'గ్యాంగ్ లీడర్' డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యేనా?
on Sep 16, 2019
నేచురల్ స్టార్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే నాని లేటెస్ట్ ఫిల్మ్ 'నానీస్ గ్యాంగ్ లీడర్' బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ మంచి రిజల్ట్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే, మూడు రోజుల్లోనే 50 పర్సెంట్ పైగా రికవర్ సాధించింది. దీంతో ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విక్రం కుమార్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ మూవీలో కార్తికేయ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయల మేర ప్రి బిజినెస్ జరగడం హీరోగా నాని సంపాదించుకున్న మార్కెట్ రేంజికి అద్దం పడుతుంది. అందుకు తగ్గట్లే ఫస్ట్ వీకెండ్లో 'నానీస్ గ్యాంగ్ లీడర్' 16 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. అంటే 57 శాతం అమౌంట్ రికవర్ అయ్యిందన్న మాట. క్రిటిక్స్ ప్రశంసలు పొంది, ఆడియెన్స్ ఆదరణ పొందిన నాని మునుపటి మూవీ 'జెర్సీ' కంటే ఈ సినిమా మెరుగైన కలెక్షన్లు సాధించడం గమనార్హం. 'జెర్సీ' ఫస్ట్ వీకెండ్ 15.75 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 'జెర్సీ' కలెక్ట్ చేసిన లైఫ్‌టైం షేర్ వాల్యూ 28.40 కోట్ల రూపాయలని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. అంటే దాదాపు ఆ మేరకు 'నానీస్ గ్యాంగ్ లీడర్' ప్రి బిజినెస్ జరిగిందన్న మాట.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'గ్యాంగ్ లీడర్' ప్రి బిజినెస్ వాల్యూ సుమారు 21 కోట్ల రూపాయలు కాగా, తొలి వారాంతంలో అది 11.80 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని అంచనా. అంటే 56 పర్సెంట్ రికవర్ అయింది. ఒక్క నెల్లూరు మినహా మిగతా ప్రాంతాల్లో కలెక్షన్లు బాగున్నాయి. నెల్లూరులోనే 50 పర్సెంట్ కంటే తక్కువ షేర్ వచ్చింది.
పేరుకు రివెంజ్ డ్రామా అయినప్పటికీ డైరెక్టర్ సీరియస్ టోన్‌లో కాకుండా ఎంటర్టైనింగ్గా నడపడంతో సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. మూవీ సెటప్ కానీ, కాన్సెప్ట్ కానీ రొటీన్ తరహాలో కాకుండా కొత్తగా ఉండటం సినిమాకి ప్లస్‌గా మారినట్లు కనిపిస్తోంది. అలాగే 'పెన్సిల్' పార్థసారథిగా నాని చేసిన పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అతని కేరెక్టర్‌ను ఎంటర్టైనింగ్గా మలచడంలో డైరెక్టర్ విక్రం కుమార్ టాలెంట్ కనిపిస్తుంది. సందర్భానుసారం ఒక వైపు హ్యూమర్‌నూ, మరోవైపు సీరియస్నెస్నూ పండించడంలో నాని బాగా సక్సెసయ్యాడు.
ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోదగ్గ అంశం.. హీరోయిన్ ఎంపిక. ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన తారను కాకుండా ప్రియాంకా అరుళ్మోహన్ అనే తారను హీరోయిన్గా పరిచయం చెయ్యడం సినిమాకు కలిసి వచ్చింది. నానితో ఆమె చేసిన సీన్లు, వాళ్లిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులకు నచ్చుతున్నాయని తెలుస్తోంది. వినోదాన్ని పంచుతూ, చివరిలో ఏడ్పించే సీనియర్ నటి లక్ష్మి పాత్ర, ఇక ఆద్యంతమూ తన అమాయక మాటలతో నవ్వించే శరణ్య పాత్ర మూవీకి అదనపు బలంగా మారాయి.
ఇక ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సింది, 'ఆర్ఎక్స్ 100' ఫేం కార్తికేయ.. విలన్‌గా చేసిన పర్ఫార్మెన్స్ గురించే. దేవ్ అనే కేరెక్టర్లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనీ, అతని అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అయ్యిందనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెన్నెల కిశోర్ తన 'గే కామెడీ'తో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. ఇన్ని సానుకూల అంశాల ఫలితం.. తొలి మూడు రోజుల్లో 'నానీస్ గ్యాంగ్ లీడర్' చెప్పుకోదగ్గ కలెక్షన్లను సాధించాడు.
అయితే సోమవారం నుంచే ఈ మూవీకి అసలు పరీక్ష ఎదురు కానున్నది. వీకెండ్ కలెక్షన్ల ధోరణి వీక్ డేస్‌లోనూ కొనసాగితే రెండు వారాల్లో ఈ మూవీ సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో చాలావాటిని సెప్టెంబర్ 20 నుంచి వరుణ్ తేజ్ సినిమా 'వాల్మీకి' ఆక్రమించుకోబోతోంది. అప్పట్నుంచి 'నానీస్ గ్యాంగ్ లీడర్' వసూళ్లు ఏ మేరలో ఉంటాయనేదే ప్రశ్న.