చరణ్‌ని 'మెగాస్టార్' చేసేశారా??
on Aug 23, 2016
వారసత్వం కింద ఏదైనా సరే, పంచుకోవడానికి రెడీ అయిపోతారు టాలీవుడ్ హీరోలు. తండ్రి కథల్ని రీమేక్ చేస్తారు. పాటల్ని రీమిక్స్ చేసుకొంటారు. టైటిళ్లను ఎడా పెడా వాడేస్తుంటారు. ఇప్పుడు బిరుదుల్నీ లాగేసుకొంటున్నారు. చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చరణ్. తనయుడికీ ఏదో ఒక బిరుదు కావాలి కదా? అందుకే మెగా పవర్ స్టార్ అని అతికించారు. మెగాస్టార్‌లోని మెగా, పవర్ స్టార్‌లోని పవర్ కలిపి అలా అన్నారన్నమాట. అయితే చరణ్ దృష్టి ఇప్పుడు ఏకంగా 'మెగాస్టార్' బిరుదుపైనే పడినట్టుంది. ఒకవేళ చరణ్‌కి ఆ ఉద్దేశం ఉన్నా, లేకున్నా మిగిలిన మెగా హీరోలకు మాత్రం మెగాస్టార్ అనే బిరుదు చరణ్‌కి అంకితం చేసేయాలనిపిస్తోందేమో? అందుకే స్వయంగా బన్నీనే 'మెగాస్టార్ రామ్ చరణ్' అనే శాడు. చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకల్లో చరణ్‌కి మెగాస్టార్ బిరుదు అంటగట్టాడు బన్నీ. ఈ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు 'మెగాస్టార్ కావాలి.. మెగాస్టార్ కావాలి' అని అరిచారు. వెంటనే బన్నీ స్టేజీ ఎక్కేసి 'మెగాస్టార్ ఇక్కడే ఉన్నాడు కదా' అన్నాడు చరణ్‌ని చూపిస్తూ. అభిమానులతో పాటు చరణ్‌కీ బన్నీ భావం అర్థమైంది. 'నేను మెగాస్టార్ ఏంటి' అంటూ చరణ్ ముసిముసిగా నవ్వుకొన్నాడు. ఇక నుంచి చరణ్‌కి కూడా... మెగాస్టార్ అనే పిలవాలేమో? ఎందుకంటే బన్నీఅల్టీమేట్టం జారీ చేసేశాడు కదా?