ENGLISH | TELUGU  

కవచం మూవీ రివ్యూ

on Dec 7, 2018

 

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్, నీల్ నితిన్ ముఖేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, 'సత్యం' రాజేష్, పోసాని కృష్ణమురళి, అజయ్, హర్షవర్ధన్ రాణే తదితరులు   
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
కెమెరా: చోటా కె. నాయుడు
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: ఎస్.ఎస్. తమన్  
నిర్మాత‌: నవీన్ చౌదరి శొంఠినేని (నాని)
కథ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ మామిళ్ళ
విడుదల తేదీ: డిసెంబర్ 07, 2018

ప్రచార చిత్రాలతో 'కవచం' ప్రేక్షకులను ఆకర్షించింది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. యాక్షన్ సినిమాలతో ఇంతకు ముందు ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి ఏదో కొత్త ప్రయత్నం చేశాడనే నమ్మకాన్ని కలిగించాయి. సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా? లేదా? ఇప్పటి వరకూ పేరున్న దర్శకులతో సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్... ఈసారి కొత్త దర్శకుడితో ఎటువంటి సినిమా చేశాడు? రివ్యూ చదవండి.

క‌థ‌:
విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) విశాఖపట్టణం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. షాపింగ్ మాల్‌లో పరిచయమైన సంయుక్త (కాజల్ అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కాఫీ షాపులో పని చేస్తుందని తెలుసుకుని రోజూ ఆ కాఫీ షాపుకు వెళతాడు. ఓ రోజు తన ప్రేమను సంయుక్తకు చెప్పడానికి విజయ్ కాఫీ షాపుకు వెళితే... అక్కడ సంయుక్త కనిపించదు. ఆమెకు పెళ్లి కుదిరిందని, ఉద్యోగం మానేసిందని తెలుసుకుని బాధతో వెనుతిరుగుతాడు. తరవాత రోడ్డు మీద లావణ్య (మెహరీన్) అనే అమ్మాయిపై కొందరు ఆకతాయి రౌడీలు అఘాయిత్యం చేయబోతే విజయ్ కాపాడతాడు. విజ‌య్‌కు త‌న‌ను తాను సంయుక్త‌గా ప‌రిచయం చేసుకుంటుంది లావ‌ణ్య‌. ఆమెను ప్రేమికుడు మోసం చేస్తే విజయ్ ధైర్యం చెబుతాడు. ఈలోపు విజయ్ అమ్మకు యాక్సిడెంట్ జరిగితే డబ్బు లేక టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు లావణ్య ఓ ఐడియా చెబుతుంది. తన మావయ్యకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసినట్టు చెప్పి, రూ. 50 లక్షలు డిమాండ్ చేయమంటుంది. విజయ్ అలాగే చేస్తాడు. లావణ్యను ఓ బ‌స్‌స్టాప్‌లో వదిలేస్తాడు. తరవాత సంయుక్త కనిపించడం లేదని, విజయ్ అనే పోలీస్ ఆమెను కిడ్నాప్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తాయి. తను ప్రేమించిన సంయుక్తను విజయ్ కిడ్నాప్ చేయడం ఏమిటి? సంయుక్త స్థానంలోకి లావణ్య ఎందుకొచ్చింది? అసలు, నిజమైన సంయుక్త ఎవరు? ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారు? చివరకు, కిడ్నాప్ కేసు నుంచి విజయ్ ఎలా తప్పించుకున్నాడు? అనేది కథ!

విశ్లేషణ:
వెంకటేష్ 'మల్లీశ్వరి' సినిమా చూశారా? ఓసారి ఆ సినిమా కథను గుర్తు చేసుకోండి. అనగనగా ఓ రాణి.. కట్రీనా కైఫ్. కానీ, ఆ రాజ్యానికి రాజు లేదు. వంశపారంపర్యంగా వచ్చిన సంపదకు ఆమె వారసురాలు. దానిపై కన్నేసిన కొందరు బంధువులు రాబంధువుల్లా మారి ఆమెను చంపాలనుకుంటారు. అప్పుడు ఆ రాణికి ఓ సామాన్యుడు (వెంకటేష్) ఎలా కవచంలా నిలబడ్డాడు? అనేది సినిమా. త్రివిక్రమ్ ఆ కథను వినోదాత్మకంగా చెబితే... కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఇంచుమించు అటువంటి కథను చిన్న చిన్న ఉప కథలతో, మలుపులతో అనుక్షణం ఉత్కంఠ భరితంగా చెప్పాలని ప్రయత్నించాడు. హీరోను పోలీస్‌ని చేశాడు.

ఆస్తి కోసం సంయుక్త (కాజల్, మెహరీన్... ఇద్దరిలో సంయుక్త ఎవరనేది సినిమా చూసి తెలుసుకోండి)ను సొంత మనుషులు చంపాలనుకుంటే పోలీస్ అయిన ప్రేమికుడు ఎలా కాపాడాడు? అనేది 'కవచం' కథ. కథలో మలుపులు బావున్నాయి. అయితే... పలువురు ప్రేక్షకులు ఊహించే విధంగా వున్నాయి. అందువల్ల, థియేటర్లలో ప్రేక్షకులకు ఆసక్తి కొంచెం సన్నగిల్లుతుంది. దీనికి తోడు దర్శకుడికి ఇదే తొలి సినిమా కావడం వలనో... మరొకటో.. ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. దాంతో ఓ రొటీన్ సినిమాగా 'కవచం' మిగిలింది.

ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన బాణీల్లో ఒక్కటీ గుర్తు పెట్టుకునే విధంగా లేదు. వున్నంతలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌పై చిత్రీకరించిన 'ప్రేమను పంచె..' ఒక్కటే పర్వాలేదు. నేపథ్య సంగీతంలో పలు పాత సినిమాల ఛాయలు కనిపించాయి. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి ఫ్రేములో తెలుస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ భారీగా చిత్రీకరించారు. హీరోయిన్లతో డ్యూయెట్లనూ విదేశాల్లో అందమైన లొకేషన్లలో తీశారు.

ప్లస్ పాయింట్స్:
కథలో మలుపులు
కాజల్ అగర్వాల్
నిర్మాణ విలువలు
చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
దర్శకుడి అనుభవలేమి
తమన్ సంగీతం
కథ, మాటలు, దర్శకత్వం  


నటీనటుల పనితీరు:
పోలీస్ పాత్ర‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆహార్యం బావుంది. ఎప్పటిలా యాక్షన్ సన్నివేశాలను తనదైన శైలిలో చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అంతగా జీవించలేని తన బలహీనతను మరోసారి బయట పెట్టుకున్నాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో మరింత మెరుగవ్వాలి. గత సినిమాల కంటే కాజల్ కొంచెం అందంగా కనిపించింది. హీరోతో ఆమె సన్నివేశాలు తక్కువే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. మెహరీన్ అతిథి పాత్రకు ఎక్కువ.. కథానాయికకు మరీ తక్కువ అన్నట్టుండే పాత్రలో నటించింది. కథలో ఆమెది కీలక పాత్ర మాత్రమే. హీరోతో ఒక పాటలో సందడి చేసింది. పోసాని కృష్ణమురళి పంచ్ డైలాగులు సరిగా వర్కవుట్ కాలేదు. ముఖేష్ రుషి, నీల్ నితిన్ ముఖేష్, అజయ్, హరీష్ ఉత్తమన్, హర్షవర్ధన్ రాణే, 'సత్యం' రాజేష్ తదితరులవి రొటీన్ పాత్రలే. ప్రభాస్ శీను పాత్రలు పర్వాలేదు. హీరో అమ్మగా నటించిన ఆమె బాగా చేశారు.

చివరగా:
'కవచం' కథ కొత్తగా లేకున్నా.. కథను కొత్తగా చెప్పాలని ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాలు, కథలో మలుపులు కొన్ని బావున్నాయి. ట్విస్టుల్లో వున్నంత ఆసక్తి సన్నివేశాల్లో లేకపోవడం సినిమాలో లోటు. అదే ఈ సినిమాను రొటీన్ కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చింది. మరో రొటీన్ పోలీస్ డ్రామాగా సినిమా మిగిలింది.

రేటింగ్: 1.75/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.