English | Telugu

థ్రిల్ క‌లిగించ‌ని '47 డేస్'.. మూవీ రివ్యూ

on Jul 3, 2020

 

సినిమా పేరు: 47 డేస్‌
తారాగ‌ణం: స‌త్య‌దేవ్‌, పూజా ఝ‌వేరి, రోష్ణీ ప్ర‌కాశ్‌, ర‌వివ‌ర్మ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, స‌త్య‌ప్ర‌కాశ్‌, ఇర్ఫాన్‌, ముఖ్తార్ ఖాన్‌, హ‌రితేజ‌, కిరీటి ధ‌ర్మ‌రాజు
పాట‌లు:  భాస్క‌ర‌భ‌ట్ల‌, ల‌క్ష్మీ భూపాల‌, విశ్వా, ప్రీతి కేశ్వాన్‌
సంగీతం: ర‌ఘు కుంచే
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
యాక్ష‌న్‌: స‌్టంట్స్ శ్రీ‌
నిర్మాత‌లు: ద‌బ్బ‌ర శ‌శిభూష‌ణ్ నాయుడు, ర‌ఘు కుంచే, శ్రీ‌ధ‌ర్ మ‌క్కువ‌, విజ‌య్ శంక‌ర్ దొన‌కొండ‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌దీప్ మ‌ద్దాలి
బ్యాన‌ర్‌:  టైటిల్ కార్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా రిలీజైన ఈ సినిమాపై వ‌చ్చిన రివ్యూలు నెగ‌టివ్‌గా ఉండేస‌రికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు కుంచే చాలా ఆవేద‌న‌తో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించ‌డం చూసి, ఆయ‌న ఎందుకంత బాధ‌ప‌డ్డాడా అనిపించింది. కొత్త‌గా విడుద‌లైన సినిమాని విమ‌ర్శిస్తే, సినిమా ఇండ‌స్ట్రీయే చ‌చ్చిపోతుంద‌న్న‌ట్లు చాలా తీవ్రంగా క‌ల‌త చెందిన ఆయ‌న భావోద్వేగం చూసి ఆశ్చ‌ర్య‌మూ క‌లిగింది. ఏ ప్రొడ‌క్ట్ అయినా మంచి చెడుల‌ను బేరీజు వేసుకొని, నాణ్యంగా తీసుకురాగ‌లిగితేనే దానికి మ‌నుగ‌డ‌. మార్కెట్లోకి వ‌చ్చిన ఒక స‌బ్బు నాణ్యంగా లేద‌ని మ‌నం మాట్లాడుకుంటే, ఆ స‌బ్బు త‌యారీపై చాలా కుటుంబాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌నీ, స‌బ్బును విమ‌ర్శిస్తే దాన్ని కొనేవాళ్లు ఉండ‌ర‌నీ, అప్పుడు ఆ కుటుంబాలు వీధిన ప‌డ‌తాయ‌నీ అన‌డం ఎలాంటిదో, సినిమా బాగాలేద‌ని విమ‌ర్శిస్తే, దాని మీద ఆధార‌ప‌డి బ‌తికేవాళ్లు అలాగే వీధిన ప‌డ‌తార‌న‌డ‌మూ అలాంటిదే.. ఎవ‌రు విమ‌ర్శించినా, విమ‌ర్శించ‌క‌పోయినా ఒక ప్రొడ‌క్ట్ నాణ్యంగా ఉంటే దానిని ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. అనేక సంద‌ర్భాల్లో ఈ విష‌యం  ఈ చిన్న విష‌యం ర‌ఘు కుంచేకు తెలియ‌దంటే ఆశ్చ‌ర్యమేస్తోంది. '47 డేస్' మూవీపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని  ర‌ఘు ఎందుకు స‌హించ‌లేక‌పోయాడు? ఆ సినిమాకి ఆయ‌న కూడా ఒక నిర్మాత అయినందునేనా!

క‌థ‌
ఏసీపీ స‌త్య (స‌త్య‌దేవ్‌) ఎంతో ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ప‌ద్దు (రోష్ణీ ప్ర‌కాశ్‌) మార్చి 23న అత‌డి క‌ళ్ల‌ముందే అపార్ట్‌మెంట్ మీద నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. అదే రోజు, ఫోనిక్స్ అనే ఒక ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ య‌జ‌మాని స‌త్యశ్రీ‌నివాస్ (ఇర్ఫాన్‌) బీచ్ ద‌గ్గ‌ర అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయి క‌నిపిస్తాడు. అత‌డిది ఆత్మ‌హ‌త్య అని పోలీసులు కేసు క్లోజ్ చేస్తారు. ఒకానొక సంద‌ర్భంలో ఈ రెండు చావుల‌కు మ‌ధ్య ఏదో క‌నెక్ష‌న్ ఉంద‌ని సందేహించిన స‌త్య స‌స్పెన్ష‌న్‌లో ఉండి కూడా సొంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ సంద‌ర్భంగా అత‌డికి ఎలాంటి అనుభ‌వాలు, ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? త‌న భార్య ఆత్మ‌హ‌త్య వెనుక ఉన్న మిస్ట‌రీని 47 రోజుల్లో అత‌ను ఎలా ఛేదించాడు? అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
'47 డేస్‌'ను డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందించాల‌నుకున్నాడు. క్రైమ్ అయితే పెట్టాడు కానీ, దాన్ని థ్రిల్లింగ్‌గా తియ్య‌లేక‌పోయాడు. మొద‌టి 40 నిమిషాల సినిమాని ఒక మోస్త‌రుగా న‌డిపిన అత‌ను, ఆ త‌ర్వాత స్క్రీన్‌ప్లే విష‌యంలో త‌డ‌బాటుకు గుర‌య్యాడు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఇంప్రెసివ్‌గా మ‌ల‌చ‌లేక‌పోయాడు. స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఏసీపీ స‌త్య త‌న భార్య సూసైడ్ కేసును ఇన్వెస్టిగేష‌న్ చేస్తూ, త‌ను తెలుసుకున్న విష‌యాల‌ను పోలీస్ క‌మిష‌న‌ర్ (ముఖ్తార్ ఖాన్‌) ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లి, వాటి ఆధారాల‌ను చూపించ‌లేక ప‌దే ప‌దే ఫెయిల‌వుతూ, ప‌దే ప‌దే చివాట్లు తిన‌డం విసుగు తెప్పిస్తుంది. ఫ‌లితంగా ఏసీపీ స‌త్య భావోద్వేగాల‌తో మ‌నం స‌హానుభూతి చెంద‌లేం. ప్ర‌ధాన పాత్ర‌తో ఎప్పుడైతే మ‌నం క‌నెక్ట్ కాలేమో, అప్పుడు ఆ సినిమా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. '47 డేస్‌'లో క‌నిపించిన ప్ర‌ధాన లోపం ఇదే.

క‌థ‌లో ఏసీపీ స‌త్య అనుమానించిన క్రిస్టినా (పూజా ఝ‌వేరి) అనే యువ‌తి పాత్ర చిత్ర‌ణా అలాగే ఉంది. ఫోనిక్స్ ఫార్మాస్యూటిక‌ల్ ఓన‌ర్ పేరు స‌త్య‌శ్రీ‌నివాస్ అని అంద‌రికీ తెలుసు. కానీ త‌ను సెవ‌న్త్ క్లాస్‌లో రోమియో అండ్ జూలియ‌ట్ నాట‌కం వేసిన‌ప్పుడు, అందులో రోమియో క్యారెక్ట‌ర్‌లో న‌టించిన స‌త్యే ఈ స‌త్య‌శ్రీ‌నివాస్ అనుకొని క్రిస్టినా అత‌డికి ద‌గ్గరై రిలేష‌న్‌షిప్ పెట్టుకోవ‌డం, చివ‌ర‌కు త‌న రోమియో అత‌డు కాద‌ని ఆమెకు తెలియ‌డం.. ఈ ఎపిసోడ్‌ను డైరెక్ట‌ర్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా చిత్రీక‌రించ‌లేక‌పోయాడు. ఆ ఎపిసోడ్ ముగింపును అత‌ను తీసిన విధానం మ‌రీ నాసిర‌కంగా ఉంది. వారి మ‌ధ్య స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు చాలా కృత‌కంగా ఉన్నాయి.

శ్రీ‌కాంత్ అయ్యంగార్ చేసిన ఏఎస్సై రాజారామ్‌ క్యారెక్ట‌ర్‌ను మొద‌ట్లో బాగానే చిత్రించిన ద‌ర్శ‌కుడు చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి దానికీ స‌రైన న్యాయం చెయ్య‌లేక‌పోయాడు. ఇక హ‌రితేజ‌, కిరీటి ధ‌ర్మ‌రాజు మ‌ధ్య సీన్లు ఎంత‌ హాస్యాస్పందంగా, ఎంత‌ నాసిర‌కంగా ఉన్నాయో చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఓవైపు హ‌రితేజ‌తో స‌త్య మాట్లాడుతుంటే, మ‌రోవైపు హ‌రితేజ‌కు కిరీటి క‌న్నుగీట‌డం, గాల్లో ముద్దులు విస‌ర‌డం, అవిచూసి హ‌రితేజ "ఛీపో" అన్న‌ట్లు సైగ చెయ్య‌డం.. బాప్‌రే భ‌రించ‌లేం!!

సినిమాలో మ‌న‌కు న‌చ్చేవి స‌త్య‌దేవ్ ప‌ర్ఫార్మెన్స్‌, ర‌ఘు కుంచే బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్‌, జీకే సినిమాటోగ్ర‌ఫీ. మిగ‌తా వాటి గురించి బాగా చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

 

ప్ల‌స్ పాయింట్స్
స‌త్య‌దేవ్ న‌ట‌న‌
ర‌ఘు కుంచే సంగీతం
జి.కె. సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌
వీక్ స్క్రీన్‌ప్లే
చికాకు తెప్పించే పాత్ర‌ల తీరు
హాస్యాస్ప‌ద స‌న్నివేశాలు
ఆస‌క్తిక‌రంగా లేని ఎడిటింగ్‌

న‌టీన‌టుల ప‌నితీరు
ఏసీపీ స‌త్య‌గా స‌త్య‌దేవ్ సినిమానంతా త‌న భుజాల‌పై న‌డిపేందుకు య‌త్నించాడు. పాత్ర‌ను అర్థం చేసుకుంటూ అత‌ను ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు ఆక‌ట్టుకుంటాయి. కానీ పాత్ర తీరు వ‌ల్ల అతని న‌ట‌న వృథా అయ్యింది. క్రిస్టినా అలియాస్ జూలియ‌ట్‌గా పూజా ఝ‌వేరి ఫ‌ర్వాలేద‌నిస్తుంది. స‌త్య‌శ్రీ‌నివాస్‌గా ఇర్ఫాన్ ఓకే. స‌త్య భార్య ప‌ద్దు పాత్ర‌లో రోష్ణి ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. స‌త్య స్నేహితుడైన‌ పోలీసాఫీస‌ర్ ర‌విగా ర‌వివ‌ర్మ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఒక చిన్న పాత్ర‌లో సీనియ‌ర్ యాక్ట‌ర్ స‌త్య‌ప్ర‌కాశ్ త‌న‌కు అల‌వాటైన తీరులో న‌టించాడు. శ్రీ‌కాంత్ అయ్యంగార్ మొద‌ట్లో ఆక‌ట్టుకొని, చివ‌ర‌లో త‌న డైలాగ్స్‌తో ఇబ్బంది పెట్టాడు. హ‌రితేజ‌, కిరీటి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

తెలుగు ఒన్ ప‌ర్‌స్పెక్టివ్‌
'47' డేస్ త‌ర‌హాలో ఇటీవ‌ల ఎన్నో క్రైమ్ థ్రిల్ల‌ర్స్ తెలుగులో వ‌చ్చాయి. ఇందులో కొత్త‌గా అనిపించిన విష‌య‌మేమీ లేదు. ఆరంభంలో రేకెత్తిన ఆస‌క్తిని తుదికంటా కొన‌సాగించ‌డంలో డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు. ఫ‌లితంగా '47 డేస్' ఏమాత్రం థ్రిల్స్ అందించ‌లేక‌పోయాయి.

రేటింగ్‌: 2/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.