S/o అల్లు అరవింద్... స్టైలే ఆస్తి
on Apr 8, 2015
.jpg)
మావయ్యది మొగల్తూరు..
మా నాన్నది పాలకొల్లు...
అంటూ గంగోత్రితో ఎంట్రీ ఇచ్చేశాడు S/o అల్లు అరవింద్... అల్లు అర్జున్.
ఈ సినిమాలో బన్నీ ని చూస్తే ఎవ్వరికీ నమ్మకాల్లేవు. చెడ్డీ వేసుకొని, అప్పుడే మొలిచిన మీసాలేసుకొని, భారీ డైలాగులు చెబుతుంటే.. వామ్మో 'కుర్రాడు రాడ్డులా ఉన్నాడే' అనిపించింది. మెగా ఫ్యామిలీ అబ్బాయి కాబట్టి భరించాల్సిందేనా..?? అంటూ తలలు పట్టుకొన్నారంతా. ఏదో రాఘవేంద్రరావు మహత్మ్సం, దానికి తోడు కీరవాణి పాటలు హిట్టు, అన్నింటికంటే మించి... పబ్లిసిటీ ఇరగదీయడంతో - ఆ సినిమా పాసైపోయింది.కానీ బన్నీపై మాత్రం డౌటులు తగ్గలేదు. అరవింద్ గారి అబ్బాయి అప్పటి మహేష్, ఎన్టీఆర్, పవన్‌ల మధ్య రాణించడం కష్టమే అనుకొన్నారు. ఆ తరవాత... ఆర్య వచ్చింది.. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసింది.
స్టైల్, డాన్స్, నటన, మేనరిజం, స్మైల్.. అన్నిటా అదరగొట్టేశాడు.. అటు బాక్సాఫీసు దగ్గర, ఇటు ఫ్యాన్స్ దగ్గర వందకి వంద మార్కులు వేయించుకొన్నాడు. బన్నితో మాస్ మనసుల్ని గెలుచుకొన్నాడు. ఓకుర్ర హీరో స్టార్ హీరోగా మారడానికి ఏమేం కావాలో అవన్నీ తన దగ్గర ఉన్నాయని ఈ సినిమాతో నిరూపించేసుకొన్నాడు. హ్యాపీ బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయినా.. బన్నీలోని ఎనర్జీ అందరికీ తెలిసేలా చేసింది. దేశముదురుతో బన్నీ లెవర్ పూర్తిగా మారిపోయింది. సిక్స్ ప్యాక్, జులపాల జుట్టూ.. యూత్‌కి సరైన రిప్రజెంటీవ్ దొరికేశాడు...
అక్కడి నుంచి సినిమా సినిమాకీ ఎదిగాడు బన్నీ. ప్రతీ సినిమాలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకొన్నాడు. మరీ ముఖ్యంగా... డాన్సుల్లో ఇరగదీశాడు. బన్నీ పక్కన డాన్స్ చేయడం అంటే ఏ కథానాయికకైనా ఓ సవాల్ అయిపోయింది. ''నేను చూసిన బెస్ట్ డాన్సర్లలో బన్నీ మొదటి స్థానంలో ఉంటాడు'' అని కథానాయికల చేత సర్టిఫికెట్ తీసుకోవడం అలవాటు చేసుకొన్నాడు. టాలీవుడ్‌లోనే కాదు... సౌత్ ఇండియాలోనే టాప్ డాన్సర్లలో బన్నీ పేరు మొదటి వరుసలో ఉంటుంది.. ఇందులో సందేహం ఏం లేదు.
బన్నీ డ్రస్ సెన్స్, హెయిర్ స్టైల్, డాన్సుల్లో ఈజ్... ఇవన్నీ చూస్తే ముచ్చటేస్తుంది. తనని తాను ప్రతీ సినిమాలోనూ కొత్తగా ఆవిష్కరించుకొని...స్టైలీష్ స్టార్ గా ఎదిగాడు బన్నీ. ఆర్య 2లో బన్నీలోని సరికొత్త డైమన్షన్ బయటకు వచ్చింది. సాధారణంగా యూత్ హీరోలు, దానికి తోడు... మాస్ అప్పీల్ కోసం ఎదురుచూసే కథానాయకులు అలాంటి స్టోరీలు, ఆర్యలాంటి క్యారెక్టర్లు ఒప్పుకోవడం కష్టం. కానీ బన్నీ మాత్రం ఆ సాహసం చేశాడు. వేదంతో మల్టీస్టారర్ సంస్ర్కృతి తెలుగు నాట విస్ర్కృతమవ్వడానికి తనవంతు సాయం చేశాడు. ఇప్పుడు బన్నీ నటించిన రుద్రమదేవి కూడా ఒక రకంగా మల్టీస్టారర్ చిత్రమే.
ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ తన దూకుడు చూపిస్తూనే ఉన్నాడు. ఫేస్ బుక్ ఫాలోవర్స్ విషయంలో బన్నీ సౌత్ ఇండియా రికార్డుల్ని తిరగరాశాడు. ఇప్పుడు ట్విట్టర్లోనూ జాయిన్ అయ్యాడు. మార్కెట్‌ని పెంచుకోవడం ఎలాగో బన్నీకి బాగా తెలుసు. మల్లూవుడ్‌లో బన్నీ స్టార్‌గా ఎదిగాడు. తను నటించిన తెలుగు సినిమాలు మలయాళంలో డబ్ అయి.. సూపర్ హిట్ అయ్యాయి. మలయాళంలో ఓ తెలుగు హీరోకి స్టార్ హోదా రావడం.. బన్నీతోనే మొదలు.
ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి... విలువలే ఆస్తి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బన్నీ. తన యాక్టింగ్ స్కిల్స్‌తో, డాన్సింగ్ టాలెంట్ తో, స్టైల్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకొన్న ఈ రేసుగుర్రం.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.. హ్యాపీ బర్త్‌డే టూ.. స్టైలీష్ స్టార్!!
(ఈరోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



