వర్మ దెబ్బకి డ్రగ్స్ షోకి బ్రేక్‌పడింది...!
on Jul 24, 2017
మీడియా ఈ మధ్య ప్రధానంగా ఫోకస్ చేస్తున్న ఒకే ఒక విషయం టాలీవుడ్ డ్రగ్ మాఫియా. కొందరు, మీడియా ఈ విషయాన్నీ భుజానెత్తుకోవడానికి ఇంకేదో పెద్ద విషయాన్ని కనుమరుగు చేయడానికి అని ఆరోపణలు చేస్తుంటే, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో కొన్ని మీడియా సంస్థలు డ్రగ్స్ విషయంలో కొంచెం అతి చేస్తున్నాయని మరి కొందరు అనుకుంటున్నారు. దాదాపు, లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్టు పూసగుచ్చినట్టు సిట్ విచారణలో ఏం జరుగుతుంది అని నిమిష, నిమిషానికి అప్డేట్ ఇస్తున్నారు.
కొన్ని విషయాల్ని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, డ్రగ్స్ రాకెట్ పై కూడా తన అభిప్రాయం తెలిపారు. సిట్ కేవలం సినెమా ఇండస్ట్రీ వాళ్లనే టార్గెట్ చేస్తుందని, డ్రగ్స్ స్కాములో ఇంకా చాలా మంది ఉన్నారని, స్టూడెంట్స్, ఇంకా వేరే వాళ్ళని కూడా ఇలాగే విచారిస్తారా అని సోషల్ మీడియా లో తన మనసులో మాట వెలిబుచ్చారు. ఎక్సయిజ్ కమిషనర్ చంద్రవదన్ వర్మ కామెంట్స్ కి రెస్పాండ్ అయి, ఈ స్కాములో ఎంతవారు ఉన్నా వదిలే సమస్యే లేదని, ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఒకేలా వర్తిస్తుంది అని అన్నారు.
తర్వాత ఒక ప్రముఖ మీడియా సంస్థ వర్మతో ఒక గంట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇంకెవరో అయితే, ఒకటికి పది సార్లు అలోచించి సమాధానం ఇచ్చేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నది వర్మ. మరి అయన సంధించే ప్రశ్నలు ఎలా ఉంటాయి. అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి. ఎవరో ఏదో అనుకుంటారనో, లేదా తప్పు మాట్లాడితే తన తలకి చుట్టుకుంటుందనో భయపడే వ్యక్తి కాదు వర్మ. తాను ఈ మధ్య హిట్లు ఇవ్వక పోవచ్చు. కానీ, తన స్వభావం మాత్రం అసలు మార్చుకోలేదు.
అసలు మీకు సమాచారం ఎక్కడి నుండి వస్తుందని, ఇలా సమాచారం తెలుసుకోవడం కరెక్టేనా కాదా అని వర్మ అడగగానే, తమకి అన్ని సంస్థల్లో వేగులు ఉంటారని, అలాగే సిట్ లో కూడా ఉన్నారని సమాధానం వచ్చింది. మరి, ఆ వేగుల విషయం సిట్ టీం కి తెలుసా... లేదంటే మీరే ద్రోహుల్లాగా ఇదంతా చేస్తున్నారా... ఒక వేళ మీడియా చెబుతున్న కథనాలు తప్పు అయితే, అకున్ సభర్వాల్ అండ్ టీం ఎందుకు ఖండించడం లేదు... వర్మ ఇలా వరుసగా ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో బ్రేక్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని భావించి షోకి విరామం తీసుకున్నారు. తిరిగి మొదలవగానే, ఎందుకో తెలియదు కానీ, టాపిక్ డైవర్ట్ అయిందనే చెప్పాలి. వర్మ గల గలా ప్రశ్నలు సంధింస్తుంటే కొన్ని సమయాల్లో నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది. వర్మ భలే ఆడుకున్నాడు అని సగటు ప్రేక్షకుడు సదరు దర్శకుడికి కితాబిచ్చాడు.