చిరు 150 ఓపెనింగ్ కు అభిమానులు రావద్దు..!
on Apr 28, 2016
ఎట్టకేలకు చిరు 150వ సినిమా ఏప్రిల్ 29 న ప్రారంభమౌతోంది. ఎన్నో తర్జన భర్జనలు పడిన మెగాస్టార్ చివరికి కత్తి రీమేక్ కే ఫిక్సయ్యారు. మెగా ఫ్యాన్స్ మాత్రం అసలు ఏదొక సినిమా ముందు స్టార్ట్ చేసేయ్ అన్నయ్యా అంటూ చిరును తొందరపెడుతూ వస్తున్నారు. అందుకే ముహూర్తం అనగానే, వాళ్లందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 150 కు అయినట్టుగా కాకుండా, తర్వాత నుంచి వరసగా స్పీడుగా చిరు సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతారనేది మెగాఫ్యాన్స్ ఆశ. కాగా ఏప్రిల్ 29 మధ్యాహ్నం 1.30 కు సినిమా ముహూర్తం షాట్. రెగులర్ షెడ్యూల్ ను మే దాటిన తర్వాత స్టార్ట్ చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ట్ అవుతున్న చిరు సినిమా కావడంతో, ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున స్పాట్ కు వచ్చేస్తారేమోనని చిరు ముందుగానే ఫ్యాన్స్ ను రావద్దని వారించారు. అందుక్కారణం లేకపోలేదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గతంలో తాను నివసించిన ఇంటినే ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ కు ఆఫీస్ గా చిరు మార్చుకున్నారు. ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్ గా, నిరాడంబరంగా జరిపేయాలని చిరు అనుకుంటున్నారు. ఇలాంటి టైం లో ఆఫీస్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకుండా భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటే మెగా టీం కు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అసలే వేసవి కావడంతో అభిమానులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారనే భయంతోనే చిరు వద్దంటున్నారని మెగా క్యాంప్ అంటోంది. సో అభిమానులూ..ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి టీవీ లో చూసి ఆనందించడం బెటర్..