English | Telugu

30 ఏళ్ల ట్రెండ్‌సెట్టర్ 'శివ'

on Oct 5, 2019

 

30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా అప్పటిదాకా తెలుగు సినిమా ఫార్ములాకు ఉన్న హద్దుల్ని, రూల్స్‌ని చెరిపేసింది. స్క్రీన్‌ప్లే ఎలా ఉండాలో, యాక్షన్ సీన్స్‌ను ఎలా తియ్యాలో, సౌండ్ ఎలా ఉండాలో, క్యారెక్టరైజేషన్స్‌ను ఎలా రూపొందించాలో.. ఔత్సాహిక రచయితలకూ, దర్శకులకూ నేర్పించింది. వాళ్లకది ఒక డిక్షనరీ.. పెద్ద బాలశిక్ష. వెరసి.. తెలుగు సినీ ప్రేమికులకు అప్పటివరకూ ఎరుగని ఒక సరికొత్త అనుభవాన్నీ, అనుభూతినీ అందించింది. ఆ మూవీ.. 'శివ'. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా.. 'శివ'. అది రాంగోపాల్ వర్మ అనే ఒక గొప్ప దర్శకుడ్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించింది. అక్కినేని నాగార్జునను యూత్ ఐకాన్‌గా మార్చింది. ఆ సినిమా విడుదలైన తేదీ 1989 అక్టోబర్ 5. అంటే యాక్షన్ క్లాసిక్‌గా హిస్టరీలో నిలిచిన ఆ మూవీ రిలీజై నేటికి సరిగ్గా 30 ఏళ్లు!

'శివ' ఎంతటి అసాధారణ చిత్రమంటే.. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 100 రోజులు ఆడిన ఏకైక తెలుగు చిత్రం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఘనతను సాధించింది. ఇప్పటివరకూ మరే తెలుగు సినిమా ఈ రికార్డును చేరుకోలేకపోయింది. అంతే కాదు, దేశంలోనే తొలి సినిమాతోటే ఇలాంటి ఘనతను పొందిన ఏకైక దర్శకుడిగా రాంగోపాల్ వర్మ చరిత్ర సృష్టించాడు. 

విడుదలై 30 ఏళ్లయినా.. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే.. మనల్ని మనం మర్చిపోతాం. మనం 'శివ'గా మారిపోతాం. కాలేజ్ స్టూడెంట్ అయిపోతాం. ఆ సన్నివేశాలు, ఆ ఫైట్లు.. ప్రత్యేకించి సైకిల్ చైన్ ఫైట్.. ఆ పాటలు, శివ - భవాని మధ్య ఘర్షణ సీన్లు.. వారెవ్వా.. సినిమా అంటే ఇది కదా!.. అని మరోసారి అనుకుంటాం. హీరోకు 'శివ' ఎలా రోల్ మోడల్ అయ్యాడో, విలన్‌కు 'భవాని' అలా రోల్ మోడల్ అవడం ఈ మూవీ స్పెషాలిటీ. శివ కేరెక్టర్‌లో నాగార్జున ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో, భవానీ పాత్రతో తమిళ్ యాక్టర్ రఘువరన్ అంత క్రేజ్ తెచ్చుకున్నాడు.

'శివ' రిలీజై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సృష్టించిన సెన్సేషన్‌తో.. ఒకానొక దశలో దాన్ని బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ కూడా వినిపించింది. కారణం.. 'శివ'లోని సైకిల్ చైన్ ఫైట్‌కు ప్రభావితులై పలు కాలేజీల్లో స్టూడెంట్ గ్రూపులు సైకిల్ చైన్లతో తలపడటం. ఒక సినిమా.. ప్రేక్షకుల్ని ఇంతగా ప్రభావితం చెయ్యడం.. ఆ తర్వాత మనమెప్పుడూ చూడలేదు. 

అంతేనా.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటలు ఈ సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లాయి. ఇప్పటికీ 'బోటనీ పాఠముంది.. మ్యాటినీ ఆట వుంది.. దేనికో ఓటు చెప్పరా' సాంగ్ కాలేజీ స్టూడెంట్లకు ఐకానిక్ సాంగే. 'సరసాలు చాలు శ్రీవారూ ఇది వేళ కాదు' లాంటి రొమాంటిక్ సాంగ్‌ను మళ్లీ మనం చూశామా! ఆ పాటలో నాగార్జున, అమల చేసిన సందడి ఇంకా మన హృదయాలపై వీణలు మీటుతున్నట్లే ఉంటుంది. అలాగే ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'శివ' నుంచే తెలుగు సినిమా సౌండ్ మారడానికి ఇళయరాజా కారకుడయ్యారు.

ఆ సినిమా ఎంతోమంది యాక్టర్లకూ, టెక్నీషియన్లకూ జీవితాన్నిచ్చింది. తనికెళ్ల భరణి, జె.డి. చక్రవర్తి, ఉత్తేజ్, చిన్నా, రాంజగన్ లాంటి నటులుగా లైఫ్‌ను పొందింది ఆ సినిమాతోటే. టెక్నీషియన్స్‌లో స్వయంగా రాంగోపాల్ వర్మ.. గ్రేట్ డైరెక్టర్‌గా మారితే, సినిమాటోగ్రాఫర్‌గా ఎస్. గోపాల్‌రెడ్డి స్టార్ తిరిగింది. 

ఇవాళ తెలుగులో రాణిస్తున్న చాలామంది దర్శకులు తాము 'శివ' మూవీతో స్ఫూర్తి పొందామని చెప్పడానికి వెనుకాడరు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటి రాంగోపాల్ వర్మ శిష్యులు మాత్రమే కాదు, ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, విక్రం కె. కుమార్ వంటి డైరెక్టర్లు కూడా 'శివ' మూవీ తమపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో చెప్పారంటే.. ఈ మూవీ గ్రేట్‌నెస్ ఎలాంటిదో అర్థమవుతుంది. టెక్నికల్‌గా తెలుగు సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అనే చెప్పుకుంటాం.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here