మోహన్‌లాల్ గొడవ... కొరటాల ఏమన్నాడు?
on Aug 27, 2016
జనతా గ్యారేజ్ చుట్టూ ఎన్ని గాసిప్పులో. మోహన్ లాల్కీ, జనతా గ్యారేజ్ టీమ్కీ చెడిందని.. ఓ వార్త గుప్పుమంది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని మోహన్‌లాల్ పట్టుపట్టాడని, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మోహన్‌లాల్ పాత్ర కోసం మరొకరితో డబ్బింగ్ చెప్పించారని, దాంతో మోహన్ లాల్ దర్శక నిర్మాతలపై అలకబూనాడని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. వీటిపై జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. డబ్బింగ్ విషయంలో మోహన్‌లాల్‌తో ఎలాంటి విబేధాలూ లేవని, తన పాత్రకు మరొకరితో డబ్బింగ్ చెప్పించాలన్న నిర్ణయం పూర్తిగా మోహన్‌లాల్‌దే అని క్లారిటీ ఇచ్చాడు.
స్వతహాగా మలయాళీ అయిన మోహన్‌లాల్‌కు తెలుగు అంతగా రాదని, పైగా పల్లెటూరి యాస లో మాట్లాడాల్సివచ్చినప్పుడు ఆయన బాగా ఇబ్బంది పడతారని, అయినాసరే బలవంతంగా డబ్బింగ్ చెప్పిస్తే.. ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని అందుకే ఆ నిర్ణయం తీసుకొన్నామని సెలవిచ్చాడు కొరటాల. అయితే అది పూర్తిగా మోహన్‌లాల్ నిర్ణయమేనట. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని అలాంటప్పుడు ఈ వార్త ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నాడు. ''డబ్బింగ్ ఎవరితో చెప్పించాలన్న విషయంపై ఎక్కువగా ఆలోచించలేదు.
నిజానికి మా అందరికీ మోహన్ లాల్‌తోనే డబ్బింగ్ చెప్పించాలని ఉంది. దానికి కనీసం రెండు నెలల సమయం తీసుకోవాల్సివుంటుంది. దానికీ సిద్దపడ్డాం. కానీ.. తెరపై చూసుకొంటుంటే అంత స్పష్టత రావడం లేదు. దాంతో మోహన్ లాల్ మరొకరితో డబ్బింగ్ చెప్పించుకోండి అన్నారు'' అని చెప్పుకొచ్చాడు. మరి మోహన్ లాల్ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికి గానీ.. ఈ క్లాష్ పై ఓ క్లారిటీ రాదు.