అభిమానుల కోరిక తీరుస్తాడా?
on Dec 12, 2017
అందగాడు కాదు.. కమల్ హాసన్ లా మహానటుడూ కాదు. కానీ... కమల్ హాసన్ నే వెనక్కు నెట్టేసి సూపర్ స్టార్ అయ్యాడు. ఎలా? ఏం మాయ చేశాడు? ఏంటి రజనీకాంత్ లోని గొప్పతనం? ఎందుకు ఆయనంటే తమిళ జనాలకు అంత పిచ్చి? ప్రపంచవ్యాప్తంగా అంతమంది అభిమానుల్ని ఎలా సంపాదించాడు? దీనికి సమాధానం ఒక్కటే ‘ముత్తు’ సినిమాలో ఆయనే అన్నట్టు... ‘అంతా మాయ... యచ్చచ్చ యచ్చచ్చ.. గచ్చచ్చ గచ్చచ్చ’ . ఆయన నడిస్తే.. విజల్స్... డైలాగ్ చెబితే విజిల్స్.. పసిపిల్లాడు తప్పటడుగులు వేస్తున్నట్టు వచ్చిరాని స్టెప్పులేస్తే విజిల్స్... చేయి పైకి లేపితే విజిల్స్... కాలు గాల్లో తిప్పితే విజిల్స్.. స్టైల్ గా జనాలకు శాల్యూట్ చేస్తే విజిల్... ఆ మాటకొల్లే ఆయన ఏం చేసినా విజిల్సే. దటీజ్ రజనీకాంత్. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన ఫొటో పెట్టుకొని డాన్సులేసే స్థాయి ఆయనది. దీన్ని బట్టి రజనీ స్టార్ డమ్ అంచనా వేయొచ్చు. దేశంలో అమితాబ్ తర్వాత ‘సూపర్ స్టార్’ అనే బిరుదుకు వన్నె తెచ్చింది రజనీకాంత్ మాత్రమే. ప్రస్తుతం ఆయన సినిమా వస్తుందంటే.. ఒక్క తమిళనాట మాత్రమే కాదు... దేశం మొత్తం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
దక్షిణాది హీరోల పారితోషికాలు కూడా బాలీవుడ్ స్థాయికి పెంచిన ఘనుడు ఆయనే. త్వరలో ‘రోబో 2.0‘తో మన ముందుకు రాబోతున్నాడు ‘తలైవా’. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం బడ్జెట్ మూడొందల కోట్లు పై మాటే. ‘బాహుబలి’ రికార్డుల బద్దలు చేసే సత్తా ‘రోబో 2.0‘ కి మాత్రమే ఉందనేది ట్రేడ్ వర్గాల వాదన. మరి సూపర్ స్టార్ అన్నంత పనీ చేస్తాడా? ఈ 67 ఏళ్ల ముసలాయన ‘బాహుబలి’ రికార్డుల్నే బద్దలు చేస్తాడా? నిజం చెప్పాలి కానీ... సూపర్ స్టార్ ఇమేజ్ కి అదేం పెద్ద విషయమా? రజనీ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయ్. పుట్టిన రోజున ఆయన శుభవార్త చెబుతారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నేడు తలైవా పుట్టిన రోజు. 67 ఏళ్లు నిండి 68లోకి ఆయన అడుగుపెడుతున్నాడు. మరి ఈ సారైనా అభిమానుల ఆకాంక్షను ఆయన నెరవేరుస్తాడా? రాజకీయ పార్టీకి పచ్చజెండా ఊపుతాడా? అనేది ఇంకాసేపట్లో తెలనుంది. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా మరెన్నో రజనీ జరుపుకోవాలనీ.. దక్షిణాది సత్తాను ఉత్తరాదికి రుచిచూపిస్తూ ఉండాలని కోరుకుంటోంది ‘తెలుగువన్’
Also Read