రానా.. నీ పెళ్లి ఎప్పుడు?
on Feb 15, 2019
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు... తమిళ హీరో ఆర్య పెళ్లి రానాకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోల లిస్టు తీస్తే ఆర్య, రానా, ప్రభాస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. మార్చి తరవాత ఈ లిస్టులో ఆర్య పేరు తొలగించాలి. హీరోయిన్ సాయేషాతో అతడు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెద్దల అనుమతితో మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రేమికుల రోజున అఫీషియల్‌గా ఆర్య ప్రకటించాడు. `హ్యాపీ లాస్ట్ సింగిల్ వాలంటైన్ డే' అని ఆర్యకు రానా కంగ్రాట్స్ చెప్పాడు. `నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా` అని ఆర్య రిప్లై ఇచ్చాడు. ఒక్క ఆర్య మాత్రమే కాదు... ట్విట్టర్లో చాలామంది రానాను సేమ్ క్వశ్చన్ అడిగారు. `నీ పెళ్లి ఎప్పుడు` అని. పాపం... రానా ఈ ప్రశ్న ఊహించి ఉండదు. `రానా ఒకప్పుడు సింగిల్. ఇప్పుడు సింగిల్. ఎప్పటికీ సింగిల్ గా ఉంటాడు` అని కొంతమంది జోకులు కూడా వేశారు. ప్రస్తుతం పగటిపూట `హాథీ మేరే సాథీ` షూటింగ్ చేస్తున్న రానా, రాత్రిపూట `ఎన్టీఆర్ మహానాయకుడు` చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాడు. అందులో చంద్రబాబు పాత్రను రానా పోషించిన సంగతి తెలిసిందే.