్కుతోందని బలంగా వినిపించింది. 'రామారావు గారు' టైటిల్ కూడా అనుకున్నారు. ఇద్దరూ బిజీ బిజీగా ఉండడంతో ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. అయితే... బాలకృష్ణ గారితో తప్పకుండా సినిమా చేస్తానని, ఆయన ఎప్పుడు పిలిస్తే తాను అప్పుడు సినిమా చేయడానికి రెడీ అని లేటెస్ట్ గా అనిల్ రావిపూడి చెప్పారు.
నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న మరో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇంతకుముందు బాలయ్య బాబును కొత్తగా చూపిస్తూ 'పైసా వసూల్' తీశారు. అయితే... ఆ సినిమా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ఆశించిన విజయం అందుకోలేదు. అందుకని, బాలకృష్ణ కు మరో సాలిడ్ హిట్ ఇవ్వాలని పూరి జగన్నాథ్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత బాలకృష్ణతో పూరి సినిమా చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను బాలకృష్ణ అభిమానులకు అందించిన దర్శకుడు బి. గోపాల్. కొంతకాలంగా ఆయన ఫామ్ లో లేరు. గ్యాప్ కూడా వచ్చింది. బాలకృష్ణ కోసం ఆయన కథ రెడీ చేయించారట. నట సింహం అవకాశం ఇస్తే సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారట. నందమూరి అభిమానుల పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో ఆయనకు బాలకృష్ణ అవకాశం ఇస్తారేమో చూడాలి. అలాగే, 'డిక్టేటర్' తీసిన శ్రీవాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.