'365 డేస్' మూవీ రివ్యూ (నెట్‌ఫ్లిక్స్)
on Jul 4, 2020
సినిమా పేరు: 365 డేస్ (ఒరిజినల్ టైటిల్ '365 డిఎన్ఐ')
తారాగణం: మిచెలే మొర్రోనే, అన్నా-మరియా సీక్లుక్కా, బ్రోనిస్లా రోక్లావస్కీ, ఓటర్ సారాలిడ్జే, మగ్దలీనా లాంపర్స్కా, నటాజా ఉర్బన్స్కా
మ్యూజిక్: మిచల్ సరపట, మట్యూజ్ సరపట
సినిమాటోగ్రఫీ: మట్యూజ్ సీర్లికా
ఎడిటింగ్: మార్సిన్ డ్రూనోవ్స్కీ
డైరెక్టర్స్: బార్బరా బియాలోవస్, తోమజ్ మాండెస్
పోలండ్‌కు చెందిన కాస్మటాలజిస్ట్, రైటర్ బ్లాంకా లిపిన్స్కా రాసిన ఫేమస్ ట్రైలాజీలోని మొదటి నవల '365 డిఎన్ఐ' ఆధారంగా బార్బర్ బియాలోవస్, తోమజ్ మాండెస్ సంయుక్తంగా అదే టైటిల్‌తో డైరెక్ట్ చేసిన ఈ పోలిష్ మూవీ ఒక ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా. పోలండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయంగా ట్రెండింగ్‌లో ఉంది.
కథ
మాసిమో (మిచెలే మొర్రోనే) ఒక సిసిలియన్ గ్యాంగ్‌స్టర్. అతడి కళ్లముందే మాఫియా కింగ్ అయిన అతడి తండ్రిని షూట్ చేసి చంపేస్తారు ప్రత్యర్థులు. తండ్రి మాఫియా సామ్రాజ్యానికి కింగ్ అవుతాడు మాసిమో. వార్సాకు చెందిన ఒక కంపెనీ సేల్స్ డైరెక్టర్ అయిన లౌరా (అన్నా-మరియా సీక్లుక్కా) కంపెనీ పనిమీద సిసిలీకి వచ్చి, మాసిమో కంట్లో పడుతుంది. తొలిచూపులోనే మోహించిన మాసిమో ఆమెను కిడ్నాప్ చేసి తన నివాసంలో బంధిస్తాడు. తనను ప్రేమించడానికి 365 రోజుల గడువు ఇస్తాడు. అప్పటిదాకా అక్కడ బందీగా ఉండాల్సిందేనంటాడు. ఆ టైమ్‌లో లౌరా అతడిని ప్రేమించిందా? ఆమె వల్ల మాసిమో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఈ సినిమాలో మొదటగా ఆకట్టుకొనేది ప్రొడక్షన్ వాల్యూస్. ఒక పోలిష్ మూవీలో హాలీవుడ్ రేంజి క్వాలిటీ నిర్మాణ విలువలు ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ టాప్ రేంజిలో ఉన్న ఈ సినిమాలో సెక్స్, వయొలెన్స్, సెక్సువల్ వయొలెన్స్ ఉన్న, డ్రగ్స్ ఉపయోగించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి కాబట్టే ఇవాళ ట్రెండింగ్‌లో ఉందనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో కొత్తగా వచ్చే సినిమాల్లో ఈ తరహా సీన్లు ఉన్నవి చాలానే కనిపిస్తాయి. కానీ అవన్నీ ట్రెండింగ్‌లో లేవు. తను మోజు పడ్డ యువతి ప్రేమను పొందడానికి ఒక డాన్ ఎన్ని అవస్థలు పడ్డాడు, ఎంత సహనం ప్రదర్శించాడు, ఎన్ని ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్నాడు అనే విషయాల్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా డైరెక్టర్స్ చిత్రీకరించడమే ఈ సినిమా ఘన విజయానికి కారణమనడంలో సందేహం లేదు.
మాసిమోను అసహ్యించుకుంటూ వచ్చిన లౌరా.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా అతడిని రెచ్చగొట్టే, ప్రొవోక్ చేసే సన్నివేశాలు, ఆ సమయంలో తనను తాను సంభాళించుకోడానికి మాసిమో పడే అవస్థలు ఆకట్టుకుంటాయి. కావాలనుకుంటే లౌరాను మాసిమో దౌర్జన్యంగానైనా అనుభవించే అవకాశం ఉంది. కానీ మాసిమోకు కావాల్సింది ఆమె శరీరం మాత్రమే కాదు, ఆమె మనసు కూడా. అందుకే ఆమె ప్రేమను పొందాకే ఆమె శరీరాన్నీ పొందాలనుకుంటాడు. ఈ విషయం గ్రహించిన లౌరా అతడి బలహీనతతో ఆడుకోవడమే కాకుండా అనేక సందర్భాల్లో అతడిని ప్రమాదంలో పడేస్తుంది, తను కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటూ వస్తుంది. మాసిమో ఆమెను కాపాడుకుంటూ వస్తాడు. నిజానికి లౌరాకు అప్పటికే ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అందుకే మాసిమోను మొదట ద్వేషిస్తుంది. కానీ తన బాయ్‌ఫ్రెండ్ పత్తిత్తు కాదని ఆమెకు తెలుస్తుంది. మాసిమో తనను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ప్రణయాగ్నిలో దహించుకుపోయే ఇద్దరు ప్రేమికుల తొలి శారీరక కలయిక ఎంతటి భావేవేశంతో, భావోద్వేగంతో ఉంటుందో '365 డేస్' మూవీ మన కళ్లకు కట్టిస్తుంది. అంతటితో కథ అయిపోలేదు. 365వ రోజు మనం ఊహించనిది జరుగుతుంది. అది తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూడాల్సిందే.
నటీనటుల అభినయం
లౌరా క్యారెక్టర్లో అన్నా-మరియా సీక్లుక్కా అభినయం, ఆమె అసాధారణ సౌందర్యం అబ్బురపరుస్తాయి. పాత్రలోని భిన్న ఛాయలను ఆమె పోషించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. జోవియల్‌గా రోజుల్ని గడిపే ఆమె ఆకస్మికంగా ఒక గ్యాంగ్‌స్టర్ గుప్పిట చిక్కినప్పుడు ఎలాంటి మానసిక స్థితిని అనుభవిస్తుంది? అతడిని ఎలా ద్వేషిస్తుంది? చివరాఖరుకి అతడికి తన మనసుని, తనువుని ఎలా అర్పిస్తుంది? ఇన్ని భావావేశాల్ని ఆమె ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటుంది. గ్యాంగ్‌స్టర్ మాసిమో పాత్రకు అతికినట్లు సరిపోయాడు మిచెలే మొర్రోనే. ఓవైపు లౌరా ప్రేమను పొందడానికి తపన పడే వ్యక్తిగా, మరోవైపు తన మాఫియా సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికి కష్టపడే గ్యాంగ్‌స్టర్‌గా అతను పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. ఈ మూవీతో అటు అన్నా-మరియా, ఇటు మొర్రోనే ఇద్దరూ పాపులర్ అయ్యారు. మాసిమో రైట్‌హ్యాండ్ లాంటి మారియో క్యారెక్టర్లో బ్రోనిస్లా రోక్లావస్కీ, మాసిమో మరో ముఖ్య అనుచరుడు డోమినికోగా ఓటర్ సారాలిడ్జే, లౌరా ఫ్రెండ్ ఓల్గా పాత్రలో మగ్దలీనా లాంపర్స్కా తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.
తెలుగు ఒన్ పర్స్పెక్టివ్
గ్యాంగ్‌స్టర్ మూవీస్‌ను ఇష్టపడే వాళ్లతో పాటు, లవ్ స్టోరీస్‌ను ఇష్టపడేవాళ్లనూ ఆకట్టుకొనే సినిమా '365 డేస్'. ఈ సినిమా చూసేముందు సెక్స్, వయొలెన్స్ మసాలాలు కాస్త ఎక్కువగానే ఉంటాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం శ్రేయస్కరం.
- వనమాలి