English | Telugu

అజ్ఙాతవాసి మూవీ రివ్యూ

on Jan 10, 2018

తారాగణం: పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి, అను ఇమ్మానియేల్, ఆది, రావు రమేశ్, మురళీశర్మ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ

తెలివితేటలు అనేవి అవసరం మేరకే ఉండాలి. ఎక్కువ ఉన్నాయనుకోండీ.. దాన్ని ‘అతి తెలివి’ అంటారు. ఈ అతి తెలివి ఓ వ్యాధి. సాథ్యాసాథ్యాలు పట్టించుకోపోవడం.. ‘నేను ఏం చేసినా.. సరిగ్గానే ఉంటుంది‘ అనే అతి విశ్వసం.. (దీన్నే వీళ్లు ఆత్మవిశ్వాసం అనుకుంటారు), తొందరపాటు, తడబాటు, తత్తరపాటు.... ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ఉన్న పిల్లలు... టెస్ట్ బుక్ చేతికిచ్చినా కాపీ కొట్టలేరు. పెద్దవాళ్లలో ఈ వ్యాధి ఉంటే... తాను చెడతారు... పక్కనున్నోళ్లను చెడగొడతారు. ‘తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందంటారు‘ చూశారా  అలా అన్నమాట.

వీళ్లు ప్రారంభ శూరులు. మొదట్లో ‘శభాష్’ అనిపించుకుంటారు. పొగడ్తలు తలకెక్కుతాయ్. అప్పుడు అసలు తెలివి లోపలకెళ్లిపోతుంది. అతి తెలివి బయటకొస్తుంది. అప్పుడు ప్రమాదాలు సంభవిస్తుంటాయ్. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లలో ఇలాంటి లక్షణాలుంటే... వెంటనే వైద్యం చేయించుకోవడం అవసరం. లేకపోతే... పెట్టుబడి దారులు దెబ్బడిపోతారు. కలిసి పనిచేసినవారందరూ విధికి దొరికిపోతారు.

ఈ ఏడాది ఫస్ట్ సినిమాగా పవర్ స్టార్ ‘అజ్ఙాతవాసి’.. ఈ బుధవారం విడుదలైంది. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు.. కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటే బావుంటుందనిపించి... ఇవన్నీ చెబుతున్నాన్నమాట.

నటుడు... అనే స్థాయి దాటిపోయి.. ‘దేవుడు’ అనిపించుకునే స్థాయికి వెళ్లిపోయిన హీరో పవన్ కల్యాణ్. మరి ఆయన సినిమా అంటే అభిమానుల్లో ఎన్ని ఆశలుంటాయో., ఎన్ని ఆకాంక్షలుంటాయో.. ఎన్నెన్ని అంచనాలుంటాయో ప్రత్యేకించి చెప్పాలా?. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘అజ్ఙాతవాసి’ సినిమా ఉందా? అనే విషయం తెలుసుకునే ముందు.. అసలు కథ గురించి మాట్లాడుకుందాం.

కథ:-

గోవింద భార్గవ్... ఏబీ ఇండస్ట్రీస్ అదినేత.  ఎంతో శ్రమకోర్చి ఓ సామ్రాజ్యాన్నే సృష్టించుకున్న బిగ్ షాట్. కొందరు దుర్మార్గుల కన్ను గోవింద భార్గవ్ కుర్చీ మీద.. పడుతుంది. ఎవరికీ అనుమానం లేకుండా గోవింద భార్గవ్ ను, అతని కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపుతారు. ఇక సామ్రాజ్యం మొత్తాన్నీ హస్తగతం చేసుబోతున్నారు... అనుకునే తరుణంలో.. అనుకోకుండా ఒకడొస్తాడు. వాడి పేరు ‘అభిషిక్త్ భార్గవ్’. గొవింద భార్గవ్ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాల్సిన పెద్ద కొడుకు. డబ్బుని తృణప్రాయంగా భావించే ఉన్నత వ్యక్తిత్వం గల వాడు.. రాజ్యాన్నే వదులుకోగలిగిన రాముడంతటివాడు.. తన తండ్రి ఎంతో శ్రమకోర్చి ఆర్జించిన ఈ సామ్రాజ్యాన్ని అన్యుల పాలవ్వకుండా అభిషిక్త్ ఎలా కాపాడాడు? ఏ విధంగా గతించిన తండ్రి ఆకాంక్షను నెరవేర్చాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:-

పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ‘మమ్మీ’ లాంటి పాత రొడ్డ కొట్టుడు కథనొకదాన్ని తీసుకొచ్చి.. దానికి ‘అజ్ఙాతవాసి’ అనే అద్భుతమైన టైటిల్ పెట్టి.. టైటిల్ వేల్యూ తీశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాకు ’అజ్ఙాతవాసి’ అని పెట్టడం కంటే... ‘ఆఫీసుకెళ్లే దారేది’ అని పెడితే కరెక్ట్ గా ఉండేది. కథను క్లైమాక్స్ కి తీసుకెళ్లడానికి... లాజిక్కులతో పనిలేకుండా... ఏదిపడితే అది చూపిస్తే.. ఏది అనిపిస్తే అది చేసేస్తూ... చివరకు ‘సినిమా పూర్తయింది’ అనిపించేశాడు. కథలో కన్ ఫ్యూజన్, కథనంలో కన్ ఫ్యూజన్, చిత్రీకరణలో కన్ ఫ్యూజన్.. టోటల్ కన్ ఫ్యూజన్. ఈ మధ్య కాలంలో ఏ విధమైన అనుభూతినీ కలిగించని ఏకైన సినిమా ఏదైనా ఉంటే అది ‘అజ్ఙాతవాసి’ మాత్రమే. అందులో నో డౌట్. ఓ సినిమా కథ, కర్మ, క్రియా దర్శకుడు అనే మాట నిజమే అయితే... ఈ సినిమాకు ప్రథమ శత్రువు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇక పవన్ కల్యాణ్. ఆయన కనిపిస్తేనే గుడ్డలు చించేసుకునే కోట్లాదిమంది ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఈ సినిమాకు ప్రధానబలం ఆయనే. పవన్ అనే శక్తి కూడా లేకపోతే... ఈ సినిమా రెండో రోజే థియేటర్లలో ఉండదు. తన కిచ్చిన పాత్రను శక్తి మేర పోషించారు పవర్ స్టార్. అయితే... ఇందులో ఆయన కొత్తగా చేయడానికి కూడా ఏమీ లేదు. గత చిత్రాల మాదిరిగానే ‘షారా మామూలే’ అనిపించేశాడు. ఆయన అభిమానుల్ని.. మెస్మరైజ్ చేసే ఒక్క సన్నివేశం కూడా ఈ సినిమాలో లేకపోవడం బాధాకరం.

హీరోయిన్లిద్దరూ సినిమాను బాగా అలంకరించారు. వీరిద్దరికీ అంతకంటే పనికూడా లేదులేండి! ఆది పినిశెట్టి విలనీ.. ‘సరైనోడు’ తరహాలోనే సాగింది. ఈ సినిమాలో కాస్తోకూస్తో రిలీఫ్ మాత్రం రావురమేశ్, మురళీశర్మల పాత్రలే. వీరి కాంబినేషన్ సీన్లు కాస్త నవ్వు తెప్పించాయ్.

ఇక సాంకేతికంగా చెప్పుకుంటే...  అనిరుథ్ నేపథ్య సంగీతం బావుంది. పాటల రూపంలో ఏవేవో సౌండ్లు వినిపించాయ్ అంతే. మణికణన్ కెమెరా వర్క్ సూపర్. ఈ సినిమా విషయంలో మనసుపెట్టి పనిచేసింది మణికణన్ ఒక్కడేనేమో! కోటగిరి వెంకటేశ్వరరావు కొన్ని సీన్లు కట్  చేయడం మరిచిపోయారు.

టోటల్ గా చెప్పేదేంటంటే...   త్రివిక్రమ్ కెరీర్ లోనే కాదు... పవర్ స్టార్ కెరీర్లో కూడా ఓ విషయంలో ఇదే నంబర్ వన్ మూవీ. ఆ విషయం ఏంటో మీరే అర్థం చేసుకోండి.  ఇది ‘అజ్ఙాతవాసి’ కాదు.. ‘ఆఫీసుకెళ్లే దారేది’!.

రేటింగ్ :  2/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here