"రాజాధి రాజా" రివ్యూ!
on Jun 26, 2016
నటీనటులు: శర్వానంద్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, సంతానం, మనోబాల తదితరులు..
సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫి: సిద్దార్థ్
ఎడిటింగ్: జి.రామారావు
రచన-దర్శకత్వం: చేరన్
విడుదల తేదీ: 24/6/2016
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్ హీరోగా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ నిత్యమీనన్ హీరోయిన్ గా నటించిన 'రాజాధిరాజా' చిత్రం గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వచ్చింది. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శర్వానంద్-నిత్యమీనన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రానికి చేరన్ దర్శకత్వం వహించారు.
కథ:
డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుందని నమ్మే వ్యక్తి జెకె (శర్వానంద్). అన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తూ హ్యాపీగా ఉండేవాడు. నిత్యా(నిత్యామీనన్) స్వతంత్ర భావాలున్న వ్యక్తి. జెకెతో ప్రేమలో పడుతుంది నిత్యా. జెకె డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాడు. ఇంతకీ ఏంటి ఆ అడ్డంకులు ఏంటి? మరి ఆ సమస్యలను అన్నింటిని దాటుకొని జెకె తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయం వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకు శర్వానంద్, నిత్యమీనన్ లు ప్లస్ పాయింట్స్ గా నిలిచారని చెప్పుకోవచ్చు. నిత్యామీనన్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. తన క్యుట్ స్మైల్, హావభావాలతో అలరించింది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నిత్యామీనన్ కాస్త డీ గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇక శర్వానంద్ తన పాత్రకు తగిన న్యాయం చేసాడు. శర్వా-నిత్యాల మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. కొన్ని సీన్లలో ఇద్దరు పోటీపడి నటించినట్లుగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ మరోసారి తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. సంతానం పాత్ర ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలు పర్వాలేదనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ మాత్రమే ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. విజువల్స్ పరంగా చాలా అందంగా చూపించారు. సిద్ధార్థ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దర్శకుడిగా చేరన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కథ విషయంలో ఎలాంటి కొత్తదనం లేకుండా ఉంది. స్క్రీన్ ప్లే మరీ బోర్. సినిమా ప్రారంభం అయిన క్షణం నుంచి చివరి వరకు కూడా చూసే ప్రేక్షకులకు నీరసం వచ్చేలాగా అనిపిస్తుంది. జి.వి. ప్రకాష్ అందించిన సంగీతం అస్సలు బాగోలేదు. పాటలు ఒక్కటి కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగోలేదు. ఎడిటింగ్ చాలా చెత్తగా వుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
విశ్లేషణ:
'రాజాధిరాజా'కు మేజర్ మైనస్ పాయింట్ స్టొరీ. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. కథలో కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమి లేకపోవడం పూర్తిగా మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కథలో దమ్ములేకపోయినా కనీసం స్క్రీన్ ప్లే విషయంలో అయినా కాస్త కేర్ తీసుకొని వుంటే బాగుండేది. కానీ సినిమా అంతా కూడా బోరింగ్ గా మారింది. ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. శర్వానంద్-నిత్యామీనన్ ల నటన పక్కన పెడితే వారి క్యారెక్టర్లను కూడా సరైన విధంగా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక వీరు కాకుండా మిగతా క్యారెక్టర్లు అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. గతంలోని వీరి సినిమాకు కెమిస్ట్రీ పరంగా మంచి మార్కులు పడటంతో ఈ 'రాజాధిరాజా' సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. కానీ ఈ సినిమాలో అలాంటి కెమిస్ట్రీ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని కాకుండా సినిమా అంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ ఉండదు. అక్కడక్కడ కామెడి కోసం కావాలనే కొన్ని సీన్లు ఇరికించినట్లుగా అనిపిస్తుంది.
రేటింగ్: 1.5/5