అందుకు కదూ.. వాళ్లు నంబర్ వన్ అయ్యిందీ...!
on Jan 20, 2018
నడమంత్రంగా హీరోలైన వారి సంగతి పక్కన పెడితే.. కష్టపడి పైకొచ్చే ఏ హీరో అయినా.. వృత్తిని దైవంగానే భావిస్తాడు. అందుకు ఎగ్జాంపుల్ గా ఓ ముగ్గురు హీరోల గురించి చెప్పుకుందాం.
ముందు చిరంజీవి...
సినిమా షూటింగ్ మొదలైన తొలి రోజు కెమెరాకు హారతి ఇవ్వడం పరిపాటి. తర్వాత ఆ హారతి సెట్ లో అందరూ అందుకుంటారు. చిరంజీవి కూడా అలాగే అందుకుంటారు. కానీ.. ఆయన మేకప్ లో ఉన్నారనుకోండీ... హారతిని దగ్గరకు కూడా రానీయరు. హారతి తీసుకొని ఆయన దగ్గరకు రావడానికి కూడా టెక్నీషియన్స్ భయపడతారు. కారణం.. హారతి తీసుకోవడం ఇష్టం లేక కాదు. హారతి హత్తుకుంటే.. ఆ వేడికి ఖరీదైన ఆయన మేకప్ కరిగిపోతుందని ఆయన భయం. మిగిలిన హీరోలు మేకప్ లో కూడా హారతి తీసేసుకొని.. మేకప్ కోసం మరో అరగంట సమయం వృధా చేస్తారు. కానీ.. మెగాస్టార్.. ఆ అరగంట కూడా వేస్ట్ కానీయరు. ఆయనకు పనిని మించిన దైవం లేదు. మేకప్పే ఆయనకు తొలి దైవం. ఆ తర్వాతే ఏదైనా.. అందుకే... ఆయన మెగాస్టార్.
తర్వాత మోహన్ లాల్
షూటింగుల్లో.. దర్శకుడు కుర్చీ దర్శకుడికీ.. హీరో కుర్చీ హీరోకీ.. నిర్మాత కుర్చీ నిర్మాతకీ.. ఇలా ఎవరికి కుర్చీ వారికి కేటాయించి ఉంటుంది. 24 శాఖల సాంకేతిక నిపుణులందరూ సెట్ ప్రాపర్టీనీ... కెమెరాలనూ క్రేన్ సామాగ్రినీ.. మోస్తూ నానా యాతన పడుతుంటే... వీళ్లు మాత్రం దర్జాగా కుర్చీల్లో కూర్చొని షాట్ గ్యాప్ లో కబుర్లు చెప్పుకుంటుంటారు. ప్రతి లొకేషన్లో జరిగేది అదే. కానీ.. మోహన్ లాల్ సినిమా షూటింగ్ లో అలా జరగదు. ఆయన అలా తీరిగ్గా కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పరు. టెక్నీషియన్లతో పాటు తాను కూడా షూటింగ్ సామాగ్రిని మోస్తూ.. వాళ్లకు సాయం చేస్తుంటారు. ఒక సూపర్ స్టార్ అలా ఒళ్లు వంచి పని చేస్తుంటే... మిగిలిన వాళ్లు తీరిగ్గా కూర్చోలేరు కదా. అందుకే.... మిగిలిన వారు కూడా లొకేషన్లో ఏదో ఒకటి చేస్తూ కనిపిస్తారు. అందుకే.. ఆయన సూపర్ స్టార్.
మన యంగ్ హీరో ప్రభాస్ కూడా లొకేషన్లో ఒళ్లు వంచుతాడంటండోయ్. ఈ మధ్య ఈ విషయం తెలిసింది. వీళ్లని మిగిలిన హీరోలు కూడా ఫాలో అయితే.. పని స్పీడ్ గా అయిపోతుంది. ఏమంటారు ఫ్రెండ్స్.