దీపావళికి తమిళ సినిమాలే దిక్కు
on Oct 21, 2019
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'విజిల్' ఈ శుక్రవారం తెలుగులోనూ విడుదలవుతోంది. అలాగే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ నటించిన 'ఖైదీ' కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ దీపావళికి తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాలు ఇవే. సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఇవే దిక్కు. తెలుగు ప్రేక్షకులది పెద్ద మనసు. తెలుగు, తమిళం అని వివక్ష చూపకుండా మంచి సినిమాలు వస్తే చూస్తారు. అలాగని, థియేటర్లలో కొత్త తెలుగు సినిమాలు లేకపోతే ఎలా? అదీ దీపావళికి. పండక్కి తెలుగులో మాంచి స్టార్ సినిమా విడుదలైతే అదో కిక్. గత ఏడాది (2018)లో దీపావళికి నాలుగు రోజుల ముందు నాగచైతన్య 'సవ్యసాచి' విడుదలైంది.
అంతకు ముందు ఏడాది (2017) దీపావళికి కొంచెం అటు ఇటుగా రవితేజ 'రాజా ది గ్రేట్' వచ్చింది. ఈ ఏడాది దీపావళికి సరైన తెలుగు సినిమా ఒక్కటి కూడా లేకుండా పోయింది. మొన్నటికి మొన్న దసరా పండక్కి 'సైరా', 'చాణక్య' సినిమాలు వచ్చాయి. మధ్యలో 'ఊరంతా అనుకుంటున్నారు' కూడా విడుదలైంది. నెక్స్ట్ క్రిస్మస్ బరిలో మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి, దీపావళిని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు మిస్ చేసుకుంటోందో? తమిళ సినిమాలకు ఎందుకు వదిలేసిందో? నిర్మాతల్లో సరైన ప్లానింగ్, అండర్ స్టాండింగ్ లేకపోవడమని డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.