బాలయ్య, చిరులకు పోటీ లేనట్లేనా..?
on Oct 24, 2016
సంక్రాంతి పండుగ తెలుగు సినిమాకు అతిపెద్ద సీజన్. ఈ టైంలో లాభాలు పండించుకోవడానికి కనీసం నాలుగైదు సినిమాలు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. మూడు దశాబ్దాలుగా తెలుగు తెరను తమ భుజాలపై మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు చాలా రోజుల తర్వాత తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
వీటిలో చిరు, బాలయ్యల సినిమాలు స్పెషల్..ఎందుకంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా తెరకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150వ సినిమాతో ద్వారా తిరిగి రీ-ఎంట్రీ ఇస్తుండటం..బాలకృష్ణ తన 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణిని రిలీజ్ చేస్తుండటంతో ఈ రెండు సినిమాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో నాగార్జున నమో వెంకటేశాయ, వెంకటేష్ గురు కూడా రిలీజ్ చేస్తున్నట్లు ముందే చెప్పేశారు. నాలుగు వేరు వేరు కథలు కాబట్టి ఎవరి ప్రేక్షకులు వాళ్లకి ఉంటారు కాబట్టి ఒకేసారి రిలీజ్ చేసినా నష్టం ఉండదని భావించారు. అయితే ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎవరికీ పెద్దగా లాభం ఉండదని ఈ ఏడాది సంక్రాంతి రుజువు చేయడంతో నాగ్, వెంకీలు బరిలోంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తుది పోటీ బాలయ్య, చిరుల మధ్యేనన్నమాట..!