ENGLISH | TELUGU  

చక్కనయ్యా! చందమామ! ఎక్కడున్నావూ.. అక్కినేని బర్త్‌డే స్పెషల్

on Sep 20, 2017

 

 

పట్టుదల అనే పదానికి పర్యాయపదం అక్కినేని. సవాళ్లు ఆయన సావాసగాళ్లు.

‘ఆడతనం కనిపిస్తోందీ... హీరోగా పనికి రావ్’ అనిపించుకోవడమేంటి...? తర్వాత కాలంలో ఆడవారికే ఆరాధ్యుడవ్వడ మేంటి?

ఏడో తరగతి చదవడమేంటి? అమెరికాలో గంటకు పైగా ఇంగ్లిష్ లో ఉపన్యాసమివ్వడమేంటి?

పోటీగా ఎన్టీయార్ లాంటి అందగాడూ, మహానటుడూ ఉండటమేంటి? ఆయన్ను సైతం ఆలోచింపజేసేంత పోటీ ఇవ్వడమేంటి?

ఒక్కడంటే ఒక్కడే... మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలిరావడమేంటి? ఇండస్ట్రీ మొత్తం ఆయన వెనకాలే ఉరకెలెత్తడమేంటి?

కొండలు గుట్టల మధ్య స్టూడియో కట్టడమేంటి? చేరువనే... ఫిలింనగర్ వెలవడమేంటి?

కొండమీద అక్కినేని ఉండడమేంటి? కొండ కింద కృష్ణానగర్ తయారవ్వడమేంటి?

గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడమేంటి? అదే గుండెతో... 41ఏళ్లు బతకడమేంటి?

కేవలం కారణజన్ములకు మాత్రమే ఇవన్నీ సాధ్యం. అవును... అక్కినేని కారణజన్ముడు... రణజన్ముడు!

ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు సాధించిన విజయాలా ఇవన్నీ? అంటే.. నమ్మక తప్పదు. నమ్మాలి అంతే. ఎందుకంటే.. మొన్నటిదాకా మన ముందే మసలారుగా! గంభీరమైన నడకతో... నిండైన విగ్రహంతో తెలుగుదనాన్ని నింపుకొని
మనముందే... తిరిగారుగా!

‘స్వీయ లోపంబెరుగుట పెద్ద ఘనత..’, ‘అనువు కానీ చోట అధికులమనరాదు’..  ఈ రెండు  విషయాలనూ ప్రారంభంలోనే గ్రహించిన స్థితప్రజ్ఙుడు అక్కినేని. అలాగే తన జీవితాన్ని మలచుకున్నారాయన.  

‘దేవదాసు’ ఎవరు చేస్తారు? ‘కాళిదాసు’ ఎవరు ముట్టుకుంటారు? ‘తెనాలి రామకృష్ణ’ను ఎవరు టచ్ చేస్తారు? ‘బాటసారి’ దరిదాపులకు ఎవరైనా రాగలరా? ‘అనార్కలి’లో సలీం పాత్రను ఆ స్థాయిలో ఎవరైనా పోషించగలరా? ఇలా చెప్పుకుంటూ పోతే... ఓ పుస్తకం రాయాలి. చాలామంది రాసేశారు కూడా. నటునిగా ఆయనో ఓ శిఖరం. తాను ఓ పాత్రను ఎంచుకుంటే... మరో నటుడు ఆ పాత్ర ముట్టుకోడానికి కూడా ఆలోచించేలా చేసేంత ప్రతిభాశాలి అక్కినేని. సో... నటునిగా అక్కినేని గురించి కొత్తగా జనాలకు చెప్పడం అంటే...
జగమెరిగిన బ్రాహ్మనుడికి.. జద్యం గురించి చెప్పినట్టే.


అక్కినేని గురించి ఇప్పటి జనరేషన్ కి తెలీని విషయాలు చాలానే ఉన్నాయ్. వాటి గురించి తెలుసుకుంటే... నోళ్లెల్లబెట్టాల్సిందే? ‘నేను మాస్ హీరోని’ అని భుజాలు చరుచుకునే ఏ హీరో కూడా... రికార్డుల పరంగా ఆయన దరిదాపులకు కూడా రాలేడు అనడానికి ఇప్పుడు
చెప్పబోయే సంఘటన ఓ ఉదాహరణ.  

1948లో ‘బాలరాజు’ అనే సినిమాలో నటించారు అక్కినేని.  సినిమా బావుందని చూడ్డం మొదలుపెట్టారు జనం. అది పోనుపోనూ ప్రభంజనంగా మారింది. థియేటర్లన్నీ జనసంద్రంతో నిండిపోతున్నాయ్. చివరకు అది ఏ స్థాయికి చేరిందంటే... తెలుగు నేలపై ఉన్న కొద్ది థియేటర్లు ‘బాలరాజు’కు వస్తున్న క్రౌడ్ ని తట్టుకోలేకపోయాయ్. దాంతో... అప్పటికప్పుడు కేవలం ‘బాలరాజు’ కోసం థియేటర్లు కట్టబడ్డాయ్. ఆ సినిమా కోసం కట్టిన థియేటర్లు ఇంకా తెలుగునేలపై ఉన్నాయ్. మరి దీన్ని ఎలాంటి రికార్డ్ అనాలి? మా హీరో సినిమాకు ఇన్ని కోట్లొచ్చాయ్.. అన్ని కోట్లొచ్చాయ్ అని చెబుతుంటారు కదా. మరి దీన్ని ఎలా చెప్పాలి? చెప్పండి?.  

సాటి హీరోలను సైతం ప్రభావితం చేయడంలో కూడా అక్కినేనే అగ్రగణ్యుడు. ఎన్టీయార్, కాంతారావు, జగ్గయ్య, కృష్ణ లను మినహాయిస్తే... మిగిలిన అందరిపై అక్కినేని ప్రభావం ఉండేదంటే నమ్ముతారా? ముఖ్యంగా 1950-75 మధ్యకాలం తెరకు పరిచయమైన నటులపై అక్కినేని ప్రభావం బలంగా ఉండేది. ఆయన్నే ఇమిటేడ్ చేయడానికి ప్రయత్నించేవారు. చివరకు జూనియర్ ఆర్టిస్టులు కూడా అక్కినేని లాగే బిహేవ్ చేసేవారు...ఆయనలాగే డ్రెస్ చేసుకునేవారు. అది ఏఎన్నార్ అంటే.

గట్టిగా అనుకొని, కష్టపడి పనిచేస్తే.. కచ్చితంగా జరుగుతుంది అనడానికి అక్కినేని జీవితమే ఉదాహరణ. మృత్యువును సైతం అదుపాజ్ఞలో పెట్టుకున్నఆత్మస్థైర్యం ఆయనది. ‘నాకు కేన్సర్ వచ్చింది.’ అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన తొలి సూపర్ స్టార్ అక్కినేని. బహుశా ప్రపంచంలో ఎవరూ ఇలాంటి సాహసం చేసుండరు. ఆయన జీవితం ఓ పాఠ్యాంశం. ముందు తరాలకు ఆదర్శం. నేడు ఆ మహానటుని పుట్టిన రోజు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. వెండితెర వెలుగులా? ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు.

- నరసింహ బుర్రా

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.