ENGLISH | TELUGU  

డార్లింగ్ ప్రభాస్ బ్యూటిఫుల్ జర్నీ

on Oct 23, 2018

వారసత్వం అనేది వెండితెర పరిచయం వరకే పనిచేస్తుంది.. ఒక్కసారి పరిచయం అయ్యాక తన ప్రతిభతోనే ప్రేక్షకులకు దగ్గరవ్వాలి, అభిమానులను సంపాదించుకోవాలి. రెబెల్ స్టార్ కృష్ణంరాజు సోదరుని కుమారుడిగా ప్రభాస్ వెండితెరకు పరిచయం అయ్యారు. తన ప్రతిభతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ 2002 లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు కానీ ప్రభాస్ మాత్రం మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఆరడుగుల ఎత్తు, అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తరువాత వచ్చిన 'రాఘవేంద్ర' సినిమా కూడా ప్రభాస్ కి విజయం రుచి చూపించలేదు. 2004 లో వచ్చిన ప్రభాస్ మూడో చిత్రం 'వర్షం' మాత్రం ఘన విజయం సాధించి ప్రభాస్ హిట్ జర్నీకి నాంది పలికింది. ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాతో అందరి డార్లింగ్ అయ్యారు. ఇక బాహుబలి సిరీస్ తో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకొని సాహోరే ప్రభాస్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచస్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ బ్యూటిఫుల్ జర్నీలోని కొన్ని హిట్ సినిమాలు

 

 

వర్షం: నీళ్లులేక కన్నీళ్లు పెట్టుకున్న రైతు కళ్ళలో వర్షం వస్తే ఎంత ఆనందం కనిపిస్తుందో.. హీరోకి తొలి హిట్ దక్కితే అంత ఆనందం వస్తుంది. ప్రభాస్ కు ఆ ఆనందం 'వర్షం' సినిమా రూపంలో దక్కింది. 2004 లో శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' ప్రభాస్ కి ఘన విజయాన్ని అందించింది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా, గోపీచంద్ విలన్ గా నటించారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ప్రభాస్ కి విజయం రుచి చూపించింది.

 

 

ఛత్రపతి: ప్రభాస్ ని తెలుగు పరిశ్రమలో ఛత్రపతికి ముందు ఛత్రపతికి తరువాత అనొచ్చేమో. 2005 లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వర్షంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన ప్రభాస్.. ఛత్రపతితో మాస్ కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

 

 

 

బిల్లా: ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అందులో ఖచ్చితంగా 'బిల్లా' కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాతోనే టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ హీరో ఉన్నాడని తెలిసింది. 2009 లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'బిల్లా' యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ తన డ్రెస్సింగ్, వాకింగ్, ఆటిట్యూడ్, డైలాగు డెలివరీ ఇలా ప్రతిదానిలో తన మార్క్ స్టైల్ చూపించి.. టాలీవుడ్ హీరో స్టైల్ అంటే ఇది అని చాటిచెప్పారు.

 

డార్లింగ్: ప్రభాస్ అందరిని ఆప్యాయంగా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ఆప్యాయత, మంచితనంతోనే ప్రేక్షకులకు ప్రభాస్ డార్లింగ్ అయ్యారు. అలాంటి డార్లింగ్ ప్రభాస్ 'డార్లింగ్' అనే టైటిల్ తో సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. ప్రేమకథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కరుణాకరన్ దర్శకత్వంలో '2010' లో డార్లింగ్ సినిమా వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్ ను అందించింది. అప్పటికే తన కటౌట్, లుక్ తో లేడీ ఫాన్స్ ని సంపాదించుకున్న ప్రభాస్ కి.. ఈ సినిమాతో లేడీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. చాలామంది అమ్మాయిలకు కలలరాకుమారుడు అయ్యారు.

 

 

మిస్టర్ పర్ ఫెక్ట్: ప్రభాస్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ టాలీవుడ్లో 'మిస్టర్ పర్ ఫెక్ట్' అనిపించుకున్నారు. 2011 లో అదే పేరుతో సినిమా చేసి హిట్ కొట్టారు. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కి మంచి విజయాన్ని అందించింది. లవ్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కలగలసి ఫుల్ విందుభోజనం లాంటి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

 

మిర్చి: ప్రభాస్ కి ఛత్రపతి తరువాత ఆ రేంజ్ మాస్ హిట్ 'మిర్చి' సినిమా అనే చెప్పాలి. 2013 లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యారు. 'వీలయితే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు' అంటూ డార్లింగ్ ప్రభాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కలెక్షన్ల వర్షం కురిపించారు.

 

 

బాహుబలి: ఒకప్పుడు ప్రభాస్ అంటే డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ గుర్తొచ్చేవేమో.. కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే ముందుగా గుర్తొచ్చేది బాహుబలి. తెలుగు సినిమా చరిత్రనే మార్చేసిన సినిమా బాహుబలి. ప్రస్తుతం తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అంటే అతిశయోక్తి కాదేమో. అపజయం ఎరుగని ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చింది. బాహుబలిలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రెండు భాగాల కోసం దాదాపు ఐదు సంవత్సరాలు కేటాయించారు. సినిమా మీద ప్రేమ, నమ్మకంతో కష్టపడ్డారు. బాహుబలి పాత్రలో వేరే ఎవర్నీ ఊహించుకోలేం అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం, ఆ సినిమా కోసం ఆయన పడిన కష్టమే.. ఆయనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేసింది.

ఈశ్వర్ తో వెండితెరకు పరిచయమైన ప్రభాస్ వర్షంతో విజయాన్ని అందుకున్నారు. తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ బాహుబలితో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమా మీద ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెడతారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మరిన్ని విజయాలు అందుకొని.. ఈ బ్యూటిఫుల్ జర్నీ మరింత బ్యూటిఫుల్ గా సాగాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.