'అల్లరి’ నరేశ్ మాట తప్పాడు!
on Sep 8, 2018
‘అల్లరి’ నరేశ్ ఏడాదికి రెండు (మినిమమ్) నుంచి ఏడు, ఎనిమిది (మ్యాగ్జిమమ్) సినిమాల్లో నటించిన రోజులు వున్నాయి. ప్రతి సినిమాలో నవ్వించాలనే ప్రయత్నం... అందులో భాగంగా అగ్ర కథానాయకులు నటించిన చిత్రాల్లో మాంచి సన్నివేశాలను పేరడీలు చేయడం... అప్పట్లో నరేశ్ అలవాటు! ఏడాపెడా పేరడీలు, స్ఫూఫ్‌లు చేసి చేసి... చివరికి ‘సుడిగాడు’తో అతడి స్ఫూఫ్ పిచ్చి పీక్స్‌కి చేరింది. ఆ సినిమా అంతా హిట్ సినిమాల్లో సన్నివేశాలకు పేరడీయే కదా!! తర్వాత ‘అల్లరి’ నరేశ్ పేరడీలు, స్ఫూఫ్‌లు చేసినా జనాలు నవ్వడం మానేశారు. దాంతో అతడికీ తెలిసి వచ్చింది... పేరడీలకు కాలం చెల్లిందని! అందుకని ‘ఇకపై స్ఫూఫ్‌లు చేయను’ అని నరేశ్ చెప్పాడు. కానీ, ఆ మాట తప్పాడు.
‘అల్లరి’ నరేశ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సిల్లీ ఫెలోస్’. శుక్రవారం విడుదలైంది. ఇందులో గత సినిమాల్లో వలే ప్రతి సీన్లో స్ఫూఫ్‌లు చేయలేదు. కానీ, కావలిస చోట... అవరసం అని భావించిన చోట... తెలివిగా స్ఫూఫ్లను సినిమాలో చొప్పించారు. ‘అల్లరి’ నరేశ్ ఇంట్రడక్షనే ‘బాహుబలి’లో శివలింగం భుజాలకు ఎత్తుకున్న ప్రభాస్ గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. ‘బాహుబలి’లో ప్రభాస్ శివలింగం ఎత్తుకుని నీటిలోకి దూకి మరో ఒడ్డున ప్రతిష్టించాడు. ఇందులో నీటిలో మునిగిన ఒక మనిషిని భుజాలు మీదకు ఎత్తుకుని నీటిలోంచి నరేశ్ పైకి లేస్తాడు. బ్యాగ్రౌండ్లో ‘ఎవ్వడంట ఎవ్వడంట...’ అని ‘బాహుబలి’లోని పాట ప్లే అయ్యింది. అంతేకాదు... హీరోయిన్‌కి తన లవ్ ప్రపోజ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన సన్నివేశంలో పోలీస్ స్టేషన్‌ని ‘అత్తారింటికి దారేది’గా, అందులోని పోలీసులను అత్తారింట్లో పనివాళ్లుగా ఊహించుకుంటాడు హీరో. ఈ విధంగా మరో రెండుమూడు సన్నివేశాల్లో చిన్న చిన్న స్ఫూఫ్‌లు ప్రేక్షకులు గుర్తుపట్టలేని విధంగా చేశారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే... గత సినిమాల్లో చేసినట్టు శ్రుతిమించి స్ఫూఫ్‌లు చేయలేదు.
Also Read