శర్వానంద్‌కు సమంత 'జాను'!
on Jan 7, 2020
శర్వానంద్, సమంత కలిసి నటిస్తోన్న సినిమాకి 'జాను' అనే టైటిల్ ఖరారు చేశారు. దానర్థం 'ప్రాణం' అనే విషయం తెలిసిందే. సినిమాలో సమంత పేరు జానకి అలియాస్ జాను కావడం గమనార్హం. తమిళంలో సూపర్ హిట్టయిన '96' మూవీకి ఇది రీమేక్. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమానీ డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎడారిలో శర్వానంద్ ప్రయాణిస్తున్నట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. అతనితో పాటు ఒంటెలు కూడా ఆ పోస్టర్లో దర్శనమిస్తున్నాయి. "ఎ ట్రిబ్యూట్ టు అన్‌కండిషనల్ లవ్" అనే కామెంట్‌తో ఈ పోస్టర్‌ను తన అధికారిక ట్విట్టర్ పేజీలో ప్రొడక్షన్ కంపెనీ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పోస్ట్ చేసింది.
సినిమాలో శర్వానంద్, సమంత చిన్ననాటి స్నేహితులుగా, క్లాస్మేట్స్గా కనిపించనున్నారు. కథ ప్రకారం పెద్దయ్యాక, ఎవరి జీవితాలు వాళ్లు జీవించే వాళ్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఎలా కలుసుకున్నారు, ప్రేమ ఒక భాగమైన తమ పాత రోజుల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నారు, ఎలా ఒకరి విషయంలో మరొకరు పొరబాటుపడ్డారు వంటి అంశాల్ని సున్నితంగా, భావోద్వేగపూరితంగా 'జాను'లో మనకు దర్శకుడు చూపించనున్నాడు. ఒరిజినల్లో ఈ పాత్రల్ని విజయ్ సేతుపతి, త్రిష పోషించారు. ఆ సినిమాలోనూ త్రిష పేరు జాను కావడం విశేషం. అంటే తెలుగులోనూ దర్శకుడు హీరోయిన్ పేరు మార్చలేదన్న మాట. వివాహానంతరం మంచి మంచి పాత్రలు చేస్తూ నటిగా మరింతగా ఆకట్టుకుంటూ వస్తోన్న సమంతకు జాను పాత్ర మంచి పేరు తీసుకు రావడం ఖాయమే.
ఒరిజినల్‌కు పనిచేసిన సంగీత దర్శకుడు గోవింద్ వసంత, సినిమాటోగ్రాఫర్ మహేంద్రన్ జయరాజు ఈ సినిమాకీ పనిచేస్తుండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి పాటలు రాస్తున్నారు.
Also Read