ENGLISH | TELUGU  

కెరీర్ రివ్యూ: మెగా హీరోస్‌లో వరుణ్ తేజ్ రూటే సపరేట్!

on Sep 24, 2019

 

మెగా కాంపౌండ్‌లోని కుర్ర హీరోల్లో తన రూటే సపరేట్ అంటున్నాడు వరుణ్ తేజ్. పైగా నటుడిగా తండ్రి నాగబాబును మించిన తనయుడిగా ఇప్పటికే పేరు తెచ్చేసుకున్నాడు. చేసింది తొమ్మిది సినిమాలే అయినా, ఒకదానికొకటి సంబంధం లేని స్క్రిప్ట్స్, కేరెక్టర్స్‌తో ఆశ్చర్యపరుస్తూ, ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అందుకు లేటెస్ట్ మూవీ 'గద్దలకొండ గణేష్'.. నిఖార్సయిన నిదర్శనం. స్టార్‌గా ఎదుగుతున్న ఒక యువ హీరో.. కెరీర్ మొదట్లోనే ఒక మిడిల్ ఏజ్డ్ విలన్‌గా యాక్ట్ చేయడం.. ఏ రకంగా చూసుకున్నా సాహసమే. అంతేనా.. ఆ కేరెక్టర్‌ను ఎంతో మెచ్యూర్డ్‌గా పర్‌ఫాం చేసి ఇటు ఆడియెన్స్ చేతా, అటు క్రిటిక్స్ చేతా శెభాష్ అనిపించుకున్నాడు. ఆ కేరెక్టర్‌లోని క్రూరత్వాన్ని నిజమనిపించే రీతిలో ప్రదర్శించాడు.

ఒక్కసారి వరుణ్ కెరీర్ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆరంభం నుంచి కూడా 'ఇమేజ్' అనే గిరి గీసుకొని అందులోనే ఉండిపోయే తత్వం కొంచెం కూడా కనిపించదు. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయిన వరుణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడు.. చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు.. తండ్రి నాగబాబు తరహాలోనే అతడి కెరీర్ కూడా ఒడిదుడుకులుగా సాగుతుందని ఊహించిన వాళ్లే ఎక్కువ. "ఇతని మొహంలో ఏం ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయి" అనే మాటలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వినిపించాయి.
హీరోగా తొలి సినిమా 'ముకుంద' వచ్చినప్పుడు, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడినప్పుడు.. "మేం ముందే చెప్పలేదా.. వరుణ్ సినిమాలకు పనికి రాడు. అతని యాక్టింగ్ చాలా అమెచ్యూరిష్‌గా ఉంది" అన్నారు. కానీ వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనీ, సాధన చేస్తే నటుడిగా ఎదుగుతాడనీ అతడి శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. 

వరుణ్ ఎక్కువ సమయం తీసుకోలేదు. వెరీ నెక్స్ట్ మూవీతోనే తనేమిటో, తనలోని నటుడు ఎలా ఉంటాడో రుచి చూపించేశాడు. ఆ మూవీ 'కంచె'. క్రిష్ డైరెక్ట్ చేసిన ఆ వార్ అండ్ లవ్ డ్రామా మూవీలో మొదట్లో ఒక ప్రేమికుడిగా, తర్వాత నాజీలపై పోరాటం చేసే భారత సైనికుడిగా రెండు భిన్న డైమెన్షన్స్ ఉన్న హరిబాబు అనే కేరెక్టర్‌ను సమర్థవంతంగా, సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా చేసి.. తన విమర్శకులకు గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. తన రెండో సినిమాలోనే మొదటి సినిమాతో ఏమాత్రం పోలికలేని కేరెక్టర్ చేసి, ఆ కేరెక్టర్‌లో అతడు రాణించిన తీరు చూసి, ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ సినిమాతో తనను తేలిగ్గా తీసుకోవద్దనే సంకేతాలు పంపాడు వరుణ్.

మూడో సినిమా వచ్చింది. అది.. అతడు చేసిన తొలి రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన మాస్ కేరెక్టర్. ఆ సినిమా.. 'లోఫర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో రాజా అనే ఒక కేర్‌లెస్ యూత్‌గా, టైటిల్ రోల్‌లో చాలా ఈజ్‌తో చేశాడు. అదే సమయంలో తల్లి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకుగా.. అతడు కన్విన్సింగ్‌గా యాక్ట్ చేశాడు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చినా, ఒక యాక్టర్‌గా వరుణ్ ఫెయిల్ కాలేదనే పేరు తెచ్చుకున్నాడు.

కమర్షియల్‌గా చూసుకుంటే వరుణ్ కెరీర్‌లో ఇప్పటివరకూ వచ్చిన వాటిలో బ్యాడ్ ఫిల్మ్ 'మిస్టర్'. అది అతడి నాలుగో సినిమా. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామాలో స్పెయిన్‌లో స్థిరపడిన 'చై' అనే ఎన్నారై పాత్రలో నటించాడు వరుణ్. ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడటం అతడికి అదే తొలిసారి. సినిమాని తన భుజాలపై మోసుకొని వెళ్లినా, సబ్జెక్ట్‌లో సత్తా లేకపోవడం, బ్యాడ్ స్క్రీన్‌ప్లే కారణంగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. స్క్రిప్టుల విషయంలో జాగ్రత్త వహించాలనే లెసన్‌ను.. ఈ మూవీ అతడికి నేర్పించింది.

వరుణ్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ఫిదా'. శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ లవ్ డ్రామా.. ఆడియెన్స్‌ను అమితంగా అలరించింది. అయితే ఇందులో వరుణ్ కంటే ఎక్కువగా సాయిపల్లవి మార్కులు కొట్టేయడం వేరే విషయం. స్టోరీ ప్రధానంగా ఆమె కేరెక్టర్ చుట్టూ నడుస్తుందనే విషయం తెలిసినా, ఆమె చేసిన భానుమతి పాత్రను పిచ్చిగా ప్రేమించే ఎన్నారై వరుణ్‌గా, ఆమె తన ప్రేమను మధ్యలో ఎందుకు తిరస్కరించిందనే విషయం తెలీక.. ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యే ప్రేమికుడిగా.. సమర్థవంతంగా నటించి ఆకట్టుకున్నాడు వరుణ్. నటుడిగా అతడిని ఇంకో మెట్టు పైకెక్కించిన సినిమా 'ఫిదా'.

వెంట వెంటనే రెండు హిట్లు కొట్టాడు వరుణ్. 'ఫిదా' తర్వాత అతడు నటించిన ఆరో సినిమా 'తొలిప్రేమ' సైతం ఆడియెన్స్‌ను అలరించింది. ఈ మూవీలో ట్రైన్‌లో పరిచయమైన వర్ష అనే అమ్మాయి ప్రేమలో పడిన ఆదిత్య అనే కాలేజ్ కుర్రాడి కేరెక్టర్‌లో, మోడ్రన్ లుక్‌లో కనిపించి మెప్పించాడు వరుణ్. వర్షతో గొడవ కారణంగా విడిపోయి, తిరిగి కాలేజీలో కలుసుకొని, తన ప్రేమను మళ్లీ బతికించుకొనే పాత్రలో పర్ఫెక్టుగా ఇమిడిపోయాడు. ఈ మూవీలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు వేశారు క్రిటిక్స్.

ఆ తర్వాత మరోసారి తన ఛాయిస్‌తో ఆశ్చర్యపర్చాడు వరుణ్. ఏడో సినిమాగా 'అంతరిక్షం' అనే స్పేస్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు. 'ఘాజి' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న.. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఈ మూవీలో 'మిత్ర' అనే శాటిలైట్‌ను రూపొందించిన దేవ్ అనే ఆస్ట్రోనాట్‌గా నటించాడు వరుణ్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. ఒక డిఫరెంట్ కేరెక్టర్‌ను మెచ్యూర్డ్‌గా చేశాడనే పేరు సంపాదించుకున్నాడు.

వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ఎఫ్2'. ఇది అతడి తొలి మల్టీస్టారర్. సీనియర్ స్టార్ వెంకటేశ్‌కు తోడల్లుడిగా ఈ మూవీలో వరుణ్ సరికొత్తగా మనముందు ఆవిష్కృతమయ్యాడు. తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అలరించాడు, నవ్వులు పూయించాడు. వెంకీ భార్య హారిక చెల్లెలు హనీని ప్రేమించి, ఆ అక్కచెల్లెళ్ల కారణంగా ఫ్రస్ట్రేషన్‌కు గురై వెంకీతో పాటు యూరప్‌కు ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన వరుణ్ కేరెక్టర్‌లో హైదరాబాదీ యాసను ఈజ్‌తో పలికి మెప్పించాడు.

ఇవాళ తన తొమ్మిదో సినిమా 'గద్దలకొండ గణేష్'లో టైటిల్ రోల్‌లో వరుణ్ ఎలా చెలరేగిపోయాడో చూస్తున్నాం. ఇమేజ్‌లు, జోనర్లు లాంటివి ఏమీ పట్టించుకోకుండా, క్లాస్ - మాస్ అనే తేడా లేకుండా, పాజిటివ్ - నెగటివ్ అనే లెక్కలు వేసుకోకుండా.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ, నటుడిగా ఎలాంటి పాత్రైనా చేస్తాడనే పేరు తెచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. ఇవాళ అతడు 'అమెచ్యూర్ ఆర్టిస్ట్' కాదు. విమర్శకుల్ని సైతం తన నటనతో అబ్బురపరుస్తూ ఫుల్‌ప్లెడ్జెడ్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న టాలెంటెడ్ యాక్టర్. ఫ్యూచర్‌లో అతడి నుంచి మరిన్ని బెస్ట్ పెర్ఫార్మెన్సెస్‌ను మనం చూడబోతున్నామనేది వంద శాతం వాస్తవం.  


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.