మళ్లీ చక్రం తిప్పిన అల్లు అరవింద్..!
on Aug 27, 2016
తన 150వ సినిమాని మొదలెట్టడానికి సంవత్సరాల సమయం తీసుకొన్నాడు చిరంజీవి. దాదాపు ఇరవై కథలు విన్నాడు. పదిమంది దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి కత్తి రీమేక్ తీసుకెళ్లి వినాయక్ చేతిలో పెట్టారు. ఆ సినిమా ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఆ వెంటనే 151వ సినిమా కూడా మొదలెట్టేయాలన్న ఆలోచనలో ఉన్నాడు చిరు. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయన్నది ఇన్సైడ్ వర్గాల వారి మాట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. నిజానికి 150వ సినిమానే గీతా ఆర్ట్స్ చేతుల్లోకి వెళ్లాల్సింది. కానీ చరణ్ ఈ సినిమా చేయాలని ఆసక్తి చూపించడంతో.. అల్లు అరవింద్ డ్రాప్ అయ్యాడు. అయితే 151వ సినిమాని నిర్మించే ఛాన్స్ మాత్రం చేజిక్కించుకొన్నాడు. తన సంస్థలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో అల్లు అరవింద్ మంతనాలు జరుపుతున్నట్టు టాక్. చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేయమని బోయపాటికి సూచించార్ట. అందుకు బోయపాటి కూడా సై అన్నట్టు టాక్. బాలయ్యతో బోయపాటి తీసిన సింహా, లెజెంట్ కథలు ముందుగా చిరు దగ్గరకే వెళ్లాయి. చిరు నో చెప్పడంతో.. ఆ సినిమాల్ని బాలయ్య చేసి బంపర్ హిట్లు కొట్టాడు. ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ పక్కా అయినట్టే.