ఓ బేబీ మూవీ రివ్యూ
on Jul 5, 2019
చిత్రం : ఓ బేబీ
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్
నటీనటులు: సమంత, రాజేంద్రప్రసాద్, లక్ష్మి, రావు రమేష్, నాగశౌర్య, తేజ సజ్జ, సునయన తదితరులు. అతిథి పాత్రల్లో జగపతిబాబు, అడివి శేష్!
మాటలు: లక్ష్మీ భూపాల
పాటలు: భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీతా తాటి, టిజి విశ్వప్రసాద్, థామస్ కిమ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బీవీ నందినిరెడ్డి
విడుదల తేదీ: 05 జూలై 2019
డబ్భై ఏళ్ల బామ్మ, పాతికేళ్ల అమ్మాయిలా మారితే ఎలా ఉంటుంది? ఈ ఊహే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇటువంటి ఊహతో వచ్చిన కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' అక్కడ పెద్ద విజయం సాధించింది. తరవాత చైనా, జపాన్, థాయ్లాండ్, ఫిలిపైన్స్, ఇండోనేషియా, అమెరికా దేశాల్లో రీమేక్ అయింది. ఈ రోజు 'ఓ బేబీ'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ:
బేబీ (లక్ష్మి) ఓ డబ్భై ఏళ్ల బామ్మ. చిన్న వయసులో ఆమెకు పెళ్లవుతుంది. ఇరవైయేళ్లకు ఓ పిల్లాడు పుడతాడు. అంతలో భర్త మరణిస్తాడు. అప్పట్నుంచి కుమారుడు శేఖర్ (రావు రమేష్)ని పెంచి పెద్ద చేసి, పెళ్లి చేసి... కుమారుణ్ణి, అతడి పిల్లల్ని చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. తనకు దేవుడు అన్యాయం చేశాడని చిన్ననాటి స్నేహితుడు, క్యాంటీన్ పార్ట్నర్ చంటి (రాజేంద్ర ప్రసాద్) దగ్గర ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఒకరోజు దేవుడు బేబీకి మళ్లీ యవ్వనాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. డబ్భై ఏళ్ల బేబీ (లక్ష్మి), పాతికేళ్ల బేబీ (సమంత)లా మారుతుంది. స్వాతిగా తన పేరు మార్చుకుంటుంది. యవ్వనం తిరిగొచ్చాక స్వాతిలా మారిన బేబీ ఏం చేసింది? ఆమె అమ్మాయిలా మారిన సంగతి ఇంట్లోవాళ్లకు, స్నేహితుడు చంటికి తెలిసిందా? లేదా? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ:
కథేంటో, కథలో అసలు ట్విస్ట్ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. దర్శకురాలు నందినిరెడ్డి కూడా కథాపరంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్లు ఇవ్వడానికి ప్రయత్నించలేదు. కామెడీ అందించడానికి కృషి చేశారు. అందులో చాలావరకూ విజయం సాధించారు. డబ్భై ఏళ్ల బామ్మ పాతికేళ్ల అమ్మాయిలా మారితే? సినిమా కాన్సెప్ట్ ఇదే. 'బ్రెయిన్ బామ్మది... బాడీ అమ్మాయిది' ఈ పాయింట్ చుటూ అల్లిన సన్నివేశాలు బావున్నాయి. వినోదం పండించాయి. ఫస్టాఫ్ అంతా ఈ పాయింట్ మీద బండి లాగించారు. ఫస్టాఫ్లో సమంత ఎంట్రీ వరకూ కింద పడుతూ, పైకి లేస్తూ సాగిన సినిమా... సమంత రాకతో విశ్రాంతి వరకూ సాఫీగా సాగింది. మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లయింట్ ఇవ్వడం వంటి కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోలేదు. అయినా ఫస్టాఫ్ పాస్ అయింది. సెకండాఫ్లో ఈ పాయింట్ చుటూ అల్లిన భావోద్వేగభరిత సన్నివేశాలు మాత్రం ఆశించిన రీతిలో పండలేదు. సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ బ్యాక్ సీటులోకి వెళ్లి, ఎమోషన్స్ ఫ్రంట్ సీటులోకి రావడంతో బండి సాఫీగా ముందుకు కదల్లేదు. భారంగా నడించింది. దీనికి తోడు పాటలేవీ అలరించేలా లేవు. సంగీత పోటీల్లో పాటలంటే ఎలా ఉండాలి? ఆ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగా ఉంది. ఇలా కిందకు పడిన సినిమాను మళ్లీ పతాక సన్నివేశాల్లో సమంత, రావు రమేష్ తమ తమ నటనతో పైకి తీసుకొచ్చారు. అక్కడ ఎమోషన్స్ కొంచెం కదిలిస్తాయి. సినిమాటోగ్రఫీ బావుంది. డైలాగులు బావున్నాయి కానీ... సామెతలు మాత్రం శృతిమించాయి. స్వీట్ అయినా ఎక్కువ తినలేం. అలాగే, సినిమాలో కొన్ని సామెతలను గుర్తించలేం. కొరియన్ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు అడాప్ట్ చేసిన నందినిరెడ్డిని అభినందించాలి.
ప్లస్ పాయింట్స్:
కాన్సెప్ట్ & కామెడీ
సమంత నటన
సునైన వినోదం
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
శృతిమించిన సామెతలు
పాటలు, నేపథ్య సంగీతం
అక్కడక్కడా లెంగ్త్ ఎక్కువైంది
నటీనటుల పనితీరు:
నటిగా సమంతకు సవాల్ విసిరిన పాత్ర బేబీ. అవ్వడానికి బేబీ పాతికేళ్ల అమ్మాయే కానీ... నడక, మాటతీరు అన్నీ డబ్భై ఏళ్ల బామ్మలా ఉండాలి. నిజంగా బామ్మలు పాతికేళ్ల అమ్మాయిల్లా మారితే ఇలా ఉంటారేమో అన్నట్టు సమంత పాత్రలో జీవించారు. ఆమె కామెడీ టైమింగ్ సూపర్. ఎమోషనల్ సీన్స్ ఆమెకు కొత్తేమీ కాదు. వాటిలో కొత్తగా నటించినదీ లేదు. కానీ, కథానుగుణంగా వచ్చిన ఎమోషనల్ సీన్స్ మనసును హత్తుకుంటాయి. డబ్భై ఏళ్ల బామ్మగా లక్ష్మి అద్భుతంగా నటించడం వలనే సమంత నటన ఎలివేట్ అయింది. సమంత ఫుల్లుగా కామెడీ చేసిన ఈ సినిమాలో తన నటన, డైలాగ్ డెలివరీతో సునయన (అమ్మోరులో అమ్మోరు పాత్రలో నటించింది ఈవిడే) ప్రేక్షకులను నవ్వించారు. తన ఉనికి నిలుపుకున్నారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్ పాత్రలకు తగ్గట్టు హుందాగా నటించారు. నాగశౌర్య నటించడం వలన ఆ పాత్రకు వేల్యూ వచ్చింది. మనవడి పాత్రలో తేజ సజ్జ నటన అంతగా ఆకట్టుకోదు. ఊర్వశి, లక్ష్మి కొన్ని సన్నివేశాల్లో కనిపించారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
ప్రేక్షకుల్ని బేబీ నవ్విస్తుంది. బేబీగా సమంత నటన కట్టిపడేస్తుంది. కానీ, మధ్యలో కాసేపు సుదీర్ఘంగా సాగిన కథతో బోర్ కొట్టించినా... భావోద్వేగానికి గురిచేస్తుంది. తొలుత నవ్వించి, చివర్లో చెమర్చిన కళ్లతో థియేటర్ నుంచి బయటకొచ్చేలా చేస్తుంది.
రేటింగ్: 3/5