English | Telugu

'90ఎంఎల్' మూవీ రివ్యూ

on Dec 6, 2019

 

సినిమా పేరు: 90ఎంఎల్
తారాగణం: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేశ్, సత్యప్రకాశ్, ప్రగతి, రోల్ రిడా, అజయ్, ప్రభాకర్, పోసాని కృష్ణమురలి, రఘు కారుమంచి, అలీ, ప్రవీణ్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్: జి.ఎం. శేఖర్
ఫైట్స్: వెంకట్
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వం: శేఖర్‌రెడ్డి యర్ర

బ్యానర్: కార్తికేయ క్రియేటివ్ వర్క్స్
విడుదల తేదీ: 6 డిసెంబర్ 2019

'ఆర్ఎక్స్ 100' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చేసిన 'హిప్పీ', 'గుణ 369' సినిమాలు ఫ్లాపవడంతో కచ్చితంగా మరో హిట్టు అవసరమైన కార్తికేయ.. సొంత బేనర్‌పై చేసిన సినిమా '90ఎంఎల్'. శేఖర్‌రెడ్డి యర్ర డైరెక్టర్‌గా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాలో ప్రతి పూటా 90ఎంఎల్ అల్కహాల్ వెయ్యకపోతే చచ్చిపోయే అరుదైన జబ్బు ఉన్న యువకుడిగా కార్తికేయ నటించాడంటూ విడుదలకు ముందుగానే ప్రచారం చేశారు. ట్రైలర్ వచ్చాక, అలాంటి జబ్బు ఉన్న హీరో తన ప్రేమను గెలిపించుకోడానికి ఏం చేస్తాడోనని ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూశారు. మరి సినిమా ఎలా ఉందంటే...

కథ
దేవదాసు లాంటి గొప్ప ప్రేమికుడు తన కడుపున పుట్టాలని కోరుకున్న ఒక తల్లి (ప్రగతి)కి పుట్టుకతోనే 'ఫాటల్ అల్కహాల్ సిండ్రోం' అనే జబ్బుతో కొడుకు పుడతాడు (అమ్మాయి పుట్టాలని ఆ తల్లి కోరుకోదని గ్రహించాలి). అంటే పుట్టుకతోనే ఆల్కహాల్‌కు బానిసయ్యే జబ్బన్న మాట. ఆ కొడుకుకు దేవదాసు అనే పేరు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. మూడు పూటలా బిడ్డకు మందెయ్యాలని, ఒక్క పూట మందెయ్యకపోయినా బతకడని డాక్టర్ చెప్పడంతో, వాళ్లు ఆల్కహాల్‌నే మందుగా వేస్తూ పెంచుతారు. పెద్దవాడయ్యేసరికి పూటకు 90ఎంఎల్ వేస్తే తప్ప మామూలు మనిషిగా ఉండలేని స్థితికి వస్తాడు దేవదాసు (కార్తికేయ). ఒక మందు ముహూర్తాన సువాసన (నేహా సోలంకి) అనే ఫిజియోథెరపిస్టును చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి సువాసన కూడా అతడికి మనసిస్తుంది. అయితే దేవదాసు జబ్బు విషయం సువాసనకు తెలీదు. మందు వాసనే గిట్టని ఆమె తండ్రి, ట్రాఫిక్ ఎస్సై 'క్షుణ్ణాకర్ రావు' (రావు రమేశ్)కు దేవదాసు మందుబాబు అనే విషయం తెలిసిన క్షణాల్లోనే సువాసనకూ తెలుస్తుంది. దాంతో అతడికి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమెపై కన్నేసి, ఆమెను పెళ్లాడాలనుకున్న జాన్ విక్ (రవికిషన్) అనే వ్యాపారవేత్త వేసిన ఎత్తును దేవదాసు చిత్తు చేశాడా? సువాసన మనసును మళ్లీ గెలుచుకున్నాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ
టైటిల్‌కు తగ్గట్లే ఈ లవ్ స్టోరీ అంతా 90ఎంఎల్ మందు చుట్టూ తిరిగితే, పాత్రలన్నీ ఆ 90ఎంఎల్ చుట్టూ తిరుగుతుంటాయి. సినిమా మొత్తం మందుమయమే కావడంతో మందుబాబులు కాని ప్రేక్షకులకు కాస్త సహనం ఉండాల్సిందే. ఫస్టాఫ్ కాస్త వినోదంతో నడించిందంటే, సెకండాఫ్ నానా కంగాళీగా, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అతి బలహీనమైన స్క్రీన్‌ప్లేతో సహనానికి పరీక్షగా నిలిచింది. సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా ఎలా నడిపించాలో తెలీకపోవడం వల్లే అలాంటి సన్నివేశాలు కల్పించాడని ఇట్టే అర్థమైపోతుంది. జాన్ విక్ బృందం ఒక రౌడీ మూక అని ముందుగానే క్షుణ్ణాకర్ రావుకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి ఆ బ్యాచ్‌కు క్షుణ్ణాకర్ రావు కుటుంబం (సువాసన మినహాయించి) దేహశుద్ధి చేస్తుంది. అలాంటి జావ్ విక్ తన చేతుల మీదుగా ఒక అవార్డ్ ఇచ్చేసరికి క్షుణ్ణాకర్ రావు మనసు మారిపోవడం ఏమిటో, జాన్ విక్ వచ్చి సువాసనను పెళ్లి చేసుకుంటాననేసరికి ఒప్పేసుకోవడం ఏమిటో అర్థం కాదు. ఆ సన్నివేశాలతో అంతదాకా ఉన్నతంగా కనిపించిన క్షుణ్ణాకర్ రావు పాత్ర ఔచిత్రం ఒక్కసారిగా అథమ స్థాయికి పడిపోయింది. 

క్లైమాక్స్ సీన్ కోసం డైరెక్టర్‌లోని రచయిత కల్పించిన ప్రదేశం కూడా ఏవగింపు కలిగిస్తుంది. ఒక పబ్‌లో ఐటం సాంగ్ పెట్టి క్లైమాక్స్‌ను నీచస్థాయికి దిగజార్చేశాడు. "ఏంటి ఇలాంటి సీన్ వచ్చింది?" అని మనం చికాకు పడుతుండగానే, అదే తరహాలో మరో సీను వచ్చి మన చికాకును మరింత పెంచుతుంది. హీరో చెప్పేది వినకుండా హీరోయిన్ అతడిని అపార్థం చేసుకోవడం ఎన్ని సినిమాల్లో చూసుంటాం! ఇందులోనూ అంతే.. దేవదాసు నిజం చెప్పాలని నోరు తెరిస్తే చాలు.. అతడు చెప్పేది విననని నోరు మూయించేస్తుంటుంది సువాసన. మిగతా విషయాలు ఎన్ని చెప్పినా వినే ఆమె, అతడు తన జబ్బు గురించి చెప్పబోయినప్పుడు మాత్రమే వినిపించుకోదు! కొత్త దర్శకుడైన శేఖర్‌రెడ్డి ఈ విషయంలో మాత్రం పాత చింతకాయ పచ్చడి హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌నే నమ్ముకొని తప్పులో కాలేశాడు. పైగా దేవదాసు నిజం చెబుతామని నోరు తెరిచినప్పుడల్లా పెద్ద పెద్దగా అరిచేస్తుంటుంది సువాసన. దాంతో హీరోయిన్ పాత్రను మనం ప్రేమించలేం, ఆ పాత్రతో డిస్‌కనెక్ట్ అయిపోతాం. 

దేవదాసు చేత మందు మానిపించాలని అతడిని సువాసన రీహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లే ఎపిసోడ్ సినిమాకు ఏ రకంగానూ ఉపకరించలేదు. అది కథలో బలవంతంగా చొప్పించిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ జాన్ విక్ క్యారెక్టరైజేషన్ విషయంలోనూ తికమకకు గురయ్యాడు దర్శకుడు. సైకో మనస్తత్వం కలిగిన అతడు క్షుణ్ణాకర్ రావు ఇంటికి తొలిసారి వెళ్లినప్పుడు జోకర్‌లాగా బిహేవ్ చెయ్యడం, క్షుణ్ణాకర్ రావు భార్య కర్రలతో తన గ్యాంగ్‌ను కొడుతుంటే, బాల్కనీపైకి ఎక్కి భయపడటం.. ఏంటీ క్యారెక్టరైజేషన్? సినిమాలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉన్నదంటే.. అది అనూప్ రూబెన్స్ మ్యూజిక్. రెండు మూడు పాటలు బాగున్నాయనిపించాయంటే, అది ఆయనిచ్చిన సంగీతం వల్లే. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు కూడా వంక పెట్టలేం. ఈ సినిమా చూస్తుంటే మీడియాలేని కాలంలో జరిగినట్లు అనిపిస్తుంది. దేవదాసు పోలీస్ స్టేషన్లో ఎస్సైనీ, కానిస్టేబుళ్లనూ చితక్కొట్టినా, విలన్ వదిలెయ్యమనేసరికి ఆ ఎస్సై అతడిని వదిలేస్తాడు. మామూలుగా అయితే ఇది మీడియాకు తెలియకుండా ఉండదు, హెడ్‌లైన్స్‌లోకి ఎక్కకుండా ఉండదు. అయితే సినిమాలో కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మాత్రం కనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్
కార్తికేయ నటన
అనూప్ రూబెన్స్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
హీరోయిన్ క్యారెక్టరైజేషన్
బలవంతంగా చొప్పించిన, లాజిక్‌కు అందని పలు సన్నివేశాలు
సెకండాఫ్‌లో విసుగెత్తించే స్క్రీన్‌ప్లే
అథమ స్థాయిలో ఉన్న క్లైమాక్స్

నటీనటుల అభినయం
దేవదాసు పాత్రలో కార్తికేయ చలాకీగా నటించాడు. సరదా సన్నివేశాలను ఎంత చులాగ్గా చేశాడో, ఎమోషనల్ సీన్లలో అంత పరిణతితో హావభావాలు పలికించాడు. ఫైట్లలో చెలరేగిపోయాడు. డాన్సుల్లో స్పీడుతో పాటు రిథం చూపాడు. అయితే అక్కడక్కడా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఓవర్ డ్రమటైజేషన్ ప్రదర్శించాడు. డబ్బింగ్ విషయంలో అతను కాస్త శ్రద్ధ వహించాలి. హీరోయిన్ నేహా సోలంకి అందచందాల పరంగా ఆకట్టుకుంది. చాలా సన్నివేశాల్లో ముచ్చటగా అనిపించింది కూడా. కానీ కీలక సన్నివేశాల్లో ఆమె క్యారెక్టరైజేషన్ కారణంగా ఆ పాత్రతో మనం సహానుభూతి చెందలేం. అది ఆమె తప్పు కాదు, దర్శకుడి తప్పు. మందు తాగితే ఒకరకంగా, మామూలుగా ఉన్నప్పుడు మరోరకంగా వ్యవహరించే జాన్ విక్ క్యారెక్టర్ లాంటివి రవికిషన్‌కు అలవాటైన వ్యవహారం. ఓవర్‌గా బిహేవ్ చేసే క్యారెక్టర్‌లో రాణించాడు. క్షుణ్ణాకర్ రావుగా రావు రమేశ్ పాత్రకు వంక పెడతామా? చివర అర గంటలో ఆయన క్యారెక్టర్‌ను పాడు చెయ్యకుండా ఉన్నట్లయితే, ఆయన మరింతగా నచ్చి ఉండేవాడు. అజయ్, కారుమంచి రఘు, ప్రగతి, సత్యప్రకాశ్ పరిధుల మేరకు నటించారు. హీరో ఫ్రెండుగా రోల్ రిడా రాణించాడు. కామెడీ విలన్‌గా ప్రభాకర్ కొత్తగా కనిపించి మెప్పించాడు. పోసాని, అలీ, ప్రవీణ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌గా ఒక కొత్త పాయింట్ తీసుకున్నా కూడా, పాత చింతకాయ పచ్చడి ధోరణి క్యారెక్టరైజేషన్స్, అసందర్భ సన్నివేశాలు, బలహీనమైన స్కీన్‌ప్లేతో సినిమాని ఎలా పాడుచేయవచ్చో చెప్పడానికి '90ఎంఎల్' ఒక నిఖార్సయిన ఉదాహరణ.

రేటింగ్: 2/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips